Devineni: అధికారులు .. ప్రజాప్రతినిధులు.. కళ్ళు తెరవాలి!
ABN, First Publish Date - 2023-06-30T11:40:00+05:30
జిల్లాలోని మైలవరం పట్టణంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పర్యటన మూడో రోజు కొనసాగుతోంది.
ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని మైలవరం పట్టణంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (TDP Leader Devineni Umamaheshwar rao) పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) ప్రకటించిన మినీ మేనిఫెస్టోను దేవినేని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. పట్టణంలోని పెద్ద హరిజనవాడ, శాంతినగర్, బాలయోగినగర్‌లలో ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ.. మైలవరం హరిజనవాడ చూస్తే ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందని.. పంచాయతీలు ఎలా పనిచేస్తున్నాయో అర్థం అవుతోందన్నారు. అధ్వానంగా పారిశుద్ధ్యం ఉందని.. ఐదు రోజుల నుంచి మంచినీళ్లు లేవని పట్టించుకునే నాధుడు లేడని, మంచినీళ్లు కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు.
ఇంటింటికి కుళాయి టీడీపీ హయాంలో కొండపల్లిలో పనులు చేసి నీళ్లు ఇచ్చి చూపిస్తే అధికారంలోకి వచ్చి వాటిని పాడుపెట్టారన్నారు. పారిశుద్ధ్య లోపంతో జ్వరాలు అనారోగ్యం పాలై మనుషులు దూరం అవుతున్నారన్నారు. 151 సీట్లు వచ్చాయని... పంచాయతీలు, మండలాలు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు గెలిచామని జబ్బలు చరుచుకుంటూ తొడలు కొట్టుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఊరికో సామంతుడిని అప్పజెప్పారని... వాళ్లు ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు దోచుకుంటూ జోబులు నింపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ బిల్డింగులు కట్టుకోవడానికి సోకులు చేసుకోవటానికి ప్రభుత్వం పరిమితం అయిపోయిందన్నారు. అధికారులు .. ప్రజాప్రతినిధులు.. కళ్ళు తెరవాలి అంటూ దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు.
Updated Date - 2023-06-30T11:40:00+05:30 IST