GST Council meet: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు.. ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం ట్యాక్స్.. క్యాన్సర్ ఔషధాలకు మినహాయింపు
ABN, First Publish Date - 2023-07-11T21:15:23+05:30
జీఎస్టీ కౌన్సిల్ (GST Council meet) 50వ మంగళవారం న్యూఢిల్లీలో ముగిసింది. ఆన్‌లైన్ గేమింగ్ (Online gaming) ముఖ విలువలో 28 శాతం ట్యాక్స్ విధింపునకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. హార్స్ రేసింగ్, క్యాసినోలకు ఇదే రేటు వర్తించనుంది. మరోవైపు క్యాన్సర్ సంబంధిత ఔషధాలు, అరుదైన వ్యాధులకు మెడిషిన్లు, ప్రత్యేక వైద్య పరిస్థితుల్లో అవసరమయ్యే ఆహార ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ (GST Council meet) 50వ సమావేశం మంగళవారం న్యూఢిల్లీలో ముగిసింది. ఆన్‌లైన్ గేమింగ్ (Online gaming) ముఖ విలువలో 28 శాతం ట్యాక్స్ విధింపునకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. హార్స్ రేసింగ్, క్యాసినోలకు ఇదే రేటు వర్తించనుంది. కాగా ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. నైపుణ్యానికి సంబంధించిన గేమ్ అయినా, డబ్బుల పందెంతో ఆడే గేమ్ అయినా 28 శాతం జీఎస్టీ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు క్యాన్సర్ సంబంధిత ఔషధాలు, అరుదైన వ్యాధులకు మెడిషిన్లు, ప్రత్యేక వైద్య పరిస్థితుల్లో అవసరమయ్యే ఆహార ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయింపునిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
జీఎస్టీ భేటీ ముగిసిన అనంతరం కేంద్ర ఆర్థిక, కార్పొరేటు వ్యవహారాల శాఖల మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. కొన్ని ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను తగ్గించగా.. మరికొన్నింటిని రెగ్యులర్ చేయనున్నట్టు వెల్లడించారు. వండని, వేగించని స్నాక్స్‌పై (unfried snack pellets) జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి, ఫిష్ సోలుబుల్ పేస్ట్‌పై 18 శాతం నుంచి 5 శాతం, నూలుపై 12 శాతం నుంచి 5 శాతానికి, ఎల్‌డీ స్లాగ్‌పై 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
Updated Date - 2023-07-11T21:24:14+05:30 IST