AP News: సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభిరామ్ ఫైర్..
ABN, First Publish Date - 2023-12-13T19:10:56+05:30
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. జగన్ రెడ్డి ఘనతలతో రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. పట్టభద్రుల నిరుద్యోగ రేటులో ఏపీని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపిన ఘనుడు ఈ ముఖ్యమంత్రి అని ఆరోపించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. జగన్ రెడ్డి ఘనతలతో రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. పట్టభద్రుల నిరుద్యోగ రేటులో ఏపీని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపిన ఘనుడు ఈ ముఖ్యమంత్రి అని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ఏటా నిర్వహించే పిరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదికలో దేశంలో పట్టభద్రులలో ఎక్కువగా నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, బీహార్‌ను మించిపోయి 24 శాతం నిరుద్యోగ రేటుతో అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో పట్టభద్రుల నిరుద్యోగ రేటు 16.6 శాతంగా ఉంటే తమిళనాడులో 16.3 శాతంగా, కేరళలో 19.8 శాతంగా, బీహార్‌లో 16.6 శాతంగా ఉందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్థాయిలో పట్టభద్రుల్లో నిరుద్యోగరేటు పెరగడానికి జగన్ రెడ్డి అసమర్థత, అవినీతే కారణమని పట్టాభిరామ్ ఆరోపించారు. ఉద్యోగాలు దక్కక నిరాశ నిస్పృహలతో గత నాలుగేళ్లలో రాష్ట్రంలో 1,745 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. చంద్రబాబు హాయాంలో ఏపీకి 2014-2019 మధ్య దేశీయంగా రూ.1,26,615 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని, సరాసరిన ఏటా రూ.25,323 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక 2019-2022 డిసెంబర్ వరకు నాలుగేళ్ల వ్యవధిలో సంవత్సరానికి రూ.13,515 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని విమర్శించారు. ఈ లెక్కలన్నీ తాము చెబుతున్నవి కావని, డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వార్షిక నివేదికలోని అంశాలేనని అన్నారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షణలో కూడా ఆంధ్రప్రదేశ్ దారుణంగా పడిపోయిందని అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018-19 మధ్య కాలంలో ఒక్క సంవత్సరంలోనే ఏపీకి సాధించిన విదేశీ పెట్టుబడులు రూ.23,882కోట్లు వచ్చాయని, 2019 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు జగన్ రెడ్డి నాలుగేళ్లలో సాధించిన విదేశీ పెట్టుబడులు రూ.6,679 కోట్లు మాత్రమేనని ప్రస్తావించారు. తాడేపల్లి కొంపకు కమీషన్లు కట్టలేక, ప్రభుత్వ అవినీతి, వైసీపీనేతల వేధింపులు భరించలేకనే ఏపీకి పెట్టుబడులు రావడంలేదన్నది పచ్చినిజమని జగన్ సర్కారుపై పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, ఏటా డీఎస్సీ ప్రకటన వంటి హామీలతో పాటు ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరుతో చంద్రబాబు అందించిన నిరుద్యోగ భృతికి సీఎం జగన్ మంగళం పాడారని అన్నారు.
Updated Date - 2023-12-13T19:11:00+05:30 IST