ఈ ‘అందరివాడు’ అంబేడ్కరైట్ ఎలా అవుతాడు?
ABN , First Publish Date - 2023-09-13T03:53:00+05:30 IST
‘యాలరో యీ మాదిగ బతుకూ, నీకు మొత్తుకుంటే దొరకదురా మెతుకూ’ –అనే పాట నలభై ఏళ్ళ క్రితం మొదటిసారి విన్నాను. 1980–85 మధ్యకాలంలో విప్లవ విద్యార్థుల ‘విద్యార్థులారా!...
ఉన్నది ఉన్నట్టుగా చూడు. ఉన్నదాన్ని ఎక్కువ చెయ్యొద్దు, తగ్గించవద్దు. మాయం చెయ్యొద్దు
బుద్ధుడు
‘యాలరో యీ మాదిగ బతుకూ, నీకు మొత్తుకుంటే దొరకదురా మెతుకూ’ –అనే పాట నలభై ఏళ్ళ క్రితం మొదటిసారి విన్నాను. 1980–85 మధ్యకాలంలో విప్లవ విద్యార్థుల ‘విద్యార్థులారా! గ్రామాలకు తరలండి’ అనే వేసవి కార్యక్రమంలో, అనేక పాటల మధ్య ఈ పాటని ఎక్కువగా ప్రజల మధ్య పాడేవాళ్ళం. మంచినీటి కోసం, సర్టిఫికెట్లు పొందడం కోసం, ఇంటి నిర్మాణ పనుల్లో, తెల్ల బట్టలు కట్టిన సందర్భంలో మాదిగలు ఎంత దారుణమైన కుల హింసలకు, వివక్షలకు గురౌతున్నారో గద్దర్ ఈ పాటలో ఎంతో ఆర్తిగా రాశారు. 1985 కారంచేడులో కుల దురహంకార దాడిని ప్రతిఘటించి అమరవీరులైన మాదిగలపై గద్దర్ రాసి, పాడిన ‘దళిత పులులమ్మా! కారంచేడు భూస్వాముల మీద, కలబడి నిలబడి పోరు చేసిన...’ అనే పాటని సమాజం రోజూ నెమరువేసుకుంటూనే వుంది. ‘ఆగదు ఆగదు ఆగదు, ఈ ఆకలి పోరూ ఆగదు’, ‘వడ్డెరోళ్ళ మండి మేమూ’, ‘ఈ దేశం ఎవరిదిరా ఈ దేశం మనదేరా’... ఇంకా ఆనాడు గద్దర్ నోట గానమైన ఎన్నో పాటలు సమాజంలోని వర్గ, కుల, జెండర్ అసమానతలను ఎత్తి చూపినాయి. పీడితుల దృక్పథంతో కొన్నిసార్లు దుఃఖాన్ని, సహానుభూతినీ పంచాయి. సమాజంలో అసమానతలు ఉన్నంత వరకూ కొన్ని గద్దర్ పాటలు ప్రాసంగికత కలిగి పీడితులను కదిలిస్తూనే ఉంటాయి. ఇది సాంస్కృతిక రంగంలో గద్దర్ ముద్ర, కృషీ, ప్రభావం.
ఇక, ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ కోసం, మానవ గౌరవం, కోల్పోయిన మానవ హక్కులు తిరిగి పొందటం కోసం జరిగిన మాదిగ దండోరా చరిత్రాత్మక ఉద్యమాన్ని పైకి బలపరిచినప్పటికీ, మాల కులస్తుడైన గద్దర్ మాదిగల విషయంలో సమధర్మాన్ని పాటించలేదు. ధర్మాన్ని పాటించడం అంటే బౌద్ధాన్ని స్వీకరించడం కాదు. తనకంటే వెనుకబడిన సమూహాలకు న్యాయం జరగాలని ఆచరణలో ఉండటం, నిరంతరం బాధితులతో ఉండటం. సామాజిక న్యాయమంటే, 59 ఎస్సీ కులాలకు రిజర్వేషన్లలో సామాజిక గౌరవంతో కూడిన పంపిణీ న్యాయం జరిపించుకోవడం. ఇందుకోసం కృషి చేయడం. అంతేకానీ, వేదికల మీద, పెదవులపై అంబేడ్కర్ పదాలను నర్తింపజేయడమంత ఈజీ వ్యవహారం కాదది.
అణగారిన కులాల సమస్యల మీద, ఇతర సామాజిక సమస్యల మీదా తాను పాటలు రాసి, పాడినపుడు సాంస్కృతిక రాజకీయాల్లో గద్దర్ ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. తాను పాడిన హిట్టు పాటల్లో ఇతరులు రాసిన హిట్టు పాటలు కూడా చాలా ఉన్నాయి. ఇలా ఎందరో రాసిన, ఎన్నో హిట్టు పాటలను పాడడం వలన, యీ పాటల క్రెడిట్స్ కూడా గద్దర్ కీర్తి ప్రతిష్ఠల అకౌంట్లోనే పడిపోయాయి. ఎర్ర జెండా అతనికి ఊతకర్ర అయింది. అంతే కాదు, అతనికి వచ్చిన అపరిమిత కీర్తి ప్రతిష్ఠల వెనుక, పీపుల్స్‌వార్, ఇంకా మరెన్నో ప్రజా సంస్థల రాజకీయ, నైతిక, భౌతిక సంఘీభావం ఉంది. సంస్థాగత బలం తెచ్చిపెట్టిన ఈ అపరిమిత కీర్తి ప్రతిష్ఠలను వొదులుకోవడం ఇష్టంలేక, దానిని కొనసాగించుకోవడానికిగాను, తానింకా విప్లవ పార్టీలోనే కొనసాగుతున్నట్లు గద్దర్ సమాజాన్ని భ్రమింపజేశాడు. ఇది ప్రజల్ని మోసం చెయ్యడమే. అలాగే, గద్దర్ మా పార్టీలో లేడు, బైటకు వెళ్ళాడు, అతనికీ మాకూ సంబంధం లేదని మావోయిస్టు పార్టీ కూడా ప్రముఖంగా ప్రకటించి ప్రజల దృష్టికి తీసుకురాకపోవడం వలన, గద్దర్ ఇంకా ఆ పార్టీలోనే కొనసాగుతున్నాడని సామాన్య ప్రజలు భ్రమించడానికి ఆస్కారం కలిగింది. ప్రజల పట్ల జవాబుదారీతనంతో, పారదర్శకతతో లేకపోవడం వలన, ఆయన అనుసరించిన అనేక అస్పష్ట రాజకీయ మార్గాలు ప్రజల్ని గందరగోళంలో పెట్టాయనేది స్పష్టం.
భారతదేశంలో అధికార, ప్రతిపక్ష, కమ్యూనిస్టు, విప్లవ పార్టీలన్నీ పాలక కులాల నాయకత్వ నియంత్రణలో ఉన్నవే. ఆధిపత్య కుల నాయకత్వాల పార్టీలన్నీ హిందూ ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలే. త్రివర్ణ, శూద్రాధిపత్య కులాల రాజకీయ ప్రయోజనాలను పెంపొందించడం కోసం కష్టపడే బహుజన సామాజిక వర్గాల వ్యక్తులకు ఈ ఆధిపత్య కుల రాజకీయ వ్యవస్థలు రాముని సేవలో తరించే హనుమంతుడు వంటి సామాజిక స్థాయి నాయకత్వాన్ని కట్టబెట్టి, ప్రాచుర్యం కల్పిస్తాయి. వర్గ రహిత ఉద్యమ వ్యూహంలో గద్దర్‌కి కల్పించిన ప్రముఖత్వం కూడా ఇటువంటిదే. అపరిమితమైన కీర్తి ప్రతిష్ఠలను పొందిన గద్దర్ పారదర్శకతతో, జవాబుదారీతనంతో వ్యవహరించివుంటే బహుజన రాజకీయ సాంస్కృతిక ఉద్యమానికి పునరంకితమై ఉండేవాడు. కానీ, అట్లా లేడు.
విముక్తి సిద్ధాంతాలను పుక్కిటబట్టి, వాటిని వ్యక్తిగత, ప్రైవేట్ ఉన్నతి కోసం, కేవలం ఒక సాధనంగా వాడుకునే వారిని తోసిపుచ్చే స్థాయికి మన ప్రజల్లో పర్యవేక్షక చైతన్యం పెరగలేదు. ఇది వివిధ రంగాల్లో నాయకులుగా తిష్ట వేసినవారికి పెద్ద సామాజిక వనరుల పెట్టుబడి అయి కూర్చుంది. అంబేడ్కరైట్ పార్టీలన్నింటికీ గద్దర్ సమ దూరంలో ఉన్నాడు, మనువాద పార్టీలన్నింటికీ సమసామీప్యతలో ఉన్నాడు.
గద్దర్ ఎర్ర జెండా ఎత్తుకున్నాడు కానీ, దశాబ్దాలుగా ఏ ఎర్ర పార్టీలోనూ లేడు. ఉన్నట్లు ప్రజల్ని గందరగోళానికి గురి చేశాడు. బులుగు జెండా ఎత్తుకున్నాడు గానీ, కొన్ని దశాబ్దాలుగా ఏ బులుగు పార్టీలోనూ లేడు. ఉన్నట్లు ప్రజల్ని గందరగోళానికి గురిచేశాడు. అలా రాజకీయ, సాంస్కృతిక సంతలో తన ప్రముఖత్వం తగ్గకుండా కాపాడుకున్నాడు. ప్రజల అభిమానాన్ని ఆరాధన స్థాయికి తీసుకెళ్ళడంలో తిలా పాపం తలా పిడికెడు. ‘గాంధీ, రణడే, జిన్నా’ అనే వ్యాసంలో డాక్టర్ అంబేడ్కర్ – వ్యక్తి ఆరాధన సరైంది కాదనీ, మూఢులు మాత్రమే వ్యక్తి ఆరాధన చేస్తారని, నాయకుల పట్ల అనుమానం కలిగితే ప్రశ్నించాలని రాశారు. మూఢులు తాము ఆరాధించే వారి కోసం చావడానికీ, చంపడానికి వెనకాడబోరని రాశారు. అంతేకాదు, ఇది రాజ్యాన్ని నడిపించే వారికి లాభిస్తుంది. ఈ పరిస్థితిని హేతువుతో నిలవరించకపోతే, ఇక మూఢత్వమే మిగులుతుంది.
గతంలో యుద్ధనౌకగా, అమరుల కమిటీ నాయకునిగా పని చేశాననీ, కొన్ని దశాబ్దాలుగా సాయుధ రాజకీయ కార్యక్రమాన్ని, పంథాని వదిలేశాననీ, గతంలో నా ఆట పాట మాట విని విప్లవోద్యమం పట్ల ఆకర్షితులై, అందులో పనిచేసి, చదువులూ, ఉద్యోగాలు, ఆస్తులు, ప్రాణాలు, భవిష్యత్తులు త్యాగం చేసినవారికి, వారి కుటుంబాలకు గద్దర్ నిజాయితీగా క్షమాపణ చెప్పివుంటే బాగుండేది. గతి తార్కిక, చారిత్రక భౌతిక వాదాలను వదిలేశాననీ, అందుకే, భద్రాద్రి, యాదాద్రి ఇత్యాది గుళ్ళని సందర్శించడం, చినజియ్యర్ ఆశీర్వాదాన్ని పొందటం ఇత్యాదులన్నింటికీ ప్రజలకు క్షమాపణ చెప్పగల అవకాశం ఉండి కూడా చెప్పకపోవడం గద్దర్ బాధ్యతారాహిత్యానికి గుర్తు.
ఇక ఇప్పుడు, గద్దర్ సంస్మరణ వేదికలపై అతని కులం వారినే డిస్ప్రపోర్షనేట్ సంఖ్యలో చూడగలం. చాలామంది గద్దర్ స్వీయ కులస్తులు తమ కుల సాంస్కృతిక, రాజకీయ ఏకీకరణకు గద్దర్ ఇమేజ్‌ను వాడుకుంటున్నారనీ అర్ధం చేసుకోగలం. ఇది తప్పేమీ కాదు కూడా. కానీ, వీరిలో అత్యధికులు మాదిగలకు, మిగిలిన మార్జినలైజ్డ్ ఎస్సీ కుల సమూహాలకు రిజర్వేషన్లలో పంపిణీ న్యాయాన్ని వ్యతిరేకించిన వారే ఉండటమే బాధాకరమైన విషయం. ఇలాంటి వేదికలపై కొద్దిమంది మాదిగ స్పృహ లేని, లేదా డబుల్ స్టేట్మెంట్ మాదిగలను కూడా చూడగలం. మరి గద్దర్‌ని అభిమానించేవారు అన్ని సమూహాల్లో వున్నారు కదా? అది కాలం అవసరం. అతన్ని ఎలా కావాలంటే, అలా కొరముట్టుగా వాడేసుకోవడం నేడు వ్యక్తుల, రాజకీయ సమూహాల ‘అవసరం’ అయింది. ఇలా తమకు పనికివచ్చే సరుకుగా గద్దర్‌ని తయారు చేసుకున్నారు, గద్దర్ అలా ‘అందరి వాడ’య్యాడు.
సమాజం ఏ వ్యక్తికైనా అపరిమితమైన గుర్తింపు, కీర్తిప్రతిష్ఠలు కట్టబెట్టినా, లేక ఆ వ్యక్తి వాటిని నిర్మించుకుని, నిలబెట్టుకోవడానికి ప్రయత్నించినా అవి డబ్బుపెట్టి కొనలేని ‘డిస్ప్రపోర్షనేట్ సోషల్ అసెట్’ అవుతాయి. ఏ మనిషైనా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరివర్తన కోసం కృషి చేస్తే అది ఆ వ్యక్తి గుర్తించిన సామాజిక బాధ్యత మాత్రమే అవుతుంది. ప్రతి మనిషీ, ఆ మాటకొస్తే ప్రతీ రంగంలో విజయం సాధించిన నాయకుడు లేదా నాయకురాలు ‘పంపిణీ న్యాయం, తగిన గౌరవం’ పొందడానికి మాత్రమే అర్హులౌతారు. ఇందుకు మాత్రమే వారు పరిమితం కావాలి. ప్రజల అభిమానాన్ని అపరిమిత కీర్తి ప్రతిష్ఠలు అనే సోషల్ క్యాపిటల్ కింద గద్దర్ కూడబెట్టుకోకుండా ఉండవలసింది.
కృపాకర్ మాదిగ
సామాజిక ఉద్యమాల కార్యకర్త