మూడు రోజులకు రూ.25వేలు.. వారికి కాసులు కురిపిస్తున్న సంక్రాంతి
ABN, First Publish Date - 2023-01-13T19:52:32+05:30
రెండు రోజులకు.. మూడు రోజులకు వసతి రూ.20 వేల నుంచి రూ.25 వేల లాడ్జీ బిల్లు. ఇదేదో స్టార్ హోటల్ (Star Hotel) అనుకోవద్దు..
భీమవరం: రెండు రోజులకు.. మూడు రోజులకు వసతి రూ.20 వేల నుంచి రూ.25 వేల లాడ్జీ బిల్లు. ఇదేదో స్టార్ హోటల్ (Star Hotel) అనుకోవద్దు.. ఓ మోస్తరు హోటళ్ళలో గదులకు ఇప్పుడు పలుకుతున్న డిమాండ్ ఇది.. సంక్రాంతి (Sankranti)కి ఏటా ఇదే పరిస్థితి. అయితే ఈసారి కాస్త మోతాదు పెరిగి అద్దె మోత మోగుతుంది. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)కు వచ్చే బంధువుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రైవేటుగా బంధువులు స్నేహితుల నివాసాలు, వారి గెస్ట్‌హౌస్‌లు నిండుకోవడంతో నాలుగు రోజులు భీమవరం (Bhimavaram) వచ్చేవారి కోసం ఇక్కడ వసతి డిమాండ్ పెరిగింది. ఉన్న హోటళ్ళు, లాడ్జీలన్నీ గతంలోనే ఆన్‌లైన్ ద్వారా ఫోన్ ద్వారాను రిజర్వు చేసుకున్నారు. యాజమాన్యాలు కూడా కొన్ని గదును అట్టే ఉంచుకున్నారు. పండగ దగ్గరకి వచ్చిన తరువాత వాటికి ఉన్న డిమాండ్ బట్టి చార్జీలు వసూలు చేసుకునే ప్రయత్నం విజయవంతం అవుతున్నాయి. వచ్చే వారిలో ఇందులో మూడు వంతులు మంది బంధువులు, స్నేహితులు కావడంతో వారికి వసతికి ఇబ్బంది లేదు. ఈ ప్రాంతంలో సాంప్రదాయాలను చూడటానికి, కోడి పందేలు చూసేందుకు, కొందరు పాల్గొనడానికి వచ్చేవారి సంఖ్య లక్షపైగా ఉంటుంది.
వీరిలో చాలా మంది తమ వాహనాల్లోనే మూడు రోజులు పాటు బస చేసే అలవాటు కొనసాగిస్తున్నారు. మిగిలిన జనానికి ఇప్పటికే బుక్ చేసుకున్న హోటళ్ళు సరిపోగా.. వేల మందికి మాత్రం ఇక్కడ వసతి లేదు. వీరికి వసతికి డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో అనేక సిఫార్సులు, అధికార పార్టీ నుంచి ఒత్తిళ్ళు మొదలయ్యాయి. అధికార పార్టీ నాయకుల ద్వారా, సన్నిహతుల ద్వారా చాలా ఒత్తిడి పెరుగుతున్నాయి అంటున్నారు. మరోవైపు పోలీస్‌శాఖ ద్వారా కొంత మంది వీఐపీల కోసమో, వారికి కావాల్సిన వారి కోసమో సిఫార్సులు ప్రారంభించారు. కొందరు తీవ్ర ఒత్తిడి కూడా తీసుకున్నట్లు తెలిసింది. రెండు రోజులకు ఎంత డబ్బులు అయినా సరే వసతి కావాల్సిందే అన్నవారు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్లాక్ చేసిన కొన్ని గదులు ముందస్తుగా అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్న గదులు, చివరి నిమిషంలో కొన్ని రద్దు చేసుకున్న గదులు ఇప్పుడు మంచి ధర రావడానికి మార్గం ఏర్పడింది. రెండు నుంచి 3000 - 4000 ధర పలికే గదులన్నీ ఇప్పుడు మూడు రోజులకు 20-25 వేలకు పలుకుతున్నాయి. వాటి కూడా డిమాండ్ పెరిగిందని సమాచారం. చాలా మంది బంధుమిత్రుల వసతిని సర్ధుబాటులో గడిపేస్తారు. అయినప్పటికీ వచ్చే వారి సంఖ్య వెలల్లో ఉండటంతో భీమవరం ప్రాంతంలో వసతి సమస్యకు ఇలా డిమాండ్ ఏర్పడింది.
Updated Date - 2023-01-13T19:52:35+05:30 IST