APSRTC: ఆర్టీసీ 2736 కొత్త బస్సులు: ద్వారకా తిరుమలరావు
ABN, First Publish Date - 2023-03-07T21:34:47+05:30
పీఎస్‌ఆర్టీసీ (APS RTC) కొత్త బస్సుల కొనుగోలుకు సమాయత్తమైంది. రానున్న రోజులలో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం..
విజయవాడ: ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) కొత్త బస్సుల కొనుగోలుకు సమాయత్తమైంది. రానున్న రోజులలో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం 2736 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నది. కొత్త బస్సుల కొనుగోలుకు సీఎం జగన్ (CM Jagan) ఆమోదించారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు (Dwarka Tirumala Rao) చెప్పారు. రూ. 572 కోట్ల వ్యయంతో 1500 కొత్త డీజిల్ బస్సులు (Diesel buses), గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ / ఓపెక్స్ మోడల్ వెయ్యి ఎలక్ట్రానిక్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. మరో 200 బస్సులను డీజిల్ నుంచి ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చనున్నామన్నారు. త్వరలో కర్నాటక (Karnataka) తరహాలో 15 మీటర్ల అంబానీ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. మరో 36 అద్దె బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు. 2018లో టెండర్ కమ్ ఆక్షన్ ద్వారా ఆయిల్ కొనుగోలు చేశామని, అప్పుడు లీటర్‌కు రూ 1.92 రాయితీ ఇచ్చారని, దీంతో ఏడాదికి రూ 52 కోట్ల ఆదాయం వచ్చిందని ద్వారకా తిరుమలరావు తెలిపారు.
2021-2022 సంవత్సరానికి గాను 129 డిపోలకు సంబంధించి రివర్స్ ఆక్షన్ ప్రాసెస్‌లో ఈ టెండరింగ్ విధానాన్ని అమలు చేశామన్నారు. 2022 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి వరకు లీటర్‌కు రూ 5.87 రాయితీలో ఆయిల్ సరఫరా చేసేందుకు మూడు సంవత్సరాల కాలానికి టెండరు ఖరారు చేశామని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో సగటున రాయితీ ఇచ్చిన సందర్భం ఇప్పటి వరకు లేదన్నారు. కిందటేడాది ఫిబ్రవరి 16 వతేదీ నుంచి బల్క్ అయిల్ రేట్లు బాగా పెరిగాయని, 2013లో మాత్రమే ఇలా భారీగా ధరలు పెరిగాయని తెలిపారు. ఈ కారణంగా రిటైల్ అవుట్ లెట్ల ద్వారా హైస్పీడ్ డీజిల్ అయిల్ కొనుగోలు చేశామని, దీనివల్ల కార్పోరేషన్‌కు లబ్ది చేకూరిందని వివరించారు. ఈ నెల 2వ తేదీ నుంచి 129 డిపోలకు నేరుగా హెచ్‌ఎస్‌డీ ఆయిల్ కొనుగోలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చినట్లు ద్వారకా తిరుమలరావు తెలిపారు.
Updated Date - 2023-03-07T21:34:47+05:30 IST