బెంబేలెత్తిస్తున్న కుక్కలు, కోతులు
ABN , First Publish Date - 2023-09-09T00:49:35+05:30 IST
త్రిపురాంతకం పట్టణంలో కొంత కాలంగా కుక్కలు, కోతులు, పందుల బెడద ఎక్కువైంది.
త్రిపురాంతకం, సెప్టెంబరు 8: త్రిపురాంతకం పట్టణంలో కొంత కాలంగా కుక్కలు, కోతులు, పందుల బెడద ఎక్కువైంది. పట్టణంలోని అన్ని ప్రాంతాలలో వానరాలు స్వైరవిహారం చేస్తున్నాయి. పందులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ చిన్నపిల్లలను కరుస్తున్నాయి. అధికారులు ఈ సమస్యలను పట్టించుకోకుండా తమకేమవుతుందిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వీటి వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తారాస్థాయికి చేరుకున్నాయి. పత్రికలలో కథనాలు వచ్చినప్పుడు మాత్రం నామ మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు.
పట్టణంలోని బ్రహ్మంగారికాలనీ, ఎన్నెస్పీ కాలనీ, అంబేద్కర్ కాలనీ, దగ్గులవారివీధి, ఉత్తరపు బజారుతోపాటు, ప్రధాన రహదారి ప్రాంతాలలో వానరాల బెడద ఎక్కువైంది. మందలు మందలుగా తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇళ్లలోకి దూరి తినుబండారాలు పాత్రలు, సీసాలతో సహా ఎత్తుకెళ్తున్నాయి. అడ్డగించిన వారిని కరుస్తూ భయపెడు తున్నాయి. ప్రజలు కోతులతో ఇబ్బందులు పడి అదిలించ బోయినా పైనబడి కరుస్తుండడంతో గాయాలపాలవు తున్నారు. రెండేళ్ల క్రితం పంచాయితీ ఆద్వర్యంలో కొన్ని కోతులను పట్టించినా మిగిలినవాటి సంతతి పెరగడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
రేబిస్ వ్యాపింపజేస్తున్న కుక్కలు
త్రిపురాంతకంలో వివిధ ప్రాంతాలలో కుక్కల బెడద కూడా అధికంగా ఉంది. ఇవి కూడా గుంపులు గుంపులు గా తిరుగుతుంటాయి. చిన్న పిల్లలను గాయపరచిన ఘటనలు కూడా అనేక ఉన్నాయి. రేబిస్‌వ్యాధి కుక్కల ద్వారా కుక్క కరిచినప్పుడు వస్తుంది. పలు ప్రాంతాలలో పిచ్చికుక్కలు చిన్నారులను, పెద్దలను కరచి వారిని వారిని గాయపరిచిన ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ, అధికారులు ఈ సమస్యపై దృష్టిసారించడం లేదు.
యథేచ్ఛగా పందుల స్వైరవిహారం
వ్యాధులు వ్యాపింపజేయడంలో ముందుండే పందులు అన్ని వీధులలో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. చిన్నారులకు మెదడువాపు, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి జ్వరాలు వ్యాపింపజేయడంలో పందులది కీలక పాత్ర. బ్రహ్మంగారికాలనీ, అంబేద్కర్ కాలనీ, ఉప్పలగుట్ట, ఎన్నెస్పీ కాలనీ ప్రాంతాలతోపాటు శివారు కాలనీలలో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. విపరీతంగా సంతానాన్ని పెంచుకుంటూ పరిసరాలను అపరిశుభ్ర పరుస్తున్నాయి. వీటిని అధికారులు ఊరికి దూరంగా తరలించాల్సి ఉంది. కుక్కలు, కోతులు, పందుల బెడద తీర్చాలని అనేకమార్లు గ్రామస్తులు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం మాత్రం ఉండడం లేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు.






