AP MLC Results: టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య గట్టిపోటీ.. అధికార పార్టీ డీలా
ABN, First Publish Date - 2023-03-17T21:20:03+05:30
పశ్చిమ రాయలసీమ (Rayalaseema) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నువ్వా.. నేనా అన్న రీతిలో టీడీపీ, వైసీపీ (TDP YCP) అభ్యర్థుల మధ్య పోటీ సాగుతోంది.
అనంతపురం: పశ్చిమ రాయలసీమ (Rayalaseema) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నువ్వా.. నేనా అన్న రీతిలో టీడీపీ, వైసీపీ (TDP YCP) అభ్యర్థుల మధ్య పోటీ సాగుతోంది. ఈ స్థానానికి 49 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 2,44,307 ఓట్లు పోలయ్యాయి. అనంతపురం నగరంలోని జేఎన్‌టీయూలో గురువారం ఓట్ల లెక్కింపు మొదలైంది. ఒక్కో రౌండ్‌కు 24 వేల ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకూ (శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి) 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొదటి రౌండ్ నుంచి 6వ రౌండ్ వరకూ వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి (Vennapusa Ravindra Reddy) ఆధిక్యతను కనబరిచారు. 7వ రౌండ్‌లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి (Bhumi Reddy Ramgopal Reddy)కి మెజార్టీ వచ్చింది. తిరిగి 8వ రౌండ్‌లో వైసీపీ అభ్యర్థికి మెజార్టీ వచ్చింది. ఎనిమిది రౌండ్లలో 1,92,018 ఓట్లు లెక్కించారు. ఇందులో వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి 74,678 ఓట్లు, టీడీపీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డికి 73,229 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి కంటే వైసీపీ అభ్యర్థికి 1449 ఓట్లు అధికంగా వచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థి పోతుల నాగరాజుకు 15,254 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకూ 15,104 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు.
అధికార పార్టీ డీలా
మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఆశించిన స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో అధికార పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. ఇక మూడు రౌండ్లలో 52,289 ఓట్లు మాత్రమే లెక్కించాల్సి ఉంది. శుక్రవారం అర్ధరాత్రికి మిగిలిన మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుంది. ప్రస్తుతం 8 రౌండ్లకుగానూ కేవలం 1449 ఓట్ల మెజార్టీ సాధించిన వైసీపీ అభ్యర్థి.. మిగిలిన మూడు రౌండ్ల మెజార్టీపైనే ఆశలు పెట్టుకుంది. మొదటి రౌండ్ నుంచి 6వ రౌండ్ వరకూ వైసీపీకి రౌండ్ రౌండ్‌కూ మెజార్టీ తగ్గుతూ వస్తోంది. మొదటి రౌండ్‌లో 863, రెండో రౌండ్‌లో 1004, మూడో రౌండ్‌లో 76, నాలుగో రౌండ్‌లో 22, ఐదో రౌండ్‌లో 11, ఆరో రౌండ్‌లో 43 ఓట్లతో కలిపి 2,019 ఓట్ల మెజార్టీ వైసీపీ అభ్యర్థికి వచ్చింది. కానీ 7వ రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డికి 637 ఓట్లు అధికంగా వచ్చాయి. దీంతో అప్పటి వరకూ ఉన్న వైసీపీ అభ్యర్థి మెజార్టీ 1382 ఓట్లకు పడిపోయింది. 8వ రౌండ్‌లో వైసీపీ అభ్యర్థికి 67 ఓట్లు మెజార్టీ లభించింది. ఇలా ప్రతి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి డీలా పడేలా మెజార్టీ పడిపోయింది. పీడీఎఫ్ అభ్యర్థి పోతుల నాగరాజు మూడో స్థానంలో ఉండగా, 5,933 ఓట్లతో బీజేపీ అభ్యర్థి నగరూరు రాఘవేంద్ర నాలుగో స్థానంలో ఉన్నారు.
Updated Date - 2023-03-17T21:20:03+05:30 IST