‘రాత్రి 3 గంటలకు అవినాష్రెడ్డి..భారతి, జగన్లతో ఏం మాట్లాడారు?’
ABN, First Publish Date - 2023-02-11T19:53:10+05:30
మాజీమంత్రి వివేకానందరెడ్డి (Vivekananda Reddy) హత్యతో సీఎం జగన్, ఆయన సతీమణీ భారతికి సంబంధం లేకపోతే వారి కాల్ డేటా బయటపెట్టమని సీబీఐని కోరాలని..
అమరావతి: మాజీమంత్రి వివేకానందరెడ్డి (Vivekananda Reddy) హత్యతో సీఎం జగన్, ఆయన సతీమణీ భారతికి సంబంధం లేకపోతే వారి కాల్ డేటా బయటపెట్టమని సీబీఐని కోరాలని టీడీపీ నేత చినరాజప్ప (Chinarajappa) డిమాండ్ చేశారు. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి 3 గంటలకు ఎంపీ అవినాష్రెడ్డి (Avinash Reddy), సీఎం జగన్, ఆయన సతీమణీ భారతి (Bharthi)తో ఏం మాట్లాడారు? అని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల ఆధ్వర్యంలో హత్య సాక్షాధారాలు ధ్వంసం చేయటం వాస్తవం కాదా? అని నిలదీశారు. సాక్షాధారాలు ధ్వంసం చేయటంతోనే హత్యలో అవినాష్రెడ్డి పాత్ర ఉందని స్పష్టమవుతోందని చినరాజప్ప తెలిపారు. వివేకా గొడ్డలి పోటుతో చనిపోతే.. గుండెపోటు అని సాక్షి టీవీలో ఎందుకు వేశారు?.. శివశంకర్రెడ్డిని వైసీపీ నుంచి ఎందుకు బహిష్కరించలేదు? అని ప్రశ్నించారు. సీఎం అండ లేకుండా సీబీఐ అధికారులపై అక్రమ కేసులు పెట్టడం సాధ్యమా?.. కడప (Kadapa) ఎంపీ టికెట్ కోసమే ఈ హత్య జరిగిందని వైఎస్‌ఆర్‌టీపీ షర్మిల (Sharmila) సీబీఐకి చెప్పలేదా? అని చినరాజప్ప ప్రశ్నించారు.
‘జగనాసుర రక్త చరిత్ర’ పుస్తకం విడుదల
వివేకానందరెడ్డి హత్య విషయం జగన్ దంపతులకు ముందే తెలుసని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హత్య జరిగిన రోజు వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్ లోట్‌సపాండ్‌లో ఉన్న జగన్ దంపతులతో ఫోన్లో పదే పదే మాట్లాడారని వెల్లడించారు. ‘జగన్‌కు తెలియకుండా.. ఆయన ఆమోదం లేకుండా పులివెందులలో వివేకా ఇంట్లోకి వెళ్లి కిరాతకంగా చంపే ధైర్యం ఎవరికీ లేదు. అందుకే జగన్ తెలివిగా మొదటిరోజు నుంచే ఈ హత్యను చంద్రబాబుపై నెట్టే ప్రయ త్నం చేశారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ నిజాలు బయటకు రాకుండా తొక్కిపట్టడానికి విశ్వప్రయత్నం చేశారు. సీబీఐ చేతులు కట్టివేయడానికి కూడా పడరాని పాట్లు పడ్డారు’ అని టీడీపీ నేతలు దుయ్యబడుతున్నారు. వివేకా హత్య కేసులో పూర్వాపరాలను సమగ్రంగా వివరిస్తూ ‘జగనాసుర రక్త చరిత్ర బహిరంగం’ పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనందబాబు, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. వివేకా హత్య జరిగిన సమయంలో జగన్ పత్రికలో ‘నారాసుర రక్తచరిత్ర’ అనే శీర్షికతో కథనం ప్రచురించారు.
Updated Date - 2023-02-11T19:53:11+05:30 IST