కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Dsc: తెలుగు పాఠ్యపుస్తకాల్లోని కవుల గురించి..!

ABN, First Publish Date - 2023-09-18T11:09:46+05:30

డాక్టర్‌ టి.వి.నారాయణ హైదరాబాద్‌ జిల్లాకు చెందినవాడు. 1925 జూలై 26న జన్మించిన ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖాధికారిగా, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా సేవలందించాడు

Telangana Dsc: తెలుగు పాఠ్యపుస్తకాల్లోని కవుల గురించి..!

  • డీఎస్సీ /టీఆర్‌టీ ప్రత్యేకం నాలుగో భాగం

డా.టి.వి.నారాయణ

డాక్టర్‌ టి.వి.నారాయణ హైదరాబాద్‌ జిల్లాకు చెందినవాడు. 1925 జూలై 26న జన్మించిన ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖాధికారిగా, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా సేవలందించాడు. జీవనవేదం, ఆర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, త్మదర్శనం(కవితాసంపుటి), అమరవాక్సుధాస్రవంతి(ఉపనిషత్తులపై వ్యాససంపుటి) మొదలైనవి ఈయన రచనలు.

ఉత్పల సత్యనారాయణా చార్య

1928-2007 మధ్య కాలానికి చెందిన ఈ కవి ఖమ్మం జిల్లా చింతకాని ప్రాంతంవాడు. ఉత్పలమాల శతకం, రసధ్వని, ఈ జంటనగరాలు హేమంతశిశిరాలు, గజేంద్రమోక్షం, భ్రమరగీతం, శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైన పుస్తకాలు రాశాడు.

డా.ముకురాల రామారెడ్డి

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించిన ఈయన 1920-2003 మధ్య కాలానికి చెందినవాడు. సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు రాశాడు. ఈయన మేఘదూత(అనువాద కవిత్వం), దేవరకొండ దుర్గం, నవ్వేకత్తులు(దీర్ఘకవిత), హదయశైలి(గేయ సంపుటి), రాక్షసజాతర(దీర్ఘకవిత), ఉపరిశోధన(పరిశోధన పత్రాల సంకలనం), తెలుగు సాహిత్య నిఘంటువు మొదలైన రచనలు చేశాడు. ‘ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావపరిణామం’ అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించి డాక్టరేట్‌ పొందాడు. సామాజికస్పృహ, సమస్యల పట్ల స్పందించేగుణం కలిగి, సాహిత్య, సాంస్కృతిక రంగాలతోపాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న కవి డా.ముకురాల రామారెడ్డి. ఇతని ‘విడిజోడు’ కథకు కృష్ణాపత్రిక వాళ్లు ద్వితీయ బహుమతిని ఇవ్వగా, ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు.

గౌరీభట్ల రఘురామ శాస్త్రి

ఈయన సిద్దిపేట జిల్లా రిమ్మనగూడలో జన్మించాడు. 1929-2004 మధ్య కాలానికి చెందిన ఈ కవి వ్యాసతాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణ దాసచరిత్రం, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శత పద్యమాలిక, శివపద మణిమాల, భావానందస్వామి చరిత్ర మొదలైన రచనలతోపాటు అనేక భజన కీర్తనలు రాశాడు.

డా.వేముగంటి నరసింహాచార్యులు

సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో రామక్క, రంగాచార్యులనే దంపతులకు జన్మించాడు. 1930-2005 మధ్య కాలానికి చెందిన ఈయన ‘సాహితీ వికాస మండలి’ సంస్థను, మెదక్‌ జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించి, సాహిత్య వికాసానికి కృషి చేశాడు. తిక్కన, రామదాసు అనే పద్యకావ్యాలను, మంజీర నాదాలు అనే గేయకావ్యాన్ని , వివేక విజయం అనే కావ్య ఖండికతో పాటు 40 పుస్తకాలు రాశాడు. వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వీటిలోని తెలంగాణ భాష ఇంపు, సొంపు పాఠకులను పరవశింపజేస్తాయి. కవికోకిల, కావ్యకళానిధి, విద్వత్కని ఆయన బిరుదులు. తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

సింగిరెడ్డి నారాయణరెడ్డి

డా.సి.నారాయణరెడ్డి(1931-2017) రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట గ్రామంలో జన్మించాడు. నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ప్రపంచ పదులు మొదలైన 90కిపైగా కావ్యాలు రచించారు. విశ్వంభర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ్‌ అందుకున్నారు. ‘ఆధునికాంధ్ర కవిత్వము- సంప్రదాయములు-ప్రయోగములు’ అనే వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఎందరో పరిశోధకులకు మార్గదర్శకం. సినిమా పాటలకు సాహితీ గుబాళింపులను అద్దిన రసహృదయుడు సినారె. శబ్దయుక్తి, అర్థయుక్తి ఈయన కలానికి, గళానికీ ఉన్న ప్రత్యేకత. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, అంబేద్కర్‌ సార్వత్రిక, తెలుగు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా, రాజ్యసభ సభ్యులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షులుగా పని చేశారు. భారత ప్రభుత్వం ఈయనను పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.

డా.అందె వేంకటరాజం

జగిత్యాల జిల్లా కోరుట్లలో జన్మించిన ఈయన 1933-2006 మధ్య కాలానికి చెందినవాడు. నవోదయం, మణిమంజూష, కళాతపస్విని అనే పద్యకావ్యాలు, భారతరాణి నాటికల సంపుటి, నింబగిరిశతకం, ఈశ్వరశతకాలు రాశాడు. ‘వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన’ అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు. ‘కవి శిరోమణి’, ‘అవధాన యువకేసరి’, ‘అవధాన చతురాసన’ అనే బిరుదులు పొందాడు.

గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ

1934-2011 మధ్య కాలానికి చెందిన ఈ కవి సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట గ్రామంలో జన్మించాడు. మూడు వందలకుపైగా అష్టావధానాలు చేసి ‘అవధాని శశాంక’, ‘అశుకవితాకేసరి’ అన్న బిరుదులు పొందాడు. హిందోళ రాగంలో ఈయన పద్యపఠన విన్యాసం ప్రత్యేకమైనది. విశ్వనాథేశ్వర శతకం, కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరీ స్తుతి, ఆద్యమాతృక, పద్యోద్యానము మొదలైనవి ఈయన రచనలు.

నంబి శ్రీధరరావు

నిజామాబాద్‌ జిల్లా భీమ్‌ గల్‌(మేముగల్లు) నివాసి అయిన ఈ కవి 1934-2000 మధ్య కాలానికి చెందినవాడు. శ్రీ లొంకరామేశ్వర శతకం, శ్రీమన్నింబాచల మహాత్మ్యము, శ్రీమన్నింబగిరి నరసింహ శతకం ఈయన రచనలు. ‘కవిరాజు’ బిరుదును పొందాడు.

ఇమ్మడిజెట్టి చంద్రయ్య

నాగర్‌కర్నూల్‌ జిల్లా తాళ్లపల్లి గ్రామంలో జన్మించిన ఈయన 1934-2001 మధ్య కాలానికి చెందినవాడు. హనుమద్రామ సంగ్రామం, భక్తసిరియాళ, వీరబ్రహ్మేంద్ర విలాసం అనే హరికథలను, రామప్రభు, మృత్యుంజయ, పాలెం వేంకటేశ్వర, చంద్రమౌళీశ్వర శతకాలను, శ్రీశిరీష నగ గండికా మహత్మ్యం, కర్పరాద్రి మహత్మ్యం అనే కావ్యాలు రాశాడు.

ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు

నల్గగొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో జన్మించిన ఈయన 1936-2011 మధ్య కాలానికి చెందిన కవి. ‘వేంకటేశ్వరా!’ అనే మకుటంతో శ్రీవేంకటేశ్వర శతకం రాశాడు. గోదాదేవి, యాదగిరి లక్ష్మీనరసింహ శతకం, గోదావరి, సత్యవతీ సాంత్వనం, మారుతి మొదలైన రచనలు చేశాడు. ఈయన ‘విద్వత్‌ కవి’గా ప్రసిద్ధి పొందాడు.

-స్తంభంకాడి గంగాధర్‌

తెలుగు ఉపాధ్యాయులు

Updated Date - 2023-09-18T11:09:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising