Thirupathi : తిరుపతి పారిశుధ్యానికి శ్రీవారి సొమ్మా?
ABN , Publish Date - Dec 14 , 2023 | 02:54 AM
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులను తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని రోడ్లు, కాలనీల పారిశుధ్య పనులకు వినియోగించాలని నిర్ణయించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

మీ ఇష్టానుసారం వాడేస్తారా?
ఆ పనులకే 100 కోట్ల ఖర్చా?
ఏ ప్రాతిపదికన నిర్ధారించారు?
పారిశుధ్యం బాధ్యత కార్పొరేషన్‌దే
తిరుపతి మునిసిపల్ కార్పొరేషనే
ఏడాదికి 50 కోట్లు ఖర్చు చేస్తోంది
టీటీడీ 100 కోట్లు ఇవ్వడమెందుకు?
ఆశ్చర్యం వ్యక్తంచేసిన ధర్మాసనం
టెండర్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్
పనులు కేటాయించొద్దని ఆదేశం
నిధుల విడుదల వద్దని స్పష్టీకరణ
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం
(టీటీడీ) నిధులను తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని రోడ్లు, కాలనీల పారిశుధ్య పనులకు వినియోగించాలని నిర్ణయించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. శ్రీవారికి భక్తులు ఇచ్చిన సొమ్మును ఇష్టారీతిన ఖర్చు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అందుకు చట్టం కూడా అనుమతించదని స్పష్టం చేసింది. టీటీడీ నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించిన ఉదంతాలు గతంలో ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీసింది. తిరుపతి నగరంలోని టీటీడీ సంస్థల్లో పారిశుధ్య పనుల కోసమే టెండర్ పిలిచామన్న టీటీడీ తరఫు న్యాయవాది వాదనను తోసిపుచ్చింది. తిరుపతి పరిధిలో పారిశుధ్య పనులకు మునిసిపల్ కార్పొరేషన్ ఏడాదికి రూ.50 కోట్లు ఖర్చు చేస్తుంటే, పారిశుధ్య పనుల నిమిత్తం టీటీడీ రూ.100 కోట్లతో టెండరు పిలవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనిని ఏవిధంగా అర్ధం చేసుకోవాలని ప్రశ్నించింది. పారిశుద్ధ్య పనులకు రూ.100 కోట్లు ఖర్చు అవుతాయని ఏ ప్రాతిపదికన నిర్ధారించారని ప్రశ్నించింది. తిరుపతి నగరంలో పారిశుధ్య పనులు నిర్వహించాల్సిన బాధ్యత కార్పొరేషన్‌దేనని, అందుకోసం టీటీడీ నుంచి నిధులు కోరడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. టెండర్ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని, అయితే, కాంట్రాక్ట్‌ను ఎవరికీ కేటాయించవద్దని టీటీడీకి తేల్చిచెప్పింది. తిరుపతిలో పారిశుధ్య పనుల కోసం నిధులు విడుదల చేయవద్దని స్పష్టం చేసింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ వ్యాజ్యం
టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్‌లోని రోడ్లు, కాలనీల పారిశుధ్య పనులకు వినియోగించాలన్న ప్రతిపాదనను సవాల్ చేస్తూ తిరుపతికి చెందిన బీజేపీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జి. భానుప్రకాశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యా జ్యం దాఖలు చేశారు. ఆయా పనులకు ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేసేలా ఈవో ఆమోదం తెలుపుతూ పనుల నిర్వహణకు టెండర్లు పిలవడాన్ని చట్ట విరుద్ధమైందిగా ప్రకటించాలని కోరా రు. బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది వై. బాలాజీ వాదనలు వినిపించారు. ‘‘తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని కాలనీలు, రోడ్లలో చెత్త సేకరణ, పారిశుధ్య పనుల నిర్వహణకు రూ.100 కో ట్లు విడుదల చేసేందుకు టీటీడీ అంగీకరించింది. భక్తులు దేవుడికి కానుకల రూపంలో ఇచ్చిన సొ మ్మును దేవదాయ చట్టంలోని సెక్షన్ 111 ప్రకారం ఖర్చు చేయాలి. టీటీడీ నిర్వహణ, భక్తుల సంక్షే మం, హిందూ ధర్మం కోసమే సొమ్మును వినియోగించాలి. ఇతర అవసరాలకు మళ్లించడానికి వీలే ్లదు. టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య పనుల కోసం ఖర్చు చేసేందుకు చట్టం అనుమతించదు. తిరుపతి నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే 200 అడుగుల రహదారి సుందరీకరణ, లైటింగ్ ఏర్పాటు కోసం టీటీడీకి చెందిన రూ.10 కోట్ల నిధుల విడుదలకు గతంలో ఈవో అనుమతివ్వగా హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇది పెండింగ్‌లో ఉండగానే ఈ నిర్ణయాన్ని టీటీడీ ఉపసంహరించుకుంది. పారిశుధ్యపనుల నిమిత్తం ఈ ఏడాది నవంబరు 22న టెండర్ నోటిఫికేషన్ ఇ చ్చారు. బిడ్లు స్వీకరించేందుకు డిసెంబరు 7ను చి వరి తేదీగా పేర్కొన్నారు. ఈ నెల 16న జరిగే బో ర్డు మీటింగ్‌లో బిడ్లు ఖరారు చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో టెండర్ ప్రక్రియను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి’’ అని కోరారు.
భక్తుల కోసమే: టీటీడీ
టీటీడీ తరఫున సీనియర్ న్యాయవాది సి. రఘు వాదనలు వినిపిస్తూ.. ‘‘తిరుపతి పట్టణ పరిధిలో టీటీడీ అనేక ఆసుపత్రులు, విద్యాసంస్థలు, దేవాలయాలు నిర్వహిస్తోంది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం అనేక వసతిగదులు నిర్వహిస్తోంది. ఆయా సంస్థల లోపల, పరిసరాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం రూ.100 కోట్లతో టీటీడీ టెండర్లు పిలిచింది. భక్తుల ప్రయోజనాల కోసం సొమ్మును ఖర్చు చేసే అధికారం టీటీడీకి ఉంది’’ అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జో క్యం చేసుకుంటూ.. భక్తుల కోసం సొమ్మును ఖ ర్చు చేస్తే అభ్యంతరం లేదని, ఆ పేరుతో తిరుపతిలో పారిశుధ్య పనులకు ఖర్చు చేస్తామంటే చట్టం అనుమతించదని పేర్కొంది. తిరుపతి కా ర్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణకు ఎంత ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ సందర్భంగా కార్పొరేషన్ తరఫు న్యాయవాది కాలవ సురేశ్ కుమార్ స్పందిస్తూ.. ఏటా రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు.