ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kothapaluku : సెటిలర్ల సెంటిమెంట్‌

ABN, First Publish Date - 2023-10-15T03:14:48+05:30

తాడూ బొంగరం లేని స్కిల్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలులో నిర్బంధించిన నెల రోజుల తర్వాత కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలుసుకున్నారు...

తాడూ బొంగరం లేని స్కిల్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలులో నిర్బంధించిన నెల రోజుల తర్వాత కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలుసుకున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో కూడా పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి చంద్రబాబును అరెస్టు చేసిన వెంటనే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, హోం మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి లోకేశ్‌ ప్రయత్నించారు. లోకేశ్‌ రిక్వెస్ట్‌పై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం.. హోం మంత్రి అమిత్‌ షాను కలుసుకోవలసిందిగా సూచించింది. కారణం తెలియదు గానీ అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ లోకేశ్‌కు లభించలేదు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం లోకేశ్‌ను పిలిపించుకొని అమిత్‌ షా మాట్లాడటం, ఆ సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కూడా పాల్గొనడంతో ఊహాగానాలు రెక్కలు విప్పుకొన్నాయి. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు, స్కిల్‌ కేసులో సరైన ఆధారాలు లేకపోయినా నెల రోజులకు పైగా ఆయనను జైల్లో నిర్బంధించడంతో తెలంగాణలోని సెటిలర్లు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ దశలోనే తెలంగాణలో శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడింది. దీంతో తెలంగాణలో సెటిలర్లు కీలకంగా మారారు. వారి మనోభావాలను రాజకీయ పార్టీలు కూడా గుర్తించాయి.

చంద్రబాబు ప్రస్తుత దుస్థితికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఒక్కరే కారణం కాదని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా కారణమన్న అభిప్రాయం సెటిలర్లలో బలపడింది. దీంతో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న అభిప్రాయానికి సెటిలర్లు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం వచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈ తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటనకు రావడం, ఈ సందర్భంగా స్థానిక పార్టీ నాయకులు వెలిబుచ్చిన అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని లోకేశ్‌కు ఉన్నపళంగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం జరిగింది.

అపాయింట్‌మెంట్‌ విషయాన్ని కూడా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి స్వయంగా లోకేశ్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. తెలంగాణలోని సెటిలర్లు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారన్న వాస్తవాన్ని గుర్తించడం వల్లనే దానికి విరుగుడుగా ఈ సమావేశం జరిగిందని భావించవచ్చు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదిన్నరేళ్లు అవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకొనే రాజకీయాల ప్రభావం తెలంగాణలోని సెటిలర్లపై ఉంటుందని అనేక సందర్భాలలో రుజువైంది. సంఖ్యాపరంగా లక్షల్లో ఉన్న సెటిలర్ల ప్రాధాన్యాన్ని గుర్తించిన కేసీఆర్‌, మొదటి నుంచీ వారిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలు మాత్రం సెటిలర్లను పట్టించుకోలేదు. దీని ప్రభావం గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కనపడింది. ఆ ఎన్నికల్లో సెటిలర్లు మద్దతు ఇవ్వడంతో అప్పుడు టీఆర్‌ఎస్‌ బతికి బట్టకట్టింది. సెటిలర్ల మద్దతు లభించి ఉంటే గ్రేటర్‌పై బీజేపీ జెండా ఎగిరి ఉండేది. ఈ వాస్తవాన్ని గుర్తించిన తెలంగాణ బీజేపీలోని ఒక వర్గం నాయకులు ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డిని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీతో చేతులు కలపాల్సిందిగా తమ పార్టీ కేంద్ర నాయకులకు సూచిస్తూ వచ్చారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ సూచనలను పెడచెవిన పెడుతూ వచ్చింది.

మరోవైపు సెటిలర్ల విషయంలో కేసీఆర్‌ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం మార్గదర్శి చిట్‌ ఫండ్‌ విషయంలో రామోజీరావును అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లాలని అనుకుంటున్నామని, అందుకు తెలంగాణ పోలీసుల సహకారం కావాలని జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా ఫోన్‌ చేసి కోరారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ తన తండ్రి కేసీఆర్‌కు చెప్పగా, ‘అక్కడి దరిద్రాన్ని మనకు చుట్టాలని చూస్తున్నారు. ఇక్కడకు వచ్చి ఇష్టం వచ్చినట్టు అరెస్టు చేస్తే సహకరించేది లేదు అని చెప్పు’ అని కేసీఆర్‌ బదులిచ్చారు. దీంతో రామోజీరావు అరెస్టు ప్రయత్నాన్ని జగన్‌ తాత్కాలికంగా విరమించుకున్నారు. చంద్రబాబు కూడా హైదరాబాద్‌ వెళ్లిపోతే స్కిల్‌ కేసులో అరెస్టు చేయలేమన్న ఉద్దేశంతోనే నంద్యాలలో తెల్లవారుజామున హడావుడిగా అరెస్టు చేయించారు. కేసీఆర్‌ ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టకపోయినా, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు మద్దతు ఇవ్వడం, గత ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోవడానికి కేసీఆర్‌ సహాయపడడం వల్లనే అటు రాష్ర్టానికి, ఇటు చంద్రబాబుకు ప్రస్తుత దుస్థితి అన్న కోపం సెటిలర్లలో ఉండింది. ఈ తరుణంలో చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు నిరసన తెలపడం, వారిపై పోలీసులు లాఠీచార్జి చేసి కేసులు పెట్టడం, ‘ర్యాలీలు, ధర్నాలు ఆంధ్రప్రదేశ్‌లో చేసుకోండి– హైదరాబాద్‌లో అనుమతించం’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించడంతో, కమ్మ సామాజిక వర్గంలో కేసీఆర్‌పై వ్యతిరేకత ఏర్పడింది.

ఇది గుర్తించిన కేటీఆర్‌ కూడా తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రధాని మోదీ ఆశీస్సులు లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి చెలరేగి పోలేరన్న అభిప్రాయం ఇదివరకే ఉన్నందున చంద్రబాబు అరెస్టు తర్వాత సెటిలర్లు బీజేపీపై మరింత గుర్రుగా ఉంటున్నారు. ఎన్నికల్లో సెటిలర్ల ప్రాధాన్యం గురించి ఎవరెంతగా చెప్పినా గుర్తించడానికి నిరాకరిస్తూ వచ్చిన బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఇప్పుడు తత్వం బోధపడినట్టుంది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్‌ షాకు స్థానిక నాయకులు తాజా పరిస్థితులను వివరించగా ఆయన అప్పటికప్పుడు ప్రధాని మోదీతో మాట్లాడటం, ఆ వెంటనే లోకేశ్‌కు పిలుపు రావడం జరిగాయి. అయితే లోకేశ్‌ను కలిసి వినతిపత్రం తీసుకున్నంత మాత్రాన తెలంగాణలోని సెటిలర్లు బీజేపీకి అనుకూలంగా మారిపోతారా? అంటే చెప్పడం కష్టమే!

ఆ రెండింటితో కలిసేందుకు ఎత్తు?

తెలంగాణలో పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పార్టీ పరిస్థితిని మెరుగుపరచుకోవడం ఎలా అన్న దానిపై బీజేపీతో పాటు ఆరెస్సెస్‌ పెద్దలు కూడా తమ మెదళ్లకు పదును పెట్టడం మొదలుపెట్టారు. దీంతో అనూహ్య ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి. 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీతో పొత్తును కొనసాగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కిషన్‌ రెడ్డి వంటి వారు కూడా ఇప్పుడు మెత్తబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో కలిసి ఉన్నప్పుడు తెలంగాణలో కూడా కలసి నడుద్దామన్న చంద్రబాబు ప్రతిపాదనను మోదీ–షాలు అప్పట్లో తిరస్కరించారు. దీంతో 2018లో చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. అయిదేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవసరాన్ని స్థానిక బీజేపీ నాయకులు తమ కేంద్ర నాయకత్వానికి బలంగా చెప్పారు. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలిసి రావడంతో మోదీ–షాల వైఖరి కూడా తెలుగుదేశం విషయంలో మారినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్య పొత్తుల ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ– తెలుగుదేశం–జనసేన కలసి పోటీ చేస్తే కనీసం 20 స్థానాలు గెలుచుకోవచ్చన్న అభిప్రాయంతో బీజేపీ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది.

రాజకీయ సమీకరణాలు మారని పక్షంలో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విజయావకాశాలను కొట్టిపారేయలేమని నివేదికలు చెబుతున్నాయి. వివిధ సర్వేలలో కూడా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోటా పోటీ పరిస్థితి ఉన్నట్టు వెల్లడవుతోంది. తెలంగాణలో హంగ్‌ ఏర్పడితే తప్ప కాంగ్రెస్‌ను నిలువరించలేమన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా సొంతంగా పోటీ చేస్తే పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఉండబోదని కేంద్ర పెద్దల వద్ద తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఈ కారణంగానే తెలుగుదేశం–జనసేనతో పొత్తు ప్రతిపాదన చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో చంద్రబాబుకు న్యాయం జరిగి జైలు నుంచి ఆయన విడుదల కాని పక్షంలో ఈ మూడు పార్టీలూ కలిసి పోటీ చేసినా ఫలితం ఉండదని రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో బీజేపీ వైఖరి మారనంత వరకు తెలంగాణలో ఎన్ని ప్రయోగాలు చేసినా ఉపయోగం ఉండకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. జగన్‌ ప్రభుత్వం ఆయనపై కేసుల మీద కేసులు పెట్టి జైలుకే పరిమితం చేయాలని చూస్తోంది. న్యాయస్థానాలలో కూడా న్యాయం ఆయనకు ఎండమావిగా మారుతోంది. ఈ నిస్సహాయ స్థితిలో చంద్రబాబును లొంగదీసుకోవడం తేలిక అన్న అభిప్రాయంతో ఉన్న బీజేపీ నాయకులు కొందరు తెలంగాణలో పొత్తు ప్రతిపాదనను తెర మీదకు తెస్తున్నారు.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వ్యాఖ్యల వల్ల చంద్రబాబు అక్రమ అరెస్టు కేంద్ర ఆశీస్సులతోనే జరిగిందన్న అభిప్రాయం ఉభయ రాష్ర్టాల ప్రజల్లో వ్యాపించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణలో కూడా బీజేపీ ఆత్మరక్షణలో పడింది. ఈ పరిస్థితిని అధిగమించడానికే లోకేశ్‌ను అమిత్‌ షా తన వద్దకు పిలిపించుకున్నారు. ఇప్పుడు బీజేపీ–తెలుగుదేశం–జనసేన పొత్తు తెలంగాణలో గేమ్‌ చేంజర్‌గా మారుతుందా? లేదా? అన్న విషయానికి వద్దాం. మున్ముందు రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో తెలియదు గానీ ప్రస్తుతానికైతే సెటిలర్లు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం సెటిలర్లు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సొంతంగా తెలంగాణలో పోటీ చేయకూడదని సెటిలర్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే సెటిలర్ల ఓట్లు చీలి లక్ష్యం దెబ్బ తింటుందని ఈ వర్గం వాదిస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు కూడా ఈ అభిప్రాయాన్ని చేరవేశారు.

తెలంగాణలో పోటీ చేయకూడదన్న విషయమై చంద్రబాబు ఇంకా ఒక నిర్ణయం తీసుకోకపోయినా ఆ పార్టీకి చెందిన మెజారిటీ నాయకులు పోటీకి విముఖంగా ఉన్నారు. గత ఎన్నికల్లో తన సూచనను పెడచెవిన పెట్టి కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసినందున ఆ తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బ కొట్టడానికి కేసీఆర్‌ అన్ని ప్రయత్నాలూ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు హైదరాబాద్‌ నుంచి డబ్బు అందకుండా కట్టడి చేశారు. తలసాని శ్రీనివాస యాదవ్‌ వంటి మంత్రులను పంపించి సీఎం చంద్రబాబుపై వ్యతిరేకత పెంచారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న సెటిలర్లు ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు కూడా వ్యతిరేకంగా మారారు. కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి వస్తే గత ఎన్నికల్లో మాదిరిగానే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కూడా చంద్రబాబును ఇబ్బంది పెడతారన్న అభిప్రాయంతో సెటిలర్లు ఉన్నారు. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ తన వంతు ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మొదటి నుంచీ సానుకూల దృక్పథంతోనే ఉన్నారు. ఆయన అధికారంలోకి వస్తే చంద్రబాబుకు ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందని కూడా సెటిలర్లు భావిస్తున్నారు.

ఈ కారణంగానే పోటీలోకి దిగవద్దని సెటిలర్లు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి తెస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేయడానికి సెటిలర్లు ముందుకు వస్తున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మరో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు రేపోమాపో కాంగ్రెస్‌లో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితులలో చంద్రబాబును లొంగదీసుకొని తెలుగుదేశం–జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళితే తమ పార్టీ పరిస్థితి మెరుగవుతుందని తెలంగాణ బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పొత్తు కార్యరూపం తీసుకుంటే కాంగ్రెస్‌ పార్టీకి కొంత మేర నష్టం జరుగుతుంది. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ లాభపడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డిని కట్టడి చేయకుండా సహకరిస్తున్న బీజేపీతో ఎక్కడ పొత్తు పెట్టుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి నష్టం జరగడం తథ్యం అన్న భావన కూడా ఉంది. అందుకే తెలంగాణలో ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందిగా తెలుగుదేశం నాయకత్వంపై సెటిలర్లు ఒత్తిడి తెస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు బీజేపీ నుంచి ఏ రూపంలో నష్టం జరిగినా తెలంగాణలో పొత్తులు ఫలించకపోవచ్చు. వాస్తవానికి పొత్తుల ప్రతిపాదనలు నిజమైతే తెలుగుదేశం పార్టీకి ఇది విషమ పరీక్ష వంటిదే. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతే తెలుగుదేశం పార్టీ తీసుకొనే వైఖరిలో స్పష్టత వస్తుంది. తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది. ఈ నెల 15న పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేయనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, 16వ తేదీ నుంచి జనంలోకి వెళుతున్నారు. ప్రస్తుతం తన పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న ప్రజలను తనవైపు తిప్పుకోవడం కోసం ఏదో ఒక మాయోపాయం ఆయన రచించే ఉంటారు. చూద్దాం.. తెలంగాణ రాజకీయాల్లో ఏమేం మార్పులు చోటు చేసుకోబోతున్నాయో!


గురివింద మాటలు!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వ్యవహార శైలి విషయానికి వద్దాం. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు పేదలు–పెత్తందార్లకు మధ్య జరగబోయే కురుక్షేత్రం వంటివని జగన్‌ ఈ మధ్య తరచుగా అంటున్నారు. తనను తాను పేదల ప్రతినిధిగా చెప్పుకొంటున్నారు. రాజమండ్రి జైలులో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న చంద్రబాబును పెత్తందారుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్‌ రెడ్డి అనే వ్యక్తి వంచనకు మరో రూపం అని చెప్పవచ్చు. పేదలను కత్తి– డాలుగా వాడుకొని సంపదను పోగేసుకోవడం, విలాసవంతమైన జీవితం గడపడంలో జగన్‌ను మించినవాళ్లు ఈ దేశ రాజకీయాల్లోనే లేరనవచ్చు.

విజయదశమి నుంచి తన క్యాంప్‌ ఆఫీస్‌ను విశాఖపట్నానికి తరలిస్తున్నానని ప్రకటించిన జగన్‌రెడ్డి అక్కడ తాను నివసించడం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి 500 కోట్లు ఖర్చు చేయించి నిర్మించిన అత్యంత విలాసవంతమైన ప్యాలెస్‌ను సిద్ధం చేసుకున్నారు. రుషికొండపై నిర్మితమైన సదరు ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలిస్తే ఈ దేశ ప్రధాని కూడా అంతటి విలాసవంతమైన భవనంలో ఉండటం లేదని చెప్పవచ్చు. పేదల ప్రతినిధిని అని చెప్పుకొనే జగన్మోహన్‌ రెడ్డికి దేశంలో మరే నాయకుడికీ లేనటువంటి ఖరీదైన, కళ్లు చెదిరే సౌకర్యాలతో కూడిన భవంతి ఎందుకు అన్న ప్రశ్న ఉత్పన్నం కాదా? నిజమైన పేదలను సెంటు స్థలంలోనే ఇళ్లు కట్టుకొని, దానినే విలాసవంతమైనదిగా భావించి ఎంజాయ్‌ చేయమని చెబుతున్నవారి ప్రతినిధి జగన్‌కు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్యాలెస్‌ అవసరమా? ముఖ్యమంత్రి నివసించబోయే రుషికొండ భవంతిలో బాత్‌రూమ్‌లో స్నానాల తొట్టి కోసమే 25 లక్షల వంతున ఖర్చు చేశారు. అంటే, పేదలు కుటుంబ సభ్యులతో కలిసి నివసించడానికి సొంత డబ్బుతో కట్టుకున్న ఇళ్లకంటే జగన్‌రెడ్డి వాడబోతున్న స్నానాల తొట్టే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మితం అవుతోందన్న మాట.

అయినా ఆయనను పేదల ప్రతినిధిగానే మనం అంగీకరించాలట! జగన్‌ ఉండబోయే రుషికొండ భవంతిలో చదరపు అడుగు ఫ్లోరింగ్‌కు 25 వేల రూపాయల వంతున ఖర్చు చేశారు. అయినా ఆయనను పేదల ప్రతినిధిగానే నీలి, కూలి మీడియాలతో పాటు పేటీఎం బ్యాచ్‌ కీర్తించడం వెగటు పుట్టిస్తోంది. మరో ఆరేడు నెలల తర్వాత జగన్‌ అధికారంలో ఉంటారో లేదో తెలియదు. అయినా ఇంత స్వల్ప కాలానికే అంత విలాసవంతమైన భవనాన్ని నిర్మించిన అధికారులను ఏమనాలి? అధికారం కోల్పోయినా ఆ భవనాన్ని అట్టిపెట్టుకోవడం కోసం జగన్‌ కుటిల యత్నాలు చేస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్‌ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్‌తో పాటు హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో ఒక ప్యాలెస్‌, బెంగళూరులో మరో ప్యాలెస్‌ ఉన్నాయి. అక్కడ ఆయన ఉండింది కూడా లేదు. పూర్వ కాలంలో రాజులు మాత్రమే వేసవి విడిది కోసం, శీతాకాలం విడిది కోసం అంటూ వేర్వేరు ప్రాంతాల్లో రాజ ప్రాసాదాలు నిర్మించుకొనేవారు.

ఇంతకాలానికి ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డిలో ఆ పోకడలు చూస్తున్నాం. ఇంతా చేసి రుషికొండలో 500 కోట్ల ఖర్చుతో నిర్మించిన భవంతిలో జగన్‌తో పాటు ఆయన భార్య మాత్రమే ఉంటారు. లండన్‌, పారిస్‌లో విద్యను అభ్యసిస్తున్న ఆయన కుమార్తెలు ఇద్దరూ చదువులు ముగిశాక స్వదేశం తిరిగి వస్తారో రారో కూడా తెలియదు.

లింగు లింగు మంటూ ఇద్దరు ఉండటం కోసం ఇన్ని ప్యాలెస్‌లు అవసరమా? అయినా ఆయనను పేదల ప్రతినిధిగానే గుర్తించాలని అంటున్నారు. కలి మహిమ అంటే ఇదే! ఇప్పుడు చంద్రబాబు అరెస్టు విషయానికి వద్దాం. నెల రోజులు దాటినా చంద్రబాబు రాజమండ్రి జైల్లోనే ఉండిపోవడం జగన్మోహన్‌ రెడ్డికి అంతులేని ఆనందాన్ని ఇస్తున్నట్టు ఉంది. ఈ మధ్య విజయవాడలో ఏర్పాటు చేసిన పార్టీ ప్రతినిధుల సభలో ఆయన హావభావాలను, వ్యాఖ్యలను గమనిస్తే ఆయనలోని ఆనందం కనిపిస్తోంది. తాను లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు ఎత్తారు అని వెటకారాన్ని పండించారు. ఈ మాటలు అంటున్నప్పుడు ‘నేను సాధించాను’ అన్న విజయగర్వం ఆయనలో కనిపించింది.

లండన్‌ మాత్రమే కాదు, సరిహద్దులు దాటి వెళ్లాలంటేనే న్యాయస్థానం అనుమతి పొందాల్సిన జగన్‌రెడ్డిని చూస్తే గురువింద సామెత కూడా పనికి రాదు. పేదలకు ముష్టి పడేసి వారు పేదలుగానే ఉండే మోడల్‌ను అమలు చేస్తున్న జగన్మోహన్‌ రెడ్డిని పేదల ప్రతినిధి అని చెప్పుకొంటే దెయ్యాలు వేదాలు వల్లించిన సామెతే గుర్తుకొస్తుంది. ఇక జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై కూడా జగన్‌ వెటకారంగా మాట్లాడుతున్నారు. పెళ్లిళ్లు అనేవి పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. ‘అర గంట, గంట చాలు’ అని మాట్లాడే వారిని మంత్రులను చేసిన జగన్‌కు జనసేనాని వ్యక్తిగత జీవితంపై మాట్లాడే అర్హత ఉందా? పవన్‌ కల్యాణ్‌ భార్యలను లోకల్‌, నేషనల్‌, ఇంటర్నేషనల్‌ అని ఎకసెక్కంగా మాట్లాడిన జగన్‌రెడ్డి తమ కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారు లేరని చెప్పగలరా? పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ఎదురుగా ఉన్న వాళ్లు చప్పట్లు కొట్టవచ్చు గానీ ఆత్మస్తుతి, పరనిందకు పాల్పడే వారికి ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు గుణపాఠం చెబుతారు. ఆ రోజు కోసం వేచి చూద్దాం!

ఆర్కే

Updated Date - 2023-10-15T09:03:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising