Teachers: అసంబద్ధ నిర్ణయాలతో గురువులు సతమతం!
ABN, First Publish Date - 2023-01-30T11:40:11+05:30
ఒకప్పుడు టీచర్ (Teachers) ఉద్యోగాలంటే బోధన తప్ప ఇతర విధులు పెద్దగా ఉండేవి కావు. నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం (Ycp government) వచ్చాక ఉపాధ్యాయులు సమస్యలతో
పని ఒత్తిడితో ఉపాధ్యాయులు సతమతం
వైసీపీ సర్కారు అసంబద్ధ నిర్ణయాలు
వ్యతిరేకత వచ్చినా బడుల విలీనం
భారీగా పెరిగిన ఏకోపాధ్యాయ పాఠశాలలు
టీచర్లకు ముఖ హాజరు.. సర్దుబాటు
బాత్‌రూమ్ ఫొటోల నుంచి దక్కని విముక్తి
మధ్యలోనే నిలిచిపోయిన బదిలీలు
పదోన్నతుల కోసం ఎదురుచూపులు
మొక్కుబడిగా మంత్రి సమావేశాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు టీచర్ (Teachers) ఉద్యోగాలంటే బోధన తప్ప ఇతర విధులు పెద్దగా ఉండేవి కావు. నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం (Ycp government) వచ్చాక ఉపాధ్యాయులు సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసంబద్ధ నిర్ణయాల వల్ల వారికి పనిభారం పెంచిందనే విమర్శలున్నాయి. ఒకదాని తర్వాత మరొక సమస్య అన్నట్టుగా వారిపై ఒత్తిడి పెంచుతూ పాత సమస్యలు మరిచిపోయేలా చేస్తోంది. చివరికి ఏ సమస్యకు పరిష్కారం కోరాలనే స్పష్టత కూడా లేకుండా ముప్పతిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తోంది. కొద్దికాలంగా ఉపాధ్యాయ సంఘాలు నిస్సహాయంగా మారాయి. పేరుకు చర్చలంటూ వెళ్తున్నా ఒక్కటీ పరిష్కారమయ్యే పరిస్థితి లేదు. దీంతో ఎందుకు వెళ్తున్నామో తమకే అర్థం కావట్లేదనే ధోరణికి వచ్చాయి. మంత్రి ఇచ్చిన హామీలు కూడా అమలు కావడం లేదని, తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని వాపోతున్నాయి.
మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana)ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహిస్తున్న సమావేశాలు మొక్కుబడి తంతుగా మారాయి. సమస్యలు పరిష్కరించకపోగా, టీచర్ల అక్రమ బదిలీలను సమర్థించేలా మాట్లాడారు. ‘‘సిఫారసు బదిలీలు చేస్తే తప్పేంటి? 14 వేలు చేస్తున్నామా? 14 వందలు చేస్తున్నామా? 140 బదిలీలు చేస్తే భూతద్దంలో పెట్టి చూస్తారా? ప్రజాప్రతినిధులు అడిగితే ఆ మాత్రం చేయకూడదా?’’ ఇటీవల ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం అనంతరం వారి సమక్షంలోనే మీడియాతో బొత్స అన్న మాటలివి. ఓ మంత్రి బహిరంగంగా ఇలాంటి ప్రకటన చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
విలీనంతో కొత్త కష్టాలు
ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తరగతుల విలీన వివాదానికి జగన్ ప్రభుత్వం (jagan government) తెరతీసింది. అది కూడా సెలవుల్లో కాకుండా బడులు తెరిచాక చేపట్టింది. 4 వేలకు పైగా పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల చిన్న పిల్లల్ని అటూ ఇటూ బడులు మారుస్తూ నానా కష్టాలకు గురిచేసింది. విలీనంపై ఇచ్చిన జీవో 117 ప్రకారం టీచర్లనూ సర్దుబాటు చేసింది. 20 కంటే తక్కువమంది పిల్లలున్న ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క టీచర్‌ను మాత్రమే ఉంచి, అదనంగా ఉన్న ఎస్జీటీలను ఉన్నత పాఠశాలలకు పంపించింది. అప్పటి నుంచీ పని అక్కడ, జీతం ఇక్కడ అనే పంథాలో వారు కొనసాగుతున్నారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు సీనియర్ ఎస్జీటీలను సర్దుబాటు పేరుతో ఉన్నత పాఠశాలలకు పంపుతున్నారు. దీంతో ఇప్పటి వరకూ అక్కడ పనిచేసిన ఎస్జీటీలు మళ్లీ సొంత పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక 3, 4, 5 తరగతులను విలీనం చేస్తే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అందుకు సరిపడా గదులు, సదుపాయాలు ఉన్నాయా? అన్న విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కొన్నిచోట్ల గదులు లేక ఇప్పటికీ వరండాలు, చెట్ల కిందే తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యా సంవత్సరం పూర్తవుతున్న సమయంలో ఇప్పుడు అదనపు గదుల నిర్మాణం చేపట్టారు. వచ్చే ఏడాదికి తరగతి గదులు అందుబాటులోకి వస్తాయి. ఇంతకాలం టీచర్లు నానా పాట్లు పడుతూనే పిల్లలకు పాఠాలు చెప్పారు.
మంత్రి హామీ ఇచ్చినా...
రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండవని ఉపాధ్యాయ సంఘాలకు మంత్రి బొత్స పలుమార్లు హామీ ఇచ్చారు. అయితే ఆయన హామీ ఇచ్చిన తర్వాత సింగిల్ టీచర్ బడులు పెరిగాయి. గతంలో టీచర్ల కొరతతో సుమారు 7 వేల సింగిల్ టీచర్ బడులు ఉండేవి. ఈ విద్యా సంవత్సరంలో అమలు చేసిన జీవో 117 ప్రకారం 21 మంది పిల్లలుంటే రెండో టీచర్ ఉండాలి. కానీ విలీనం తర్వాత 1, 2 తరగతుల్లో 20 మంది కంటే తక్కువ మంది పిల్లలున్న పాఠశాలలు భారీగా పెరిగాయి. ఇప్పుడు అవన్నీ ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. వాటిలో పనిచేసే టీచర్ విధిగా బడికి రావాల్సిన పరిస్థితి. విద్యా కానుక కిట్లు తెచ్చుకోవడం, ప్రశ్నపత్రాల తెచ్చుకోవడం ఇలా ప్రతిదీ ఆ టీచరే చూసుకోవాలి. పరీక్షల సమయంలో ప్రతిరోజూ ఎంఈవో ఆఫీసుకు వెళ్లి పత్రాలు తీసుకువచ్చి పరీక్షలు పెడుతున్నారు.
పదోన్నతుల్లో మాయ
తరగతుల విలీనంతో 33 వేల మంది టీచర్లకు పదోన్నతులు దక్కుతాయని పాఠశాల విద్య అధికారులు విద్యా సంవత్సరం ప్రారంభంలో తెలిపారు. ఇప్పుడు పని సర్దుబాటు అంటూ వింత ప్రక్రియ చేపట్టారు. పదోన్నతి రాకుండానే కేవలం రూ.2500 అలవెన్స్ తీసుకుని ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో పనిచేయాలి. అసలు ఇవి పదోన్నతులో, సర్దుబాటో కూడా పాఠశాల విద్యా శాఖ స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు వేసవి సెలవుల్లో చేపట్టాల్సిన బదిలీలను విద్యా సంవత్సరం మధ్యలో ప్రారంభించారు. దానిపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో బదిలీలు, పదోన్నతులు ఏవీ లేకుండా పోయాయి.
సర్దుకుపోవాల్సిందేనా...
ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీఆర్‌సీ నుంచి డీఏల వరకూ ప్రతిదాంట్లోనూ సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీచర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘పీఎఫ్ నుంచి సుమారు రూ.8లక్షల రుణం కోసం పది నెలల కిందట దరఖాస్తు చేసుకున్నాను. ఇంతవరకూ ఎలాంటి స్పందనా లేదు. నా పీఎఫ్ డబ్బులు నేను తీసుకోవడానికి ఇంకెన్ని నెలలు ఎదురుచూడాలి?’ అని ఓ టీచరు ఆవేదన వ్యక్తంచేశారు. బొత్స విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలుమార్లు సమావేశాలు పెట్టారు. అయితే టీచర్లు అడిగిన డిమాండ్లు పరిష్కరించిన దాఖలాలు లేవు. చిన్నపాటి సమస్యల పరిష్కారానికి హామీలిస్తూ సమావేశాలు ముగిస్తున్నారు. ఇక తాజా గా పని సర్దుబాటుపై నిర్వహించిన సమావేశంలో ఫలితం ఏంటనేది సంఘాల నేతలకు అంతుపట్టలేదు.
ఎన్నెన్నో బాధ్యతలు
డీఎస్సీ (dsc) అనే మాట లేకుండా ఉన్న టీచర్లతోనే బడులు నెట్టుకురావాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకోవడంతో టీచర్లపై విపరీతమైన పనిభారం పెరిగింది.
వారానికి ఏకంగా 40కి పైగా పీరియడ్లు బోధించాలని తొలుత ఉత్తర్వుల్లో పేర్కొంది. టీచర్ల ఆందోళనతో 36కు తగ్గించింది. ఈ లెక్కన ప్రతి టీచరు రోజుకు ఆరు పీరియడ్లు బోధించాలి. ఇతర టీచర్లు సెలవులో ఉంటే ఆ తరగతులను కూడా చూసుకోవాలి.
పాఠ్య ప్రణాళికలు రాయడం, పరీక్షా పత్రాలు దిద్దడం వంటి బాధ్యతలు ఉంటాయి. ఒకరోజు ఆలస్యం చేసినా చర్యలు తీసుకుంటారు.
సర్కారు కొత్తగా బైజూ్‌సను బలవంతంగా రుద్దుతోంది. సాధారణ తరగతులతో పాటు బైజూస్ ట్యాబ్‌లలో సందేహాలను నివృత్తి చేయడంతో పాటు పరీక్షలు నిర్వహించాలి.
ప్రపంచ బ్యాంకుతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా పరీక్షల విధానం మార్చేసింది. ఫార్మేటివ్ అసె్‌సమెంట్ పరీక్షలకు ప్రశ్నపత్రాలను వాట్సా్‌పలో పంపుతోంది. టీచర్లు బోర్డుపై ప్రశ్నపత్రాలు రాసి పరీక్షలు నిర్వహించాలి.
బోధనతో పాటు ఇతర బాధ్యతలూ నిర్వహించాలి. భోజనం, యూనిఫాం, బాత్‌రూమ్‌ల ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు సంబంధిత యాప్‌లలో అప్‌లోడ్ చేయాలి. ఓ పాఠశాలలో బాత్‌రూమ్‌ల శుభ్రతకు సంబంధించి రోజుకు 15 ఫొటోలు తీస్తున్నట్టు ఓ టీచర్ తెలిపారు.
మధ్యాహ్నం పెట్టే అన్నం, కూర, గుడ్డు, చిక్కీ.. ప్రతి వంటకం ఫొటో వేర్వేరుగా తీయాలి. అన్నీ కలిపి ఒక ఫొటో తీయాలి. గుడ్లు, చిక్కీలు పాఠశాలకు వచ్చినప్పుడు ఫొటోలు తీసుకోవాలి.
విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యా కానుక కింద ఇచ్చే పుస్తకాలు, యూనిఫాంలు, షూల ఫొటోలు తీసుకోవాలి. నాడు-నేడు జరిగే పాఠశాలల్లో వాటి పనుల ఫొటోలు రోజూ తీయాలి.
Updated Date - 2023-01-30T11:40:12+05:30 IST