Duronto Express: హమ్మయ్య.. గుంటూరు మీదుగా రాకపోకలు సాగించే ఈ ట్రైన్‌లో..
ABN, First Publish Date - 2023-02-07T18:00:32+05:30
వారంలో 3 రోజులు గుంటూరు మీదుగా రాకపోకలు సాగించే సికింద్రాబాద్ - విశాఖపట్టణం - సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్‌లో కొత్తగా ఒక ఎస్‌ఎల్‌ఆర్ బోగీని..
గుంటూరు (ఆంధ్రజ్యోతి): వారంలో 3 రోజులు గుంటూరు మీదుగా రాకపోకలు సాగించే సికింద్రాబాద్ - విశాఖపట్టణం - సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్‌లో (Duronto Express) కొత్తగా ఒక ఎస్‌ఎల్‌ఆర్ బోగీని (SLR Coach) జోడించారు. ఇప్పటివరకు ఈ రైలు కేవలం ఏసీ బోగీలతో (AC Coaches) మాత్రమే ప్రయాణిస్తోండగా ఈ నెల 8వ తేదీ నుంచి ఎస్‌ఎల్‌ఆర్ బోగీని (SLR Coach) జోడిస్తోన్నట్లు రైల్వేశాఖ (Indian Railway) ప్రకటించింది. దీని వలన గార్డు ఉండే సీటింగ్ కమ్ లగేజ్ వ్యాన్ రేక్‌లో 20 సెకండ్ సిట్టింగ్ సీట్లు ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే సికింద్రాబాద్ వైపు నుంచి 2ఎస్ సీట్లకు బుకింగ్ కూడా ఆన్‌లైన్‌లో తెరిచారు. సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు (SC to GNT) ఈ టిక్కెట్ ప్రారంభ ధర రూ.165గా నిర్ణయించారు. డైనమిక్ ఛార్జీలు ఈ రైలుకు వర్తిస్తాయి కాబట్టి ఒక్కో టిక్కెట్‌కి ఛార్జీ మారిపోతుంటుంది.
వెయిటింగ్ లిస్టుకు వెళ్లేసరికి టిక్కెట్ ధర రూ.220కి చేరుతుంది. కేవలం 3 గంటల 43 నిమిషాల వ్యవధిలో సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు ఈ రైలు వస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఎల్‌ఆర్ బోగీలో ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. అలానే ఈ రైలులో గుంటూరు నుంచి విశాఖపట్టణంకు ప్రయాణించాలంటే 2ఎస్ టిక్కెట్ ప్రారంభ ధర రూ.200 మాత్రమే. డైనమిక్ ఫైర్‌తో చివరి టిక్కెట్ బుకింగ్ రూ. 265కి చేరుతుంది. రాత్రి 11.55 గంటలకు గుంటూరులో ఎక్కితే ఉదయం 6.25కి విశాఖపట్టణం చేరుతుంది. కాగా విశాఖపట్టణం వైపు నుంచి ఈ రైలుకు ఇంకా 2ఎస్ బుకింగ్‌ని ఆ డివిజన్ ఆన్‌లైన్‌లో ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురాలేదు.
Updated Date - 2023-02-07T18:01:18+05:30 IST