Varla Ramaiah: సీఐడీ చీఫ్ సంజయ్‌పై హైకోర్టు చర్యలు తీసుకోవాలి
ABN, First Publish Date - 2023-09-30T15:37:45+05:30
సీఐడీ చీఫ్ సంజయ్‌పైన ఏపీ హైకోర్టు వెంటనే సుమోటోగా కంటెప్ట్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేరళ హైకోర్టు ద్విసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కావాలని ఉల్లంఘించిన సీఐడీ చీఫ్ సంజయ్ కంటెప్ట్ కేసుకు అర్హుడన్నారు.
అమరావతి: సీఐడీ చీఫ్ సంజయ్‌పైన (AP CID Chief Sanjay) ఏపీ హైకోర్టు (AP High Court) వెంటనే సుమోటోగా కంటెప్ట్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) కోరారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేరళ హైకోర్టు (Kerala Highcourt) ద్విసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కావాలని ఉల్లంఘించిన సీఐడీ చీఫ్ సంజయ్ కంటెప్ట్ కేసుకు అర్హుడన్నారు. సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్ అసలీ పదవే వద్దు అనుకున్నారని.. ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబును (TDP Chief Chandrababu) సంజయ్ అరెస్టు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రమోషన్లిచ్చే సమయంలో డీజీపీ కార్యాలయం కేంద్రంగా అవినీతి జరుగుతోందనే ఆరోపణలున్నాయన్నారు. ఆగస్టు నెలాఖరులో పోలీస్ హెడ్ క్వార్టర్స్‌పై ఏసీబీ దాడులు జరిగాయన్నారు. ఏసీబీ దాడుల్లో సంజయ్ పేరు ప్రధానంగా వినిపించినట్లు కూడా సమాచారం ఉందని తెలిపారు. తప్పు చేస్తూ ఏసీబీకి దొరికిన వారిపై చర్యలు తీసుకోకుండా ఏఓని వీఆర్‌లో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. డీజీపీ కార్యాలయంలో ఏసీబీ సోదాల రిపోర్టును ముఖ్యమంత్రి బయట పెట్టగలరా అని నిలదీశారు. అవినీతి చేసిన వారి జాబితాలో సంజయ్ కూడా ఉండడంతో ప్రభుత్వ పెద్దలు బ్లాక్‌మెయిల్ చేసి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించారని మండిపడ్డారు. ఏసీబీ కేసును బూచిగా చూపిస్తూ ప్రభుత్వ పెద్దలు సంజయ్‌ని కీలు బొమ్మలా ఆడిస్తున్నారన్నారు. కేరళ హైకోర్టు తీర్పు ప్రకారం ఇన్వెస్టిగేషన్ వివరాలు మీడియాకు వివరించకూడదని కోర్టు చెప్పినా సంజయ్ బరితెగించి హైదరాబాద్, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినందుకు శిక్షార్హుడన్నారు. అధికారిగా కాకుండా అధికార పార్టీ నాయకుడిగా వ్యవహరించి హైదరాబాద్, ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం సీఐడీ చీఫ్ సంజయ్‌కి ఏముందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు మీడియాతో మాట్లాడేటప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించకూడదని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ గతంలో పేర్కొన్నదన్నారు. కేంద్ర హోం శాఖ నిబంధనలను కూడా సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్ ఉల్లంఘించారన్నారు. డీవోపీటీలో కూడా సంజయ్ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేస్తామన్నారు. డీజీపీ కార్యాలయంలో ఏసీబీ నిర్వహించిన తనిఖీల సమాచారాన్ని తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నిబంధనలు మీరి పని చేసిన టెయింటెడ్ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి అధికారుల్ని జైలు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి చరిత్ర అధికారులు తెలుసుకోవాలన్నారు. అధికారిని బ్లాక్ మెయిల్ చేసి ముఖ్యమంత్ర కక్షతో, రాజకీయ దురుద్దేశంతో తప్పుడు సాక్ష్యాలతో అరెస్టు చేసి జైలు పాలు చేసినందుకు ప్రజాక్షేత్రంలో ఫలితం అనుభవిస్తారని వర్ల రామయ్య హెచ్చరించారు.
Updated Date - 2023-09-30T15:37:45+05:30 IST