Chennai: విషాదం.. కరుణ నివాళి యాత్రలో పాల్గొన్న డీఎంకే కౌన్సిలర్ ఆకస్మిక మృతి
ABN, First Publish Date - 2023-08-08T08:57:34+05:30
నగరరంలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Former Chief Minister Karunanidhi) వర్ధంతి సందర్భంగా సోమవారం ఉదయం డీఎంకే(DMK) ఆధ్వర్యంలో నిర్వహించిన మౌనయాత్రలో పాల్గొన్న గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కౌన్సిలర్ ఆలపాక్కం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): నగరరంలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Former Chief Minister Karunanidhi) వర్ధంతి సందర్భంగా సోమవారం ఉదయం డీఎంకే(DMK) ఆధ్వర్యంలో నిర్వహించిన మౌనయాత్రలో పాల్గొన్న గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కౌన్సిలర్ ఆలపాక్కం షణ్ముగం (62) మృతిచెందారు. ఈ విషయం తెలియగానే డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. షణ్ముగం మృతి పార్టీకి తీరనిలోటు అని పేర్కొంటూ కుటుంబీకులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కార్పొరేషన్ 146వ వార్డు డీఎంకే కౌన్సిలర్‌గా ఉన్న షణ్ముగం మౌనయాత్రలో పాల్గొనేందుకు కారులో అన్నావిగ్రహం కూడలి వద్దకు వెళ్ళారు. కారు దిగి పార్టీ నాయకులతో కలిసి కొంతదూరం నడిచారు. కలైవానర్ అరంగం వద్ద ఆయన తీవ్ర అస్వస్థతకు గురై వెంటనే కారు డ్రైవర్‌కు ఫోన్ చేసి రమ్మని కబురుచేశారు. వాహనం వచ్చే లోగా ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే పార్టీ నిర్వాహకులు ఆయన్ను ఓమండూరార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించారు. షణ్ముగం కొన్నేళ్లకు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఈక్రమంలో ఆదివారం వేకువజాము కరుణానిధి శతజయంతి వేడుకల మారథాన్‌లో పాల్గొని ఐదు కిలోమీటర్ల దూరం వరకూ పరుగులు తీశారు. ఈ పరిస్థితుల్లో సోమవారం వేకువజామున మౌనయాత్రకు బయలుదేరి అస్వస్థతకు గురై మృతి చెందారు. షణ్ముగం భౌతికకాయాన్ని ఆయన స్వస్థలమైన ఆలపాక్కం నివాస గృహానికి తరలించారు. డీఎంకే స్థానిక శాఖ నాయకుడు, కౌన్సిలర్లు ఆయనకు నివాళి అర్పించారు. షణ్ముగంకు భార్య సుమతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. షణ్ముగం కుమారుడు దినకరన్ డీఎంకే యువజన విభాగం నాయకుడు. షణ్ముగం అంత్యక్రియలు మంగళవారం ఉదయం ఆలపాక్కం శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబీకులు తెలిపారు.
పార్టీకి తీరని లోటు: స్టాలిన్
కౌన్సిలర్ ఆలపాక్కం షణ్ముగం ఆకస్మిక మృతి పార్టీకి తీరనిలోటు అని డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ అన్నారు. ఈ మేరకు ఓ సంతాప సందేశం వెలువరిస్తూ... మాజీముఖ్యమంత్రి కరుణానిధి వర్ధంతి మౌన ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన షణ్ముగం ఆకస్మికంగా మృతి చెందటం తనను కలచివేసిందన్నారు. మధురవాయల్ ప్రాంతంలో పార్టీ అభివృద్ధికి షణ్ముగం కృష్టిని తాము మరవలేమని తెలిపారు. షణ్ముగం మృతితో శోకతప్తులైన ఆయన కుటుంబీకులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని స్టాలిన్ పేర్కొన్నారు.
Updated Date - 2023-08-08T09:04:32+05:30 IST