CM Jagan : జగన్ పోస్టర్ చించిన కుక్కపై ఫిర్యాదు...? కామెడీ కాదండోయ్.. నిజమే..
ABN, First Publish Date - 2023-04-13T10:59:47+05:30
టైటిల్ చూడగానే కుక్కపై ఫిర్యాదేంటని ఆశ్చర్యం వేయవచ్చు. వైసీపీ నేతల తీరు అలా ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక కుక్క ఏపీ సీఎం వైఎస్ జగన్ పోస్టర్‌ను చించుతున్న వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
విజయవాడ : టైటిల్ చూడగానే కుక్కపై ఫిర్యాదేంటని ఆశ్చర్యం వేయవచ్చు. వైసీపీ నేతల తీరు అలా ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక కుక్క ఏపీ సీఎం వైఎస్ జగన్ పోస్టర్‌ను చించుతున్న వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆ కుక్కపై వైసీపీ నాయకురాళ్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నవ్వి పోదురుగాక.. కుక్కపై కేసేంటి.. అనిపిస్తోందా? కుక్కపై ఏంటి? వీరి వ్యవహార శైలి చూస్తుంటే.. కుక్కైనా.. నక్కైనా పోస్టర్ జోలికి వస్తే ఊరుకునేదే లే అన్నట్టుగా ఉంది.
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే.. ‘మా నమ్మకం నువ్వే జగన్’. నిజానికి ఈ ప్రోగ్రామే ఒక కామెడీ. మా నమ్మకం నువ్వే జగన్ అని జనాలు చెప్పాలి కానీ ఈ విషయాన్ని బలవంతంగా వారి మెదళ్లలోకి చొప్పించాలి అనుకోవడం హాస్యాస్పదమే. ఇక ఈ ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. మరి కుక్కలకేం తెలుసు.. ఇదొక ప్రచారమని.. వాటిని చించకూడదు అని. శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఇంటి గోడపై ఉన్న పోస్టర్‌ను ఓ కుక్క చింపేసింది. దానిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో వైసీపీ నేతల అహం దెబ్బతిన్నట్టుంది. విజయవాడకు చెందిన పార్టీ మహిళా నాయకురాళ్ళు నిన్న రాత్రి నేరుగా నున్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కుక్కతో పాటు దాని యజమానిపై కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. దీని వెనుక కుట్ర కోణం దాగుందని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫిర్యాదుతో పాటు ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోను కుక్క తొలగిస్తున్న వీడియోను సైతం జత పరిచారు. ఇక ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది.
Updated Date - 2023-04-13T11:22:21+05:30 IST