ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Education: ఆణిముత్యాలతో ‘ఇంటర్‌’ నిధులు ఖాళీ! బుక్స్‌కి డబ్బులు లేక..!

ABN, First Publish Date - 2023-06-28T11:51:48+05:30

జగనన్న ఆణిముత్యాలు’ అంటూ ఊదరగొట్టిన వైసీపీ ప్రభుత్వం... చివరికి ఆ పథకానికి కావాల్సిన నిధులను ఇంటర్‌ విద్యామండలి నుంచి లాగేసింది. టెన్త్‌, ఇంటర్‌లో టాపర్లకు ఆణిముత్యాలు పథకం కింద ఈ నెల 20న నగదు బహుమతులు పంపిణీ చేశారు. దీనికోసం ఇంటర్‌ బోర్డు డబ్బులు వాడేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆణిముత్యాలకు మళ్లించిన వైసీపీ సర్కారు

వాటితోనే టెన్త్‌లో టాపర్లకు నగదు బహుమతులు

పిల్లల డబ్బులు వారికే పంచిపెట్టి సొంత ప్రచారం

సీఎం సభలు, ఏపీ భవన్‌ సంబరాలకూ బోర్డు నిధులే

ఉన్నత విద్యా కమిషన్‌ భవనం మరమ్మతులకూ ఇవే

విద్యార్థులకు ఉచిత పుస్తకాలివ్వలేమన్న ఇంటర్‌ బోర్డు

మార్కెట్‌లోనూ అందుబాటులో లేకపోవడంతో తిప్పలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘జగనన్న ఆణిముత్యాలు’ అంటూ ఊదరగొట్టిన వైసీపీ ప్రభుత్వం... చివరికి ఆ పథకానికి కావాల్సిన నిధులను ఇంటర్‌ విద్యామండలి నుంచి లాగేసింది. టెన్త్‌, ఇంటర్‌లో టాపర్లకు ఆణిముత్యాలు పథకం కింద ఈ నెల 20న నగదు బహుమతులు పంపిణీ చేశారు. దీనికోసం ఇంటర్‌ బోర్డు డబ్బులు వాడేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆణిముత్యాలు కార్యక్రమంలో 22,710 మందికి నగదు ఇవ్వగా వారిలో ఎక్కువమంది పదో తరగతి విద్యార్థులే ఉన్నారు. ఇందుకోసం చేసిన మొత్తం ఖర్చులో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. టాపర్లకు నగదు బహుమతులు, మెడళ్లు, సర్టిఫికెట్లతో పాటు చివరికి సీఎం హాజరైన సభ ఖర్చులకు కూడా ఇంటర్‌ బోర్డు నిధులే వాడేశారు. ఇందులో ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఆణిముత్యాలకు ఇచ్చిన డబ్బులన్నీ పిల్లలవేనని తేలిపోయింది. ఓవైపు ఈ పథకానికి బోర్డు నిధులు రూ.15కోట్లు వినియోగించగా... రూ.16కోట్లు వెచ్చించి ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీల్లోని విద్యార్థులకు ఉచిత పుస్తకాలు మాత్రం ఇవ్వలేమని బోర్డు తేల్చేసింది. ఇప్పటికే నాడు- నేడు, సీఎం సభలు, తాజాగా ఆణిముత్యాలకు నిధులు మళ్లించడంతో బోర్డు ఒట్టిపోయే పరిస్థితికి వచ్చింది. దీంతో పిల్లలంతా పుస్తకాలు బయటే కొనుక్కోవాలని చేతులెత్తేసింది.

కొందామన్నా పుస్తకాల్లేవ్‌

కొవిడ్‌కు ముందు వరకు ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు ఇచ్చేవారు. కొంతకాలం ఈ భారం బోర్డు భరిస్తే, కొన్నేళ్లు టీటీడీ పుస్తక ప్రసాదం నుంచి తీసుకున్నారు. కానీ కొన్నేళ్లుగా ఈ పథకం కింద టీటీడీ నిధులు ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్రంలోని 472 ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్‌ విద్యార్థులు పుస్తకాలను సొంతంగా కొనుకుంటున్నారు. ఈ ఏడాది కూడా పుస్తకాలు ఎవరికి వారు కొనుక్కోవాలని, తెలుగు అకాడమీ వీటిని ముద్రిస్తోందని తాజాగా ఇంటర్‌ బోర్డు సూచించింది. అయితే అకాడమీ చాలా తక్కువ సంఖ్యలో పుస్తకాలను ముద్రించడంతో మార్కెట్‌లో ఎక్కడా ఇంటర్‌ బుక్స్‌ లభించడం లేదు. ఈ విషయంలో తమకేం సంబంధం లేదని, ఇది పూర్తిగా తెలుగు అకాడమీ బాధ్యత అని ఇంటర్‌ విద్యాశాఖ చెబుతోంది. నిధుల కొరతతో తెలుగు అకాడమీ సరిపడా పుస్తకాలు ముద్రించలేకపోతుండటంతో వాటిని ఎక్కడ కొనుక్కోవాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకైనా ఇంటర్‌ బోర్డు ఆధ్వర్యంలో ముద్రించి ఉచితంగా ఇచ్చి ఉంటే ఈ సమయానికే పుస్తకాలు అందేవి. ఇందుకు సుమారు రూ.16కోట్లు ఖర్చయ్యేది. కానీ ఉన్న నిధులను ఆణిముత్యాలకు ఇచ్చిన బోర్డు... విద్యార్థులకు పుస్తకాల పంపిణీకి నీళ్లొదిలింది.

బోర్డును భ్రష్ఠు పట్టించారు

కాలేజీల అఫిలియేషన్ల పునరుద్ధరణ, పిల్లల పరీక్ష ఫీజులతో ఇంటర్‌ బోర్డుకు నిధులు సమకూరుతాయి. ఏటా రూ.70కోట్లు బోర్డుకు వస్తే పరీక్షల నిర్వహణకు చాలావరకు ఖర్చు చేస్తారు. మిగిలిన నిధులను అకడమిక్‌ విషయాలకు వాడతారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇంటర్‌ బోర్డును భ్రష్ఠు పట్టించారు. తొలుత ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ ఏపీ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌లో రూ.190కోట్లు జమ చేయించారు. ఆ తర్వాత అందులో నుంచి రూ.145 కోట్లు ఇంటర్‌ కాలేజీల్లో నాడు- నేడు పనులకు వాడేశారు. వాస్తవానికి ఈ పథకం అమలుకు ప్రభుత్వమే నిధులివ్వాలి. బోర్డు నిధులు వినియోగించకూడదు. కానీ నాడు-నేడుతో రాజకీయ మైలేజీకి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం... పథకానికి నిధులు మాత్రం ఇవ్వలేదు.

ఖజానా ఖాళీ

గత విద్యా సంవత్సరంలో 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేసింది. సీఎం హాజరైన ఈ సభ బాపట్ల జిల్లాలో జరిగింది. సభకు ఒక్కరోజు ముందు కుర్చీలు, టెంట్లకు నిధుల్లేవని, కొరత ఉందని అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద ఇంటర్‌ బోర్డులో రూ.25లక్షలు డ్రా చేసి, షామియానా ఖర్చులకు వాడింది. ఇంతవరకూ ఆ డబ్బులు తిరిగి బోర్డుకు ఇవ్వలేదు. గతేడాది ఢిల్లీలో ఏపీ భవన్‌ సంబరాల కోసం ఇంటర్‌ బోర్డు రూ.10లక్షలు ఇచ్చింది. తాడేపల్లిలోని ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌లో ఓ అధికారికి రూ.38 లక్షలతో కారు కొనుగోలు చేశారు. కమిషన్‌లో నిధులు లేవంటూ ఇంటర్‌ బోర్డు నుంచి మళ్లించారు. అలాగే కమిషన్‌లో ఓ ఫ్లోర్‌ మరమ్మతులకు, ఇంటీరియర్‌కు కొంత మొత్తం వినియోగించారు. ఇలా సంబంధం లేని అంశాలకు నిధులు మళ్లించడంతో బోర్డు దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది.

Updated Date - 2023-06-28T11:51:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising