RBI: పండగ చేస్కోండి.. ట్రాన్సాక్షన్ లిమిట్ పెరగనుంది.. గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ
ABN, First Publish Date - 2023-08-10T21:22:15+05:30
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం (10-08-23) శుభవార్త చెప్పింది. UPI లైట్ లావాదేవీల పరిమితిని పెంచాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడంతో పాటు దేశంలో డిజిటల్ చెల్లింపుల పరిధిని మరింతగా పెంచేందుకు గాను..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం (10-08-23) శుభవార్త చెప్పింది. UPI లైట్ లావాదేవీల పరిమితిని పెంచాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడంతో పాటు దేశంలో డిజిటల్ చెల్లింపుల పరిధిని మరింతగా పెంచేందుకు గాను.. ఆఫ్‌లైన్ మోడ్‌లో UPI లైట్ ట్రాన్సాక్షన్ పరిమితిని రూ.200 నుంచి రూ.500లకు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం UPI లైట్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC)పై సింగిల్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ. 200 గానూ, ఓవరాల్ లిమిట్ రూ.2000 గానూ నిర్దేశించింది. ఇప్పుడు ఆర్బీఐ కొత్త ప్రతిపాదన ప్రకారం సింగిల్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.500కి పెంచబడుతుంది. పిన్ నమోదు చేయకుండానే ఆఫ్‌లైన్ మోడ్‌లో ఈ సేవల్ని పొందవచ్చు.
యూపీఐ లైట్ చెల్లింపుల పరిమితిని పెంచాలన్న డిమాండ్ నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అయితే.. సింగిల్ ట్రాన్సాక్షన్ లిమిట్‌ని రూ.500 కి పెంచినా, యూపీఐ లైట్ వ్యాలెట్‌లో లోడ్ చేసుకునేందుకు ఉన్న మొత్తాన్ని మాత్రం రూ.2000కే పరిమితం చేయడం జరిగిందన్నారు. టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్ లేకుండా ట్రాన్సాక్షన్స్ విషయంలో రిస్కులు పొంచి ఉన్న నేపథ్యంలో.. వ్యాలెట్ పరిమితిని పెంచలేదని ఆయన అన్నారు. ఈ చెల్లింపుల పరిమితికి సంబంధించిన సూచనల్ని త్వరలోనే జారీ చేస్తామన్నారు. అలాగే.. డిజిటల్ పేమెంట్స్‌కు టెక్నాలజీని జోడించే ఉద్దేశంతో కొత్తగా ‘కన్వర్వేటివ్ పేమెంట్స్’ని తీసుకొస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఇందుకోసం UPIకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని జోడించామన్నారు. దీని ద్వారా.. సంభాషణలతోనే లావాదేవీలు పూర్తి చేయొచ్చని.. అయితే తొలుత ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే మాత్రమే ఇది అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. క్రమంగా ఇతర భాషల్ని జోడిస్తామన్నారు.
UPI లైట్ అంటే ఏమిటి?
ఇది అసలైన UPI పేమెంట్ సిస్టమ్ యొక్క సరళీకృత వెర్షన్. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), RBI గతేడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టాయి. చిన్న విలువ లావాదేవీలను సులభతరం చేయడానికే UPI లైట్‌ని రూపొందించారు. అప్పుడప్పుడు UPI ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. UPI లైట్‌లో అలాంటి సమస్యలు ఉండవు. UPI లైట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ‘పిన్’ నమోదు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం తొలగించింది. టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్‌ని తీసివేయడం ద్వారా.. చిన్న-విలువ లావాదేవీలు, రవాణా చెల్లింపులు, ఇతర సేవలు వేగవంతంగా, విశ్వసనీయంగా సేవలు కొనసాగుతున్నాయి.
UPI లైట్‌ని ఎలా ఉపయోగించాలి?
Paytm, PhonePe, Gpay లతో పాటు UPI చెల్లింపులకు మద్దతు ఇచ్చే దాదాపు అన్ని డిజిటల్ యాప్‌లలో UPI లైట్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడానికి.. ఆ యాప్ సెట్టింగ్స్‌లో వెళ్లి, UPI లైట్‌ను వెతికి, పేమెంట్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేయాలి. UPI లైట్‌ని సెట్ చేసిన తర్వాత దానికి బ్యాంక్ ఖాతాను లింక్ చేయాలి. UPI లైట్ వాలెట్‌లో డబ్బులు జమ చేయండి. ఇక పేమెంట్ చేయాలంటే.. రెగ్యులర్ UPI పేమెంట్ యాప్‌ని ఓపెన్ చేసి, QR కోడ్‌ని స్కాన్ చేయాలి (మొబైల్ నంబర్‌ను జోడించొచ్చు కూడా). చెల్లించాల్సిన మొత్తాన్ని నమోదు చేసి.. UPI లైట్‌ని ఉపయోగించి పేమెంట్ చేయాలి. అంతే.. సింపుల్!
Updated Date - 2023-08-10T21:22:39+05:30 IST