Mukesh Ambani: ఈ ఏడాది భారీగా సంపాదించిన ముకేష్ అంబానీ
ABN, Publish Date - Dec 30 , 2023 | 12:53 PM
2023 సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ సహా ప్రముఖ పారిశ్రామిక వెత్తలు భారీగా వారి సంపాదనను పెంచుకున్నారు. ఈ క్రమంలో వారికి ఏ మేరకు లాభం వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.
భారత అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ 2023లో భారీ మొత్తంలో ఆర్జించారు. ఈ ఏడాది ఆయన సంపద ఏకంగా 9.98 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందింది. భారతీయ కరెన్సీలో సుమారు రూ.80 వేల కోట్లతో సమానం. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) స్టాక్ వృద్ధి, జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ లాభాలు ఆయన సంపద పెరుగుదలకు దోహదపడ్డాయని బ్లూమ్‌బర్గ్ డేటా పేర్కొంది. ముఖ్యంగా జియో ఫైనాన్షియల్ స్టాక్ లిస్టింగ్‌తో గణనీయంగా ఆదాయం భారీగా పెరిగింది. ఈ 2023లో 9.98 బిలియన్ డాలర్లు పెరుగుదలతో ఆయన నికర సంపద విలువ 97.1 బిలియన్ డాలర్లకు పెరిగిందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది. సంపన్న భారతీయుల్లో నంబర్ వన్ స్థానంలో, ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ సంపన్నుడి నిలిచారని తెలిపింది.
మరో భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద 2023లో ఏకంగా 37.3 బిలయన్ డాలర్లు నష్టపోయినట్టు బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది. అదానీ సంపద ప్రస్తుతం 83.2 బిలియన్ డాలర్లుగా ఉందని, భారతీయ సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారని రిపోర్ట్ పేర్కొంది.
ఇక హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ వ్యవస్థాపకుడు శివ్ నడార్ 2023లో అధికంగా సంపాదించిన వారిలో రెండవ స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం తన సంపాదన విలువ 9.47 బిలియన్ డాలర్లుగా ఉంది. హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 41 శాతం మేర వృద్ధి చెందడం ఆయన ఆస్తి పెరుగుదల దోహదపడింది. ఇక ఓపీ జిందాల్ గ్రూప్ మాజీ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ ఈ ఏడాది 8.93 బిలియన్ డాలర్లు మేర ఆర్జించి మూడవ స్థానంలో నిలిచారు.
ఇక ప్రపంచ కుబేరుల జాబితా విషయానికి వస్తే ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొదటి స్థానానికి చేరుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల్లో మళ్లీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. మస్క్ 2022లో 138 బిలియన్ డాలర్లను కోల్పోయినప్పటికీ టెస్లా అధినేత 2023లో 95.4 బిలియన్ డాలర్లు సంపాదించారు. రెండవ స్థానంలో ఉన్న ఫ్రెంచ్ లగ్జరీ టైకూన్ ‘బెర్నార్డ్ ఆర్నాల్ట్’ కంటే మస్క్ సంపద 50 బిలియన్ డాలర్లు అధికంగా ఉన్నట్టు బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది.
Updated Date - Dec 30 , 2023 | 01:58 PM