TTD: కొవిడ్ తరువాత పెరుగుతున్న శ్రీవారి ఆదాయం
ABN, First Publish Date - 2023-03-25T19:35:40+05:30
శ్రీవారి హుండీ ఆదాయం, వివిధ బ్యాంకుల్లో ఉన్న పెట్టుబడులే టీటీడీకి ప్రధాన ఆదాయవనరులుగా మారాయి. ఇటీవల టీటీడీ (TTD) ప్రవేశపెట్టిన
తిరుమల: శ్రీవారి హుండీ ఆదాయం, వివిధ బ్యాంకుల్లో ఉన్న పెట్టుబడులే టీటీడీకి ప్రధాన ఆదాయవనరులుగా మారాయి. ఇటీవల టీటీడీ (TTD) ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెటే (Annual Budget) ఇందుకు నిదర్శనం. రూ.4,411.68 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన టీటీడీ రూ.2,581 కోట్లు హుండీ, పెట్టుబడుల ద్వారానే వస్తాయని పేర్కొంది. అంటే సగభాగం ఈ రెండింటి ద్వారానే కన్పిస్తోంది. కొవిడ్ ముందువరకు కూడా టీటీడీకి హుండీ ద్వారా ఏడాదికి రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.1,200 కోట్లు వచ్చేవి. ఇందులో భాగంగానే 2022-23 వార్షిక బడ్జెట్‌లోనూ టీటీడీ రూ.వెయ్యి కోట్ల ఆదాయం సమకూరుతుందని పేర్కొంది. అయితే ఊహించని విధంగా గడిచిన ఏడాదిలో రూ.1,613 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. గతంలో రోజుకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉండే హుండీ ఆదాయం కొవిడ్ అనంతరం రూ.3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పెరిగింది. తిరుమల (Tirumala) చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జనవరి 2వ తేదీన రూ.7.68 కోట్లు లభించాయి. అంతకుముందు కూడా కొన్ని రోజుల్లో రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు హుండీ ఆదాయం వచ్చిన సందర్భాలున్నాయి. కొవిడ్ సమయంలో తిరుమలకు రాలేకపోయిన భక్తులు, కరోనా నుంచి ఆరోగ్యం కుదుటపడితే కానుకలు సమర్పిస్తామనుకున్నవారు, ముడుపులు కట్టుకున్నవారు, కరోనా అనంతరం వ్యాపారాలు పుంజుకున్న భక్తులు (Devotees) హుండీలో భారీగా కానుకలు సమర్పించడంతోనే ఈ ఆదాయం లభిస్తోందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రానున్న ఏడాదికి రూ.1,591 కోట్ల హుండీ ఆదాయం సమకూరుతుందని టీటీడీ భావిస్తోంది.
మరోవైపు వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై వచ్చే హుండీ ఆదాయం రూ.668.51 కోట్లు ఉంటుందని టీటీడీ అంచనా వేయగా, కొవిడ్ అనంతరం పెరిగిన వడ్డీ ధరలతో ఏకంగా రూ.813 కోట్లు లభించింది. ఇందులో భాగంగానే పెరిగిన వడ్డీ ధరలను దృష్టిలో పెట్టుకున్న టీటీడీ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.990 కోట్లు మేరకు వస్తుందని అంచనా వేసింది. మొత్తం మీద టీటీడీకి కొవిడ్ కలిసి వచ్చిన అవకాశంగా మారిపోయింది. మరోవైపు ప్రసాదాల విక్రయాల ద్వారా టీటీడీకి రూ.365 కోట్లు వస్తుందని గత బడ్జెట్‌లో అంచనా వేయగా, ఏకంగా రూ.500 కోట్లు లభించాయి. ఈ క్రమంలోనే నూతన బడ్జెట్‌లోనూ రూ.500 కోట్ల ఆదాయం సమకూరుతుందని టీటీడీ భావిస్తోంది.
Updated Date - 2023-03-25T19:35:40+05:30 IST