TTD: శ్రీవారి సేవకు యువకులు ముందుకు రావాలి: ధర్మారెడ్డి
ABN, First Publish Date - 2023-06-04T19:58:19+05:30
వేసవిలో శ్రీవారి ఆలయంతోపాటు క్యూలైన్లలో భక్తులకు సేవలందించేందుకు యువకులైన శ్రీవారి సేవకులు ముందుకు రావాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) పిలుపునిచ్చారు.
తిరుమల: వేసవిలో శ్రీవారి ఆలయంతోపాటు క్యూలైన్లలో భక్తులకు సేవలందించేందుకు యువకులైన శ్రీవారి సేవకులు ముందుకు రావాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) పిలుపునిచ్చారు. ‘‘వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశాం. సుప్రభాత సేవ విచక్షణ కోటా రద్దు చేశాం. అధిక రద్దీ నేపథ్యంలో భక్తులు (Devotees) ఓపికతో ఉండి శ్రీవారిని దర్శించుకోవాలి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రత కోసం ఘాట్ల ప్రయాణంలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేశాం. ట్యాక్సీ డ్రైవర్లు, వాహనదారులు డ్రైవింగ్ చేసే సమయంలో టీటీడీ (TTD) నిర్ణయించిన వేగం మేరకు నిదానంగా ప్రయాణించాలి. తిరుమల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రాష్ట్రం హోంశాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు తిరుమలలో రెండ్రోజులపాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్షించారు. టీటీడీ చరిత్రలో తొలిసారిగా అధికారులు, ఉద్యోగులందరూ సుందరతిరుమల-శుద్ధతిరుమల పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల వ్యవధిలో 15,441 మంది రెగ్యులర్, 13,351 మంది కార్పొరేషన్ సిబ్బంది, ఆరువేల మందికిపై శ్రీవారిసేవకులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, కలెక్టరేట్, పోలీసు, న్యాయశాఖ అధికారులు తిరుమలలోని పలు ప్రాంతాలు, ఘాట్లు, నడకమార్గాల్లో పారిశుధ్య విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ కూడా పాల్గొని వ్యర్థాలను తొలగించారు’’ అని తెలిపారు.
Updated Date - 2023-06-04T19:58:19+05:30 IST