CM Jagan: జగన్ వెళ్లే విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
ABN, First Publish Date - 2023-01-30T17:58:35+05:30
సీఎం జగన్ (CM Jagan) వెళ్లే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport)లో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
విజయవాడ: ఏపీ సీఎం జగన్ (CM Jagan) ఢిల్లీ పర్యటన అనూహ్యంగా వాయిదాపడింది. ఆయన బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport)లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ఇందుకు కారణమైంది. ఢిల్లీలో జరిగే జీ-20 సన్నాహక సదస్సులో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత విమానం గాలిలోనే కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. అనుమతితో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. కాగా విమానం టేకాఫ్ అయిన ప్రదేశంలో కాకుండా అక్కడికి దూరంగా ల్యాండింగ్ చేయడంతో ఒక్కసారిగా సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. ఈ అనూహ్య పరిణామంతో జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఆయన గన్నవరం నుంచి తిరిగి తాడేపల్లికి వెళ్లిపోయారు. కాగా సీఎం జగన్ ఢిల్లీ, హైదరాబాద్, కడప ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా ప్రత్యేక విమానంలోనే వెళ్తారు.
ఒకవేళ విమానంలో సాంకేతిక లోపం సరిదిద్దితే మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సమావేశానికి వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలను రేపు ఉదయం రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సమావేశం రేపు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతుంది. ఈ సమావేశానంతరం ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్‌షాను కలిసేందుకు జగన్ అపాయింట్‌మెంట్ అడిగారు. అయితే ఇప్పటివరకు అపాయింట్‌మెంట్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం రాలేదు. అలాగే కేంద్రఆర్థికమంత్రి నిర్మాలాసీతారామన్ అపాయింట్‌మెంట్ కూడా అడిగారు. రేపు, ఎల్లుండి లోక్‌సభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంత్రులందరూ బీజీగా ఉన్నారు. అందువల్ల జగన్‌కు ఇప్పటివరకు ఎలాంటి అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఒకవేళ జగన్.. ఢిల్లీ వెళ్లినా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సుకు మాత్రమే పరిమితం కానున్నారు.
Updated Date - 2023-01-30T18:28:00+05:30 IST