ఘాట్ మార్గం కళకళ
ABN , First Publish Date - 2023-09-21T22:56:47+05:30 IST
ఎట్టకేలకు రెండేళ్ల తరువాత స్థానిక ఘాట్ మార్గంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడంతో ప్రస్తుతం ఘాట్ రోడ్డు కళకళలాడుతున్నది.

ఎట్టకేలకు కలెక్టర్ చొరవతో తుప్పల తొలగింపు
రక్షణ గోడలకు మరమ్మతులు కూడా..
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు, డ్రైవర్లు
పాడేరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు రెండేళ్ల తరువాత స్థానిక ఘాట్ మార్గంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడంతో ప్రస్తుతం ఘాట్ రోడ్డు కళకళలాడుతున్నది. గత నెల 20న ఘాట్‌లో పీటీడీ బస్సు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందగా, మరో 26 మంది గాయాల పాలైన సంగతి తెలిసింతే. ఈ నేపథ్యంలో ఘాట్‌లోని జంగిల్ క్లియరెన్స్‌పై కలెక్టర్ సుమిత్‌కుమార్ దృష్టి సారించారు. ప్రతి ఏడాది వర్షాకాలం తరువాత ఘాట్‌లో విధిగా జంగిల్ క్లియరెన్స్ చేయాల్సి ఉంది. కానీ రెండేళ్లుగా అటువంటి పనులు చేయక ఘాట్ మొత్తం తుప్పలే కనిపిస్తున్నాయి. దీంతో ఘాట్‌లో రోడ్డు పక్కకు వాహనాన్ని దింపలేని దుస్థితి కొనసాగుతున్నది. వాస్తవానికి రోడ్డుకు ఇరువైపులా మూడేసి అడుగుల చొప్పున అంచులు ఉంటాయి. కానీ వాటిని తుప్పలే కప్పేశాయి. అలాగే ముఖ్యంగా మలుపుల వద్ద ఎక్కువగా తుప్పలు మొలిచిపోవడంతో మలుపుల్లో ఎదురుగా వచ్చే వాహనం కనపడని పరిస్థితి ప్రమాదాలకు కారణమవుతున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో ఘాట్‌లో తక్షణమే జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు ప్రమాదకరంగా ఉన్న మలుపు వల్ల రక్షణ గోడలను సైతం పటిష్ఠం చేసేందుకు మరమ్మతులు చేపట్టాలని, అందుకు అవసరమైన నిధులు చెల్లిస్తామని రోడ్లు, భవనాల శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఘాట్‌లోని జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు రక్షణగోడలకు మరమ్మతులు చేపట్టారు. ఫలితంగా ఇన్నాళ్లు తుప్పలతో భయంకరంగా ఉన్న ఘాట్ మార్గం ప్రస్తుతం కళకళలాడుతున్నదని ప్రయాణికులు, డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.