Education: 71 వేల సీట్లు మిగిలిపోయాయి!
ABN, First Publish Date - 2023-06-15T14:20:42+05:30
ప్రచార ఆర్భాటం తప్ప పేదల చదువు పట్ల వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు. విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో
90 వేల సీట్లు ఉంటే.. 18,749 మందికే అడ్మిషన్లు..
సర్కారు నిర్లక్ష్యంతో పేదలకు విద్యాహక్కు దూరం
ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఘోరంగా విఫలం
రాజకీయ మైలేజీకి మాత్రం భారీగా ప్రకటనలు
పేద పిల్లల చదువులపై కనిపించని ప్రచారం
పైగా పేదలే తీసుకోలేదంటూ ప్రభుత్వం వాదన
రాష్ట్రంలో నీరుగారుతున్న విద్యాహక్కు చట్టం లక్ష్యం
అమరావతి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ప్రచార ఆర్భాటం తప్ప పేదల చదువు పట్ల వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు. విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు దక్కాల్సిన 90వేల సీట్లలో ఏకంగా 71 వేలు మిగిలిపోవడమే దీనికి నిలువెత్తు నిదర్శనం. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం పేద విద్యార్థులకు దక్కాల్సిన సీట్లు కోల్పోయేలా చేసింది. విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతికి 90వేల సీట్లు అందుబాటులో ఉండగా 18,749 మందికి మాత్రమే సీట్లు లభించాయి. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక లాంటి పథకాలతో రాజకీయ మైలేజీ వస్తుందని పత్రికల్లో భారీ ప్రకటనలిచ్చి ప్రచారం చేసుకున్న ప్రభుత్వం.. పేదల చదువుల విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఆర్టీఈపై విస్తృత ప్రచారం కల్పించాలని చట్టమే చెబుతున్నా జగన్ ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెట్టింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో ఆర్టీఈ అమలుచేస్తున్నారు. గతేడాది పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో 3 శాతం సీట్లే నిండాయి. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈసారి ముందుగానే కసరత్తు ప్రారంభించినా దీనిపై ప్రభుత్వం సరైన ప్రచారం చేయలేదు. తల్లిదండ్రులే ఎవరికివారు తెలుసుకోవాలన్నట్టుగా వ్యవహరించింది. దీనిపై అధికారులు, విద్యాశాఖ మంత్రి ఒక్కసారి కూడా ప్రెస్మీట్ నిర్వహించలేదు. అమ్మఒడి, విద్యాదీవెన తరహాలో పెద్ద ప్రకటనలూ ఇవ్వలేదు. దీనిపై ప్రచారం చేయాలని కొందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరినా పాఠశాల విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఉద్దేశపూర్వకంగానే దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని వారు భావించారు. తీరా రెండు విడతల్లో మూడు సార్లు లాటరీ నిర్వహించినా 20వేల మంది కూడా అడ్మిషన్లు తీసుకోలేదు. అయితే... పేదలు ఆర్టీఈపై ఆసక్తి చూపట్లేదని, ఆ సీట్లు వద్దనుకుంటున్నారని ప్రభుత్వం వింత ప్రచారం ప్రారంభించింది.
ఇస్తానంటే వద్దంటారా..?
ప్రభుత్వం సర్కారీ బడులను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దామని చెబుతున్నా ప్రజల్లో ప్రైవేటు విద్యకే ఎక్కువ ఆసక్తి ఉంది. ఆర్థిక స్తోమత లేకపోతే తప్ప వీలైనంతవరకు ప్రజలు ప్రైవేటుకు మొగ్గుచూపుతున్నారు. ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వ స్కూళ్లు కొంత మెరుగ్గా ఉన్నా ప్రాథమిక పాఠశాలలు అధ్వాన్నంగా ఉన్నాయి. కొవిడ్ సమయంలో అనూహ్యంగా ప్రభుత్వ బడులకు 6లక్షల మంది పిల్లలు వలస రాగా కరోనా తగ్గిన వెంటనే వెళ్లిపోయారు. ఇలా ప్రైవేటు విద్య కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తుంటే వారికి ఆసక్తి లేకే సీట్లు నిండలేదని ప్రభుత్వం చెబుతోంది. మరీ ముఖ్యంగా ప్రాథమిక స్థాయి వరకు కచ్చితంగా ప్రైవేటు పాఠశాలలకే పంపాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యా హక్కు చట్టం వారికి వరంలా అందివచ్చింది. కానీ దాని గురించి చాలా మందికి తెలియకపోవడం, అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో దరఖాస్తులే రాలేదు. మరోవైపు ఆర్టీఈకి అమ్మఒడిని ముడిపెట్టడం కూడా దెబ్బతీసింది. ఆర్టీఈ కింద ప్రైవేటు బడుల్లో సీట్లు పొందే విద్యార్థుల ఫీజులను అమ్మఒడి పథకం కింద కట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆర్టీఈ సీట్లకు పట్టణాల్లో రూ.8 వేలు, గ్రామాల్లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100గా నిర్ణయించారు. ఇంత తక్కువ ఫీజులతో ఎలా చేర్చుకోవాలని ప్రైవేటు పాఠశాలలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా సీట్లు భారీగా మిగిలిపోయాయి.
45,372 దరఖాస్తులే..
ఆర్టీఈకి ఈ ఏడాది దరఖాస్తులు సగమే వచ్చాయి. 90వేల సీట్లు అందుబాటులో ఉంటే.. 45,372 మందే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 27,648 మంది ఆప్షన్లు ఎంపిక చేసుకోగా, 26,279 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 18,749 మందికి సీట్లు దక్కాయి. వీరిలోనూ ఎంతమంది చేరుతారో చూడాలి. మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసుకునే అవకాశం ప్రైవేటు యాజమాన్యాలకు లభిస్తుంది. కాగా ఈ ఫీజులు సరిపోవంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
Updated Date - 2023-06-15T14:20:42+05:30 IST