Chandrababu: పోలవరం పూర్తి అయితే ఏ రాష్ట్రం మనతో పోటీ పడలేదు..
ABN, First Publish Date - 2023-07-28T16:50:58+05:30
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఏ రాష్ట్రం ఏపీతో పోటీ పడలేదని, అవసరమైతే మిగిలిన రాష్ట్రాలకు నీళ్లిచ్చేవాళ్లమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతి: పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పూర్తి అయితే ఏ రాష్ట్రం ఏపీ (AP)తో పోటీ పడలేదని, అవసరమైతే మిగిలిన రాష్ట్రాలకు నీళ్లిచ్చేవాళ్లమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిర్మాణం.. ఆ తర్వాత పేదలకు, రైతులకు కలిగే లబ్దిపై ఎన్నో కలలు కన్నామని, మొత్తం నాశనం చేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే.. అన్ని ప్రాజెక్టుల్లో నీటిని నింపేసేవాళ్లమని, ఐదేళ్లు వర్షాలు రాకున్నా.. ఏపీకి ఇబ్బంది లేని పరిస్థితి ఉండేదని అన్నారు.
పెద్దిరెడ్డి (Peddi Reddy) ఏదో పెద్ద కథలు చెబుతున్నారని, ‘నా ఆకాంక్షను.. రాష్ట్ర భవిష్యత్తును’ నాశనం చేశారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. 69 నదులు ఉన్నాయని, ఈ నదులను పూలుగా భావించానని, ఈ పూలను పోలవరం అనే దారంతో దండ చేయాలనుకున్నామని, ఆ దండను తెలుగుతల్లి మెడలో మణిహారంగా వేయాలనుకున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆర్ (R @ R) రాష్ట్రమే చేసుకోవాలంటే.. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ (Nitin Gadkari), అరుణ్ జైట్లీ (Arun Jaitley)తో వాదించానని.. ఏ సెక్షన్ కింద.. ఏ చట్టం కింద ఆర్ అండ్ ఆర్ ఇవ్వనంటున్నారని ప్రశ్నించానన్నారు. దీంతో గడ్కరీ, అరుణ్ జైట్లీ కూడా ఏం మాట్లాడలేకపోయారని.. ‘అదీ నా చిత్తశుద్ది’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యనించారు.
‘‘నేను పోరాడింది నా కోసమా..? నాపై ఉన్న కేసుల కోసమా..?.. నేను ప్రాజెక్టుల వద్దకెళ్తున్నా.. అక్కడే నిలదీస్తా... ప్రభుత్వం తప్పు చేస్తుందంటే తిడతారు.. అంతేగా.. ముసలి నక్కా అంటావ్.. ఇదే జగన్ చేయగలిగింది..?.. గట్టిగా ఓ గంట కూర్చొని ఫైల్ చూడలేవు.. బూతులు తిట్టడం తప్ప ఏమైనా చేయగలరా..?’’ అంటూ చంద్రబాబు సీఎం జగన్ (CM Jagan)ను ఉద్దేశించి ప్రశ్నించారు.
Updated Date - 2023-07-28T16:52:13+05:30 IST