Ram Gopal Varma: రాంగోపాల్‌వర్మ వ్యాఖ్యలతో దుమారం
ABN, First Publish Date - 2023-03-15T21:27:24+05:30
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (Nagarjuna University)లో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో బుధవారం సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (Nagarjuna University)లో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో బుధవారం సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ (Ram Gopal Varma) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నచ్చింది తిని, తాగి ఎంజాయ్ చేయండని చెప్పారు. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళితే అక్కడ రంభ, ఊర్వశిలు ఉండకపోవచ్చు అని... కాబట్టి బతికున్నప్పుడే జీవితాన్ని ఎంజాయ్ చేయాలని సూచించారు. నచ్చిన విధంగా బతకాలని, ఎవరు కూడా హార్డ్‌వర్క్ (Hard work) చేయకుండా, ఉపాధ్యాయుల మాటలు పట్టించుకోకుండా ఇష్టానుసారం జీవించాలన్నారు. తాను వెనుక బెంచీలో కూర్చునేవాడనని, కష్టపడి చదివేవారు ఎప్పుడూ పైకి రారన్నారు. ఏదైనా వైరస్ వచ్చి నేను తప్ప మగ జాతి అంతా పోవాలని, అప్పుడు తానొక్కడినే స్త్రీ జాతికి దిక్కవుతానని అన్నారు. విద్యార్థులకు చదువు పట్ల, జీవితం పట్ల దిశా నిర్దేశం చేయాల్సిన ఆయన తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి అంటూ వ్యాఖ్యానించడాన్ని విశ్వవిద్యాలయ వీసీ రాజశేఖర్ తప్పు పట్టకపోవడం గమనార్హం.
వర్మ వ్యాఖ్యలతో దుమారం
వర్సిటీలో వర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. విశ్వవిద్యాలయానికి ఇటువంటి వారిని ఆహ్వానించి, విద్యార్థులకు ఇచ్చే సందేశం ఇదేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను బాధ్యత కలిగిన వీసీ సమర్థించడాన్ని మహిళా ఉద్యోగులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. సాక్షాత్తు సరస్వతి దేవి కి నిలయమైన విద్యాలయంలో వర్మ వ్యాఖ్యలను విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తప్పు పడుతున్నారు. విద్యాబుద్థులు చెప్పి, విద్యార్థులను సన్మార్గంలో నడవాలని చెప్పాల్సింది పోయి, ఇష్టరాజ్యంగా వర్మ వ్యాఖ్యలు చేయడం సర్వత్ర విమర్శలకు దారి తీసింది. వర్మ వ్యాఖ్యలపై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, వర్సిటీ మహిళా ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-03-15T21:27:24+05:30 IST