AP News: ఏపీ మంత్రి నోట.. మళ్లీ ‘గుడ్డు’ మాట
ABN, First Publish Date - 2023-02-16T15:00:00+05:30
రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నోట మరోసారి గుడ్డు మాట వినిపించింది.
విశాఖపట్నం: రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (AP Minister Gudivada Amarnath) నోట మరోసారి గుడ్డు మాట వినిపించింది. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి... రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. కొంత మంది దీనిపై విద్వేషాలు సృష్టిస్తున్నారన్నారు. కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారని వ్యాఖ్యలు చేశారు. రాజధానుల (AP Capital) అంశం చూసే కోణాన్ని బట్టి ఉంటుందన్నారు. కొత్త రాజధాని అంటే విశాఖపట్టణమే (Visakhapatnam) కదా.. మూడు చోట్ల నుంచి ముఖ్యమంత్రి (AP CM) పరిపాలన చేస్తారనే అనుమానాలను బుగ్గన (Minister Buggana) నివృత్తి చేశారన్నారు. పరిపాలనా రాజధాని విశాఖ మాత్రమే ఉంటుందని బుగ్గన ఉద్దేశమని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పుకొచ్చారు.
కోడిగుడ్డు కథ వినిపించిన ఏపీ మంత్రి
కాగా... ఇటీవల హైదరాబాద్ (Hyderabad)లో జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ (Formula E - Racing) ను చూసేందుకు గుడివాడ అమర్‌నాథ్ వెళ్లారు. దీంతో ఏపీలో ఎప్పుడు ఈ రేసింగ్ నిర్వహిస్తారని మంత్రిని మీడియా ప్రశ్నించింది. అందుకు ఆయన వినూత్నంగా ‘‘కోడి గుడ్డు’’ కథ వినిపించడంతో నోళ్లు వెళ్లబెట్టడం జనం వంతైంది.
ఇంతకీ మంత్రి ఏమన్నారంటే... ‘‘కోడి కోడిని పెట్టదు. గుడ్డును మాత్రమే పెట్టగలదు. అది గుడ్డు పెట్టాలి.. దానిని పొదగాలి. అది పెరిగి పెద్దవ్వాలి. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లో కోడి గుడ్డు పెట్టింది’’ అని గుడ్డోపాఖ్యానం వినిపించారు. హైదరాబాద్ (Hyderabad)లో నిర్వహించిన ఈ-రేసు తెలుగు వాళ్లందరికీ గర్వకారణం. హైదరాబాద్ తెలంగాణ ప్రజలు (Telangana People) మాత్రమే నిర్మించిన నగరం కాదు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఉమ్మడిగా నిర్మించుకున్న నగరం. హైదరాబాద్ ఎదుగుదలలో మా పాత్ర ఉందన్న భావన ప్రతి తెలుగువాడిలో ఉంటుందని చెప్పారు.
ఇంకా.. ఏపీ అభివృద్ధి చెందాలన్న కోరిక అందరిలో ఉందని, హైదరాబాద్‌కు దీటుగా విశాఖను రాజధానిగా అభివృద్ధి చేయాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు విశాఖ వేదిక కావాలని భావిస్తున్నామని చెప్పారు. అయితే మంత్రి గుడ్డుకథ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు మంత్రిని ఒక ఆట ఆడుకున్నారు. ‘‘చలికి వేడి నీటి స్నానం చేయడం కూడా తెలియని వాళ్లకు ఏం చెప్పినా దండగ’’ అని ఒకరు ఎద్దేవా చేయగా.. అసలు ఏపీలో కోడి ఏమైందని మరొకరు ప్రశ్నించారు. ‘‘కోసుకుని తినేశారుగా’’ అని ఇంకొకరు ముక్తాయించారు!.. మొత్తానికి మంత్రి గుడ్డు కథ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.
Updated Date - 2023-02-16T15:00:02+05:30 IST