TDP Mahanadu: మహానాడుకు ప్రజలు రాకుండా వైసీపీ కక్ష సాధింపు చర్యలు
ABN, First Publish Date - 2023-05-28T08:51:45+05:30
టీడీపీ మహానాడుకు (TDP Mahanadu) ప్రజలు రాకుండా వైసీపీ (YCP) కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.
రాజమండ్రి: టీడీపీ మహానాడుకు (TDP Mahanadu) ప్రజలు రాకుండా వైసీపీ (YCP) కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీ నేతలు వాహనాలను ముందే బుక్ చేశారు. జిల్లాల్లోని ప్రైవేట్ టావెల్స్ వాహనాలను టీడీపీ నేతలకు ఇవ్వకుండా అన్ని వాహనాలను స్థానిక వైసీపీ నేతలు బుక్ చేసుకున్నారు. వైసీపీ నేతలు వాహనాల డ్రైవర్ల ఫోన్లు ఆఫ్ చేయించారు. ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ బస్సులు, రైళ్లలో మహానాడుకు ఎన్టీఆర్ అభిమానులు బయల్దేరారు. రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన మహానాడు ప్రతినిధుల సభకు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. జై ఎన్టీఆర్, జై టీడీపీ, చంద్రబాబు, లోకేశ్‌ల నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు.
కాగా.. రాయలసీమలో తన యువగళం పాదయాత్ర ముగిసే సమయంలో ఆ ప్రాంతానికి ఏం చేయబోతున్నామో వివరిస్తూ రాయలసీమ రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వెల్లడించారు. మహానాడులో పాల్గొనే నిమిత్తం పాదయాత్రకు విరామం ఇచ్చి ఆయన ఇక్కడకు వచ్చారు. శనివారం మహానాడు ప్రాంగణంలో కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. రాయలసీమపై తమ చిత్తశుద్ధిని చాటడానికే రాయలసీమ రోడ్ మ్యాప్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కడప జిల్లాతో ఆ ప్రాంతంలో పాదయాత్ర పూర్తవుతుంది. ముగింపు రోజు ఈ రోడ్‌మ్యాప్ విడుదల చేస్తాం. తాము అధికారంలోకి వస్తే సీమలో చేపట్టబోయే సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి కల్పన కార్యక్రమాలను ఇందులో వివరిస్తాం. రాయలసీమ నుంచి వలసల నిరోధానికి తీసుకొనే చర్యలను కూడా ప్రకటిస్తామని వివరించారు.
జగన్ తన నాలుగేళ్ల పాలనలో రాయలసీమకు వీసమెత్తు న్యాయం కూడా చేయలేకపోయారని ధ్వజమెత్తారు. దానిపై చర్చించడానికి ముందుకు రావాలని తాను అనేకసార్లు సవాళ్లు విసిరినా వైసీపీ నుంచి స్పందన లేదన్నారు. రాయలసీమకు టీడీపీ హయాంలో జరిగినంత న్యాయం.. జరిగినన్ని పనులు మరే ప్రభుత్వ హయాంలో జరగలేదని, ఈ విషయంలో ఎవరితోనైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమని చెప్పారు. కొంత మంది న్యాయవాదులు తన పాదయాత్రలో కలిసి రాయలసీమకు హైకోర్టు గురించి అడిగారని.. హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని, హైకోర్టు బెంచ్ రాయలసీమలో పెడతామని చెప్పానని తెలిపారు. ఇది తమ పార్టీ వైఖరని స్పష్టం చేశారు. మూడు రాజధానులని ప్రచారం చేసుకుంటున్న జగన్ కర్నూలులో కనీసం హైకోర్టుకు స్థలం కూడా కేటాయించలేకపోయారని, మాటలు చెప్పి భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు.
Updated Date - 2023-05-28T08:53:53+05:30 IST