Botsa: ఏపీ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం.. వెల్లడించిన బొత్స
ABN, First Publish Date - 2023-05-17T14:10:17+05:30
విద్యార్థులను మరింత ప్రోత్సహించాలనే ఈ కార్యక్రమం చేపట్టాం.’’ అని మంత్రి బొత్స తెలిపారు.
విజయవాడ: వైసీపీ ప్రభుత్వం (YCP Government) విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పిల్లలకు మంచి భవిష్యత్తు కోసమే సీఎం జగన్ విద్యా రంగాన్ని ప్రోత్సహించారు. పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణించేలా శిక్షణ ఇచ్చాం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడానికి ఆసక్తి చూపుతున్నారు. డిజిటల్ విధానంలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందిస్తున్నాం. ఉపాధ్యాయులు కూడా మార్పులకు అనుగుణంగా కోచింగ్ ఇప్పిస్తున్నాం. పది.. ఇంటర్ ఫలితాల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివి తొలి మూడు స్థానాలు సాధించిన వారికి సన్మానం చేస్తాం. ఈనెల 23న నియోజకవర్గం కేంద్రంలో సమావేశం పెట్టి అవార్డు అందచేస్తాం. విద్యార్థులకు పతకం, మెరిట్ సర్టిఫికేట్, ఉపాధ్యాయులకు జ్ఞాపిక, తల్లిదండ్రులను శాలువాతో సన్మానం. ఈనెల 27న జిల్లా స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమక్షంలో మూడు స్థానాలు సాధించిన విద్యార్థులను సత్కరిస్తాం. పతకం, మెరిట్ సర్టిఫికేట్, జ్ఞాపిక, సన్మానంతో పాటు మొదటి మూడు స్థానాల్లో ఉన్న వారికి యాభై వేలు, ముఫ్పై వేలు, పది వేలు నగదు ఇస్తాం. ఇక 31న రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన పది, ఇంటర్ విద్యార్థులను సన్మానం చేస్తాం. వీరికి పతకం, మెరిట్ సర్టిఫికేట్, జ్ఞాపిక, సన్మానంతో పాటు వరుసగా ముగ్గురికి లక్ష, 75 వేలు, 50 వేలు నగదు అందచేస్తాం. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను కూడా వేదిక పైనే సత్కరిస్తాం. ఈ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం తరపున ఉత్తర్వులు ఇస్తాం. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే 2830 మంది విద్యార్థులను సత్కరిస్తాం. మూడు స్థానాల్లో ఒకే మార్కు ఉన్న వారు ఎక్కువ మంది ఉన్నా వారినీ సత్కరిస్తాం. విద్యాశాఖలో ఉన్న అన్ని విభాగాలను పరిగణనలోకి తీసుకుంటాం. ప్రతిభ ఉన్న విద్యార్థులను మరింత ప్రోత్సహించాలనే ఈ కార్యక్రమం చేపట్టాం.’’ అని మంత్రి బొత్స తెలిపారు.
Updated Date - 2023-05-17T14:10:17+05:30 IST