ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 వెండినాణెం.. నిర్మలా సీతారామన్‌కు పురందేశ్వరి కృతజ్ఞతలు
ABN, First Publish Date - 2023-02-16T21:28:55+05:30
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ (NTR) శతజయంతిని పురష్కరించుకొని ఆయనకు అరుదైన గౌరవాన్ని కల్పించాలని ఇటివల
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ (NTR) శతజయంతిని పురష్కరించుకొని ఆయనకు అరుదైన గౌరవాన్ని కల్పించాలని ఇటివల కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఆయన పేరిట వంద రూపాయల వెండి నాణేం ముద్రణకు నిర్ణయించింది. మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడంలో అన్ని విధాల సహకరించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)కు ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి (Purandeswari) కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు గురువారం తెలంగాణకు వచ్చిన సీతారామన్‌ను స్వయంగా కలిశారు. ఈ విషయాన్ని ట్విటర్ (Twitter) వేదికగా ఆమె పంచుకున్నారు. ‘‘నందమూరి తారక రామారావు గారి బొమ్మ 100 రూపాయల నాణెం మీద ముద్రించబడుతుంది. శతజయోత్సవంలో ఇది ఒక మైలురాయి. నన్ను అనుగ్రహించిన భగవంతుడుకి, నన్ను ఆశీర్వదించిన నా తండ్రికి మరియు అన్నివిధాల తన సహకారం అందించిన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి నా ధన్యవాదాలు. మింట్ (ఆర్థికశాఖ) అధికారులను కలవడం జరిగింది’’ అంటూ పురందరేశ్వరి పేర్కొన్నారు.
ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 వెండినాణెం
ఎన్టీఆర్ పేరిట వంద రూపాయల వెండి నాణేన్ని ముద్రించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ముద్రణకు కేంద్రం శ్రీకారం కూడా చుట్టింది. ఈ నేపథ్యంలోనే పురందేశ్వరితో మింట్ అధికారులు హైదరాబాద్‌లో సమావేశమై ఆమె సూచనలు, సలహాలు తీసుకుని డిజైన్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. త్వరలోనే ఈ నాణేన్ని విడుదల చేసే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్టీఆర్ పేరిట నాణెం జారీ చేయాలని పురందేశ్వరి గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.
1964 నుంచి నాణేలు విడుదల
2022 మే 28న తేదీ నుంచి ఎన్టీఆర్ శత జయంతి వేడుకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ వెండి నాణెం విడుదల చేయాలని కేంద్రం భావించింది. చారిత్రక ఘటనలు ప్రముఖుల గుర్తుగా వెండి నాణెలు విడుదల చేయడం ఆనవాయితీ వస్తోంది. 1964 నుంచి నాణేలను విడుదల చేస్తోంది కేంద్రప్రభుత్వం. మొదటిసారి మాజీ ప్రధాని నెహ్రూ వెండి నాణెం విడుదల చేయడం గమనార్హం. ఆనవాయితీలో భాగంగా ఈ సారి ఎన్టీఆర్ పేరుతో వెండి నాణేన్ని విడుదల చేయడం పట్ల కుటుంబసభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-02-16T21:28:57+05:30 IST