Summer Heat: జూన్ వచ్చి 15 రోజులకు పైనే అవుతున్నా ఈ ఎండలేంట్రా బాబోయ్ అనిపిస్తుందా.. ఇంకెన్ని రోజులంటే..
ABN, First Publish Date - 2023-06-17T13:18:36+05:30
మరో నాలుగు రోజులు అధిక ఉష్ణోగ్రతలు తప్పవని వాతావరణ శాఖ సంచాలకురాలు స్టెల్లా స్పష్టం చేశారు. 21వ తేదీ నాటికి వాతావరణంలో మార్పులు వస్తాయని ఆమె వివరించారు. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలపై ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
మరో నాలుగు రోజులు మంటలే
ఈనెల 21 నాటికి జిల్లాకు రుతుపవనాల రాక
ఉత్తర, పశ్చిమ గాలుల వల్లే అధిక ఉష్ణోగ్రతలు
‘ఆంధ్రజ్యోతి’తో వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా
మే నెల ముగిసింది. జూన్ మాసం సగమైంది. అయినా ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణీ కార్తెను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏటా జూన్ రెండో వారం నాటికి నైరుతి రుతుపవనాలు వాతావరణాన్ని చల్లబరిచేవి. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మరో నాలుగు రోజులు అధిక ఉష్ణోగ్రతలు తప్పవని వాతావరణ శాఖ సంచాలకురాలు స్టెల్లా స్పష్టం చేశారు. 21వ తేదీ నాటికి వాతావరణంలో మార్పులు వస్తాయని ఆమె వివరించారు. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలపై ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
అధిక ఉష్ణోగ్రతలకు కారణం ఏమిటి?
ఏటా రాజస్థాన్ నుంచి వేడిగాలులు బలంగా వీస్తాయి. వాటి ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లోనూ వడగాలులు వీస్తాయి. ప్రస్తుతం ఉత్తర, పశ్చిమ దిశ నుంచి వేడిగాలులు తెలుగు రాష్ట్రాలవైపు వస్తున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు ఎక్కువగా పడుతోంది. ఈ కారణంగానే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
ఈ పరిస్థితి ఎన్ని రోజులు?
ఈనెల 20వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేశాం. విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఈ వేడి తప్పదు.
రుతుపవనాలు ఆలస్యంగా ఎందుకొస్తున్నాయి?
వాస్తవానికి జూన్ రెండో వారంలోనే రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకుతాయి. ఉత్తరాదిలో బయల్దేరిన బిపర్‌జాయ్ తుఫాను ప్రభావం రుతుపవనాలపై తీవ్రంగా పడింది. ఈ కారణంగా రుతుపవనాలు చెల్లాచెదురు అయ్యాయి. ఈనెల 21వ తేదీన రుతుపవనాలు కృష్ణా, గుంటూరు జిల్లాలను తాకే అవకాశాలు ఉన్నాయి.
అసలు రుతుపవనాలు రాష్ట్రంలో అడుగుపెట్టాయా?
రాష్ట్రంలో రుతుపవనాలు అడుగుపెట్టాయి. ప్రస్తుతం సత్యసాయి జిల్లాకు, సూళ్లూరుపేటకు మధ్య కేంద్రీకృతమయ్యాయి. సాధారణంగా జూన్ 5వ తేదీ నాటికి గుంటూరు, కృష్ణాజిల్లాలను తాకుతాయి. 13వ తేదీకి ఉత్తరాంధ్ర జిల్లాలను తాకుతాయి. ఈ సైకిల్ ఇప్పుడు గతి తప్పింది.
రుతుపవనాలు ఏర్పడటంలో లోపాలున్నాయా?
సాధారణంగా నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలో ఏర్పడతాయి. ఈ గాలులు సముద్రంలోనూ, ఉపరితలంలోనూ బలంగా ఉండాలి. సముద్రానికి మూడు మీటర్ల ఎత్తులో ఈ గాలులు ఏర్పడాలి. అప్పుడే రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతాయి. ఈ ఏడాది ఆవిధంగా జరగలేదు. గడిచిన వందేళ్లలో అరేబియన్ సముద్రంలో ఇంత తీవ్రమైన తుఫాన్ రాలేదు. ఈ గాలులను తుఫాన్ లాక్కుపోయింది. దానివల్లే అధిక ఉష్ణోగ్రతలు, రుతుపవనాల రాక ఆలస్యమైంది.
Updated Date - 2023-06-17T13:19:11+05:30 IST