Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. నాలుగే స్టాపులు
ABN, First Publish Date - 2023-01-13T20:43:11+05:30
విశాఖ (Visakha) ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
విశాఖపట్నం: విశాఖ (Visakha) ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచే ఇది పట్టాలపైకి వస్తోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం (Secunderabad-Visakhapatnam) మధ్య ఈ రైలు వారానికి ఆరు రోజులు మాత్రమే నడుస్తుంది. ఆదివారం పూర్తిగా సెలవు. ఈ రెండు నగరాల మధ్య ప్రస్తుతం ఇతర ఏ రైలులో వెళ్లినా కనీస ప్రయాణ సమయం 12 గంటలు పడుతోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) ఈ సమయాన్ని 3.20 గంటలు తగ్గిస్తుంది. అంటే 8.40 గంటల్లో గమ్యం చేరుస్తుంది. రైలు వేగం గంటకు రూ.160 కి.మీ. కాగా ఈ మార్గంలో దీనిని 80 నుంచి 90 కి.మీ. వేగంతో నడుపుతారు. మధ్యలో స్టాపుల సంఖ్య కూడా బాగా పరిమితం చేశారు. కేవలం నాలుగు స్టేషన్లలో మాత్రమే ఇది ఆగుతుంది. విశాఖలో బయలుదేరితే రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ (Khammam, Warangal) స్టేషన్లలోనే ఆగుతుంది. విశాఖ నుంచే బయలుదేరే రైలుకు 20833 నంబరు కేటాయించారు. అటు నుంచి బయలుదేరే రైలుకు 20834 నంబరు ఇచ్చారు.
ఇవీ ప్రయాణ సమయాలు
వందే భారత్ రైలు ప్రతిరోజు ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. అదే రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం వస్తుంది. ఇందులో 16 కోచ్‌లు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్, చైర్ కారు అని రెండు తరగతులు ఉంటాయి. కూర్చొనే ప్రయాణం చేయాలి. పడుకునే వీలుండదు. దాదాపు అంతా పగటి పూట ప్రయాణమే కాబట్టి స్లీపర్ కోచ్‌లు ఏర్పాటు చేయలేదు.
తొలిరోజు మాత్రం ప్రత్యేకం... పలు స్టేషన్‌లలో హాల్ట్
ఈ రైలును ఈ నెల 15న ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగా వర్చువల్‌గా ప్రారంభిస్తారు. అందుకని ఆ రోజు రైలు సమయం ప్రత్యేకంగా ఉంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి రాత్రి 8.45 గంటలకు విశాఖపట్నం వస్తుంది. ఆ ఒక్కరోజు మాత్రం ఈ రైలు చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. శుక్రవారం నాటికి ఇంకా దీనికి టిక్కెట్ ధరలను ఖరారు చేయలేదు. శనివారం నుంచి బుకింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
Updated Date - 2023-01-13T20:43:13+05:30 IST