Crime: ఒక వైపు చంద్రయాన్ 3తో చంద్రుడిపై అడుగులు.. మరో వైపు 12 ఏళ్ల బాలికకు వివాహం, గర్భం
ABN, First Publish Date - 2023-08-29T19:01:18+05:30
మన దేశం ఒక వైపు ఆధునీక టెక్నాలజీతో పరుగులు పెడుతుంటే మరొకవైపు మాత్రం కొంత మంది ఇంకా పాత కాలంలోనే ఉండిపోతున్నారు. చిన్న, పెద్ద, మహిళలు అనే తేడా లేకుండా అందరికీ టెక్నాలజీకి అందుబాటులోకి వచ్చింది.
ముంబై: మన దేశం ఒక వైపు ఆధునీక టెక్నాలజీతో పరుగులు పెడుతుంటే మరొకవైపు మాత్రం కొంత మంది ఇంకా పాత కాలంలోనే ఉండిపోతున్నారు. చిన్న, పెద్ద, మహిళలు అనే తేడా లేకుండా అందరికీ టెక్నాలజీకి అందుబాటులోకి వచ్చింది. పాత పద్దతులను వదిలి అందరూ అధునిక పద్ధతులను పాటిస్తున్నారు. ఈ మధ్యనే చంద్రయాన్ 3 అంటూ మన రాకెట్ చంద్రుడిపై కూడా అడుగుపెట్టింది. అందులో మహిళల పాత్ర కూడా ఉంది. ఎంత అభివృద్ధి చెందితే ఏం లాభం.. ఇప్పటికీ కొంత మంది పాత కాలంలోనే ఉండిపోయారు. ఇప్పటికీ 19, 20వ శతాబ్దపు నాటి పద్దతులను పాటిస్తూ తమ వారసుల జీవితాలను సైతం నాశనం చేస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికకు 28 ఏళ్ల యువకుడితో బాల్య వివాహం చేశారు. దీంతో ఆ బాలిక గర్భం కూడా దాల్చింది. 21వ శతాబ్దంలోనూ బాల్య వివాహాలు జరుగుతుండడం విషాదకరమనే చెప్పుకోవాలి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది ఈ విషాదరకర ఘటన.
ఇటీవల ముంబైలో గర్భవతి అయిన ఓ మహిళ కడుపునొప్పితో బాధపడుతూ ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు గర్భంతో ఉన్న వ్యక్తి మైనర్ బాలిక అని అనుమానించారు. ఆమె వయసు గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. బాలిక వయసు 12 సంవత్సరాల 7 నెలల 23 రోజులు మాత్రమే. అంత చిన్న వయసులోనే బాలిక గర్భంతో ఉండడం చూసి వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీస్‌ల విచారణలో 28 ఏళ్ల వ్యక్తి బాలిక భర్త అని తేలింది. కుటుంబసభ్యుల అంగీకారంతో ఈ ఏడాది ప్రారంభంలో 12 ఏళ్ల బాలికకు, 28 ఏళ్ల యువకుడికి బిహార్‌లో వివాహం జరిగింది. కొన్ని నెలల తర్వాత వారు ముంబైకి వెళ్లారు. జూన్ 19 నుంచి ముంబైలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది. అయితే కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. 28 ఏళ్ల బాలిక భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అత్యాచార చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. అలాగే ఈ బాల్య వివాహాంలో ప్రమేయం ఉన్న రెండు కుటుంబాలపై కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Updated Date - 2023-08-29T19:01:18+05:30 IST