Visakha: నేడు రుషికొండకు కేంద్ర కమిటీ..
ABN, Publish Date - Dec 14 , 2023 | 08:55 AM
విశాఖ: రుషికొండపై పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల పరిశీలనకు కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ గురువారం విశాఖపట్నం రానుంది. కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి రుషికొండపై ఏపీటీడీసీ నిర్మాణాలు చేపట్టిందని, పర్యాటక వసతి పేరుతో సీఎం క్యాంపు కార్యాలయాలు నిర్మించిందని..
విశాఖ: రుషికొండపై పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల పరిశీలనకు కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ గురువారం విశాఖపట్నం రానుంది. కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి రుషికొండపై ఏపీటీడీసీ నిర్మాణాలు చేపట్టిందని, పర్యాటక వసతి పేరుతో సీఎం క్యాంపు కార్యాలయాలు నిర్మించిందని ఆరోపిస్తూ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో వేర్వేరుగా కేసులు వేసిన సంగతి తెలిసిందే. కొంతమేరకు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఏపీటీడీసీయే అంగీకరించగా.. వాటి వల్ల నష్టం ఎంత అనేది అంచనా వేసి.. అనుమతులు ఇచ్చిన కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖే చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో కేంద్రం వివిధ విభాగాలకు చెందిన ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. దీనికి చెన్నైలోని హెచ్2వో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ సంస్థ సలహాదారు కె.గౌరప్పన్ చైర్మన్‌గా చెన్నై నుంచే మరో ఇద్దరు నిపుణులు, ఏపీలో విజయవాడ నుంచి ఒకరు, విశాఖ నుంచి ఒకరిని సభ్యులుగా నియమించింది. గత నెల 28న ఉత్తర్వులు ఇస్తూ.. పర్యావరణ ఉల్లంఘనలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. గడువు సమీపిస్తుండటంతో ఇప్పుడు కమిటీ విశాఖపట్నం వస్తోంది. ఇక్కడ రుషికొండపై నిర్మాణానికి అనుమతించిన విస్తీర్ణం ఎంత? నిర్మాణాలు ఎంత విస్తీర్ణంలో చేపట్టారు? అందుకోసం చెట్లను నరికి, కొండను తవ్వడం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం వాటిల్లిందనే అంశాలను కమిటీ పరిశీలించనుంది.
అనుమతి ఉపసంహరించుకోవాలని పిటిషన్
రుషికొండపై పనులకోసం ఏపీటీడీసీకి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని గతంలో రామకృష్ణబాబు, మూర్తి యాదవ్‌లు హైకోర్టును అభ్యర్థించారు. ‘‘రుషికొండపై పర్యాటకుల కోసం పరిమితులతో కూడిన అనుమతిని మాత్రమే కేంద్ర అటవి పర్యావరణ మంత్రిత్వశాఖ ఇచ్చింది. కానీ ఏపీటీడీసీ ఉద్దేశపూర్వకంగా వాటిని ఉల్లంఘించింది. కమిటీ పరిశీలనలో ఇది నిజమని తేలితే ఆ కార్పొరేషన్‌కు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలి’’ అని వారు కోరారు.
అమరావతి రైతులు మరో కేసు..
పరిపాలనా రాజధాని విశాఖ అంటూ అక్కడికి కార్యాలయాలు తరలిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు రైతులు హైకోర్టులో కేసు వేశారు. దానిపై విచారణలు జరుగుతున్నాయి. వాటికి ప్రభుత్వం కౌంటర్ వేస్తూ ఈ నెల 18లోగా కార్యాలయాలు తరలించడంలేదని చెప్పింది. అంటే ఆ తర్వాత తరలిస్తారా?.. అనే అనుమానాలు ఉన్నాయి. ప్రత్యేక కమిటీతో సీఎం క్యాంపు కార్యాలయానికి అనువుగా ఉన్న భవన ప్రాంగణం అంటూ నివేదికలు తెప్పించుకుని అందులోకి రావడానికి సీఎం జగన్ ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా 21లోగా రావచ్చని ప్రచారం చేస్తున్నారు. ఇన్ని కేసులు, వివాదాలు నడుస్తుండగా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటని విశాఖ వాసులు వ్యతిరేకిస్తున్నారు.
Updated Date - Dec 14 , 2023 | 08:55 AM