Viveka Case: వివేకా హత్య కేసు... సీబీఐ విచారణకు హాజరైన సుధాకర్
ABN, First Publish Date - 2023-03-02T15:48:13+05:30
ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి )YS Vivekananda Reddy) హత్య కేసు విచారణను సీబీఐ (CBI) వేగవంతం చేసింది. .
కడప: ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు విచారణను సీబీఐ (CBI) వేగవంతం చేసింది. ఈ కేసులో పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్‌ను కడపలో సీబీఐ అధికారులు 2 గంటల పాటు విచారించారు. ఎంపీ అవినాష్రెడ్డితో ఫోటో దిగిన విషయంపై సీబీఐ సుధాకర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్య జరిగినరోజు వివేకా ఇంటికి వచ్చిన.. వారిలో కొందరిని సీబీఐ విచారణకు పిలిచింది. మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి (Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు కడప సెంట్రల్ జైలు (Kadapa Central Jail)లోని అతిథిగృహానికి విచారణకు రావాలని పేర్కొంది. సీబీఐ అధికారుల బృందం బుధవారం పులివెందులలోని భాస్కర్‌రెడ్డి (Bhaskar Reddy)ఇంటికి వెళ్లి ఈ నోటీసులు అందజేసింది. వివేకా హత్య జరిగిన రోజు సంఘటన స్థలంలో సాక్ష్యాధారాలు చెరిపేయడం, హత్య వెనుక భారీ కుట్రను ఛేదించేందుకు ఆయన్ను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
గత నెల 23న విచారణకు రావాలని సీబీఐ అధికారులు తొలుత నోటీసులిచ్చారు. అయితే ఆ రోజు పనులు ఉన్న కారణంగా మరో రోజు వస్తానని భాస్కర్‌రెడ్డి సమాధానమిచ్చారు. గత నెల 24న హైదరాబాద్‌లో ఆయన కుమారుడు అవినాశ్‌రెడ్డిని సీబీఐ విచారించింది. ఆ మర్నాడు భాస్కర్‌రెడ్డిని రమ్మందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనికితోడు సీబీఐ అధికారులు 25వ తేదీన కడప వెళ్లడంతో ఈ కథనాలకు బలం చేకూరింది. కానీ వారు ఆయన్ను పిలువలేదు. ఇప్పుడు అందజేసిన నోటీసులో 12న విచారణకు రావాలని ఆదేశించారు. అవినాశ్‌రెడ్డిని సీబీఐ బృందం హైదరాబాద్‌లో రెండు సార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సోమవారమే తోసిపుచ్చింది.
Updated Date - 2023-03-02T15:48:13+05:30 IST