Group-1 Mains: 1969 తెలంగాణ ఉద్యమం గురించి..
ABN, First Publish Date - 2023-01-31T14:44:08+05:30
తెలంగాణ రాష్ట్ర సాధన సుదీర్ఘ ఉద్యమం. ఇది ఉజ్వలమైన వీరోచిత పోరాటం, త్యాగాలకు చిరునామా 1969 తెలంగాణ ఉద్యమం. అకడమిక్ కోణంలో పరిశీలిస్తే....
తెలంగాణ రాష్ట్ర సాధన సుదీర్ఘ ఉద్యమం. ఇది ఉజ్వలమైన వీరోచిత పోరాటం, త్యాగాలకు చిరునామా 1969 తెలంగాణ ఉద్యమం. అకడమిక్ కోణంలో పరిశీలిస్తే.... అది రక్షణల ఉద్యమంగా గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో కీలకమైన హామీలు, ఆంధ్ర అసెంబ్లీ తీర్మానాలు (
Andhra Assembly), పెద్దమనుషుల ఒప్పందాలు, పార్లమెంట్ రక్షణలను పూర్తిగా ఉల్లంఘించారు. ఈ సంఘటనలు తెలంగాణ ప్రజానీకాన్ని, ప్రధానంగా విద్యార్థి, యువకులను ఉద్యమం వైపు నడిపించాయి.
గ్రూప్-1, గ్రూప్-2 ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు 1969 తెలంగాణ ఉద్యమంపై పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. ఈ ఉద్యమ వైఫల్యాలు, విజయాలు నేపథ్యంలోనే తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవాలి.
1969 ఉద్యమానికి ప్రాథమిక కారణాలు
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీలు, రక్షణలను పూర్తిగా విస్మరించారు.
1968 జూలై 10న తెలంగాణ ఉద్యోగులు రక్షణ దినాన్ని పాటించారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన సదస్సులు, ఉరేగింపులు తెలంగాణ ప్రజానీకంలో రక్షణల కోసం ప్రశ్నించే భూమికను ఏర్పాటు చేశాయి.
1968 డిసెంబరు 6న హైదరాబాద్‌లోని వివేక వర్ధిని కళాశాల నుంచి తెలంగాణ రక్షణల కోసం బయలుదేరిన విద్యార్థుల ర్యాలీపై సమైక్యవాదులు చేసిన దాడి, తెలంగాణ విద్యార్థి లోకంలో ఆందోళనలు కలిగించి, ప్రతీకార దృక్పథాన్ని పెంచింది.
1968కి ముందే పాల్వంచ- కొత్తగూడెం కేంద్రంగా కె.టి.పి.ఎస్‌లో స్థానికులకే ఉద్యోగాలు అనే నినాదం క్రమంగా ప్రజలను, ప్రధానంగా యువతను సంఘటితం చేసింది.
కొలిశెట్టి రాందాసు నాయకత్వంలో ఇల్లందు కేంద్రంగా ‘తెలంగాణ ప్రాంతీయ సమితి ఏర్పడింది’. ఈ సమితి ‘కె.టి.పి.ఎస్ ఉద్యోగాలు స్థానికులతో నింపాలి‘ అనే నినాదంతో విస్తృత ప్రజాభిప్రాయాన్ని కూడగట్టింది. ఉద్యమానికి భూమికను నిర్మించింది.
పాల్వంచ - కొత్తగూడెం కేంద్రంగా ఉద్యమం
ఉద్యమానికి కేంద్ర బిందువు పాల్వంచ - కొత్తగూడెం ప్రాంతాలు. ఖమ్మం జిల్లా కేంద్రంగా రవీంద్రనాథ్ అనే విద్యార్థి నాయకుడి ఆమరణ దీక్ష ఉద్యమానికి ఊపిరి అయింది. పాల్వంచ కేం ద్రంగా, ఎన్.టి.పి.సికి చెందిన కె.టి.పి.ఎస్ 1968 నాటికి వినియోగంలోకి వచ్చింది. కె.టి.పి. ఎస్‌లో తెలంగాణ రక్షణలకు వ్యతిరేకంగా ఉద్యోగ నియామకాలు జరిగాయి. ఆంధ్ర ప్రాంతం వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. దీనికి నిరసనగా విద్యార్థి నాయకుడు రవీంద్రనాథ్ జనవరి 8న ఖమ్మం పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నిరాహారదీక్షను ఆరంభించారు. ఈయనకు మద్దతుగా అనురాధ అనే తొమ్మిదో తరగతి విద్యార్థిని, ఖమ్మం మున్సిపల్ డిప్యూటీ చైర్మన్ కవిరాజమూర్తి దీక్షలో కూర్చున్నారు. వీరితో పాటు పోటు కిృష్ణమూర్తి అనే కార్మిక నాయకుడు జనవరి 10న పాల్వంచలో నిరాహారదీక్షలో కూర్చున్నారు.
దీక్ష ప్రధాన డిమాండ్లు: కె.టి.పి.ఎస్‌లో స్థానికులకే ఉద్యోగాలను ఇవ్వాలి. తెలంగాణ రక్షణలను అన్నింటిని అమలు చేయాలి. పోచంపాడు నిర్మాణానికి నిధులను వెంటనే విడుదల చేయాలి. రవీంద్రనాథ్ దీక్షతో ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రైళ్లు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీక్ష వార్తలు రాయని పత్రికలను దగ్ధం చేశారు.
ఉద్యమానికి పరోక్ష కారణాలు
పాలక వర్గాలు హైదరాబాద్ నగరంపై మాత్రమే కేంద్రీకరణ చేయడం వల్ల తెలంగాణలోని మిగతా జిల్లాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఆదివాసులు కలరా సమస్యతో, మహబూబ్‌నగర్ జిల్లా నిత్య కరువుతో, నల్లగొండ జిల్లా ఫ్లోరోసి్‌సతో, మెదక్ జిల్లా కాలుష్యంతో, వరంగల్ జిల్లా పత్తిరైతుల ఆత్మహత్యలతో, కరీంనగర్ జిల్లా చేనేత కార్మికుల ఆత్మహత్యలతో సతమతమయ్యాయి.
వ్యవసాయ రంగం: 1968 హైదరాబాద్ కౌలుదారి వ్యవసాయ భూముల చట్టంలోని 47-50 సెక్షన్స్ వల్ల ఆంధ్రా వలసలు కొనసాగాయి. ఫలితంగా వాణిజ్య పంటలను మాత్రమే ప్రోత్సహించారు. ఆహార పంటలను నిర్లక్ష్యం చేశారు. గోదావరి లోయ సారవంతమైన భూములు, గిరిజన భూములు అన్యాక్రాంతమయ్యాయి.
పారిశ్రామిక రంగం: ఆంధ్ర ప్రాంత వ్యవసాయ మిగులు, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పారిశ్రామిక రంగానికి దారి తీసింది. అయితే ఆంధ్ర వారు పారిశ్రామికవేత్తలు. కాగా, తెలంగాణ వారికి కనీసం ఈ పరిశ్రమల్లో పనిచేసే అవకాశం లభించలేదు. దీనివల్ల తెలంగాణకు అదనంగా ఒనగూరింది ఏమీ లేదు.
సేవా రంగం: పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలన్నీ ఆంధ్ర ప్రాంతీయులకు మాత్రమే ప్రయోజనాలు చేకూర్చాయి.
ఒకవైపు ఒప్పందాల ఉల్లంఘన, మరోవైపు వివిధ రంగాల్లో దోపిడీ తెలంగాణ ప్రజల్లో అసహనాన్ని రేకెత్తించింది. ఈ అసహనమే 1969 రక్షణ ఉద్యమానికి దారితీసింది.
హైకోర్టు తీర్పు
ముల్కీ రూల్స్ అమలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసులో వాదనలు విన్న జస్టిస్ కుప్పుస్వామి ఎన్.టి.పి.సి జాతీయ స్థాయి సంస్థ కాబట్టి అక్కడ ముల్కీ రూల్స్ వర్తించవు అని తీర్పునిచ్చారు. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ప్రజా ఆందోళన తీవ్రమైంది. జనవరి 18, 19 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆందోళనలు నిర్వహించారు.
అఖిలపక్ష సమావేశం
ప్రజా ఆందోళనకు భయపడి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని జనవరి 19న ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కింది తీర్మానాలు ఆమోదించారు. అవి...
గైర్ ముల్కీలను వెనుకకు పంపించాలి
తెలంగాణ ప్రాంతం వారితో వాటిని భర్తీ చేయాలి. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 28లోగా పూర్తి కావాలి. మార్చి చివరి నాటికి ఈ సమస్యను పరిష్కరించాలి.
ముల్కీ రూల్స్‌ను కార్పొరేషన్‌లో కూడా అమలు చేయాలి. విద్యార్థులు వెంటనే సమ్మెను విరమించాలి.
జీవో 36 విడుదల: అఖిలపక్ష నిర్ణయాలను అమలు చేయడం కోసం 1969 జనవరి 21న జీవో 36ను విడుదల చేశారు. ఈ జీవోను అనుసరించి ఫిబ్రవరి 28న గైర్ ముల్కీలను వెనుకకు పంపాలి. ఈ జీవో రాకతో ఆందోళనకారుల్లో ఒక వర్గం తెలంగాణ ఉద్యమాన్ని ఆపివేసింది. మరొక వర్గం మాత్రం కొనసాగించింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రంగా ఉద్యమం
1969 జనవరిలో విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పడింది. అయితే ఈ విద్యార్థి సంఘం రెండు ప్రధాన గ్రూపులుగా ఉండేవి.
afeguardist నాయకుడు వెంకటరాంరెడ్డి
Separatists నాయకుడు మల్లిఖార్జున్
ఓయూ కేంద్రంగా ఈ విద్యార్థి సంఘాలు ఆందోళనను కొనసాగించాయి
తెలంగాణ పరిరక్షణ కమిటీ
జనవరి 12న హైదరాబాద్‌లోని ప్రముఖులు ...కాటం లక్ష్మీనారాయణ అధ్యక్షన మహదేవ్‌సింగ్(సోషలిస్ట్ పార్టీ నాయకుడు), సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ(మజ్లిస్ నాయకుడు), వి.వి.పద్మనాభ(ఫ్లాష్ పత్రిక) కలిసి ఈ కమిటీ ఏర్పాటు చేశారు. విద్యార్థి ఉద్యమంలో గోపాల్, పులి వీరన్న, శ్రీధర్‌రెడ్డి, పుల్లారెడ్డి, మధుసూదన్, డాక్టర్ కొల్లూరి చిరంజీవి, ఆరిఫోద్దీన్ మొదలైన వారు కీలక పాత్ర పొషించారు.
జనవరి 24న మెదక్ జిల్లా సదాశివపేటలో భీమన్‌పల్లి శంకర్ అనే యువకుడు పోలీస్ కాల్పుల్లో మరణించాడు. ఇతని మరణం తెలంగాణ ప్రజలను కలిచివేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. అందుకే ఇతన్ని 1969 ఉద్యమంలో తొలి అమరుడిగా గుర్తిస్తారు.
ఈ నేపథ్యంలోనే జనవరి 27న నల్లగొండ పట్టణంలో రంగాచార్యులు అనే ఆంధ్ర ఉద్యోగస్తుడిని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి హత్య చేశారు. దీంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జీవో 36ను వెనుకకు తీసుకోవాలని/రద్దు చేయాలనే ఆందోళన తీవ్రమైంది.
1969 జనవరి 31లో ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్ర ఉద్యోగులను భర్తలుగా కలిగిన ముగ్గురు తెలంగాణ మహిళ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
హైకోర్టు జడ్జి జస్టిస్ చిన్నపురెడ్డి 1969 ఫిబ్రవరి 3న తీర్పునిస్తూ ఈ జీవోను కొట్టివేశారు. హైకోర్టు తీర్పును ధృవీకరిస్తూ ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే జస్టిస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆవుల సాంబశివరావు సుప్రీంకోర్టు తీర్పు జీవో 36పైనే కాని ముల్కీ నిబంధనలపై కాదని వ్యాఖ్యానించారు.
మారిన ఈ పరిస్థితుల్లో తెలంగాణ వాదులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. 1969 ఫిబ్రవరి 25న నివాస అర్హత చట్టాన్ని మరో ఐదేళ్లు పొడిగించారు.
ఉద్యమంలో అన్ని వర్గాల పాత్ర
ఉద్యోగులు - కార్మికుల పాత్ర: తెలంగాణ ఉద్యమానికి చెందిన అన్ని దశల్లోనూ ఉద్యోగుల పాత్ర అద్వితీయమైనది.
1968 జూలై 10న ఉద్యోగులు, ‘కోర్కెల దినం’ పాటించారు. ఈ స్ఫూర్తి వారిలో ఉద్యమ చైతన్యాన్ని పెంచింది.
కె.ఆర్.ఆమోస్ నాయకత్వంలో వీరు ఉద్యమంలో పాల్గొన్నారు. 1969 మే 24న ఆమో్‌సను బర్తరఫ్ చేశారు. 27న పీడీ యాక్ట్ నమోదు చేశారు.
ఎన్టీవో సంఘాల ఆధ్వర్యంలో 1969 జూన్ 10 నుంచి 36 రోజులు సుదీర్ఘ సమ్మె కొనసాగింది(ఇదే సకల జనుల సమ్మెకు ప్రేరణ) .
బాలకిృష్ణారెడ్డి, రామసుధాకర్‌రాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గ్రామాల్లో యాత్ర చేపట్టారు. వరంగల్‌లో ఆజంజాహీ మిల్, సింగరేణి, హైదరాబాద్‌లోని ఐడీపీఎల్ , హెచ్‌ఎంటీ సంస్థల కార్మికులు ఈ ఉద్యమంలో క్రియా శీల పాత్రను పొషించారు.
మేధావుల పాత్ర: 1969 మే 20న ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో వర్సిటీ క్యాంప్‌సలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ మౌజం అలీ అధ్యక్షత వహించగా, ప్రొఫెసర్ శ్రీధర్ స్వామి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సెమినార్‌లోనే ప్రొఫెసర్ జయశంకర్ తొలిసారిగా నాగార్జున సాగర్ నీటి పంపకంపై తన పరిశోధన ప్రతిని సమర్పించారు. ఈ సెమినార్‌లోని పరిశోధన పత్రాలతో విడుదలైన గ్రంథం 'Telangana Movement An Investigative Focus' . ఇది తెలంగాణ ఉద్యమంపై విడుదలైన తొలి గ్రంథం.
తెలంగాణ రచయితల సంఘం
1969 జూన్ 6న కాళోజీ నారాయణరావు అధ్యక్షతన ఈ సంఘం ఏర్పడింది. తెలంగాణ జిల్లాలోని కవులందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చిన తొలి ప్రయత్నం.
తెలంగాణ విమోచన సమితి
ఈ సమితి 1969 జనవరి 28న ఏర్పడింది. దీనికి అధ్యక్షుడిగా ఆరేళ్లి బుచ్చయ్య గౌడ్ వ్యవహరించాడు. హయగ్రీవాచారి, ముచ్చర్ల సత్యనారాయణ దీనిలో ముఖ్యులు.
తెలంగాణ పరిరక్షణ సమితి
1969 జనవరి 12న కాటం లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఏర్పడింది హైదరాబాద్ కామ్రేడ్స్ అసోసియేషన్ ఈ సంస్థ డాక్టర్ రాజ్‌బహదూర్ గౌర్ ఆధ్వర్యంలో కొనసాగింది.
విద్యార్థుల పాత్ర
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్రకు ప్రత్యేకత ఉంది. 1952లో వరంగల్ విద్యార్థులు ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1969లో విద్యార్థి నాయకుడు రవీంద్రనాథ్ తన నిరాహార దీక్ష ద్వారా ఉద్యమాన్ని విస్తరింపజేశారు.
ఉస్మానియా యూనివర్సిటీలో లెఫ్ట్, రైట్, సెంట్రిస్ట్ విద్యార్థి సంఘాలన్నీ ఉద్యమంలో పాల్గొన్నాయి. అయితే కొద్ది మంది విద్యార్థులు కేవలం రక్షణల అమలును మాత్రమే కోరుకోగా... మరికొద్ది మంది రక్షణలతో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు. అమరవీరుల్లో ఎక్కువమంది విద్యార్థులు 17-19 సంవత్సరాల వయసు వారే.
మహిళల పాత్ర
తెలంగాణ రక్షణల ఉద్యమంలో మహిళల పాత్ర ప్రముఖమైంది. మే నెలలో ఉద్యమకారులను ఒక పథకం ప్రకారం ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా మహిళలు ఉద్యమానికి నాయకత్వం వహించారు. వీరిలో...
సదా లక్ష్మీ(ఎమ్మెల్యే): టిజిపిఎస్‌కి అధ్యక్షురాలిగా వ్యవహరించారు.
కుముదిని నాయక్: హైదరాబాద్ నగరానికి తొలి మహిళా మేయర్ తెలంగాణ ఉద్యమకారిణి
ఈశ్వరీభాయి(ఎమ్మెల్యే): తెలంగాణ ఉద్యమంలో తన ఉపన్యాసం ద్వారా ప్రజలను ఉత్తేజ పరిచారు. రిపబ్లిక్ పార్టీ నాయకురాలు.
లక్ష్మీబాయమ్మ(ఎంపీ): నిజాం వ్యతిరేక పోరాటం, 1969 ఉద్యమంలో పాల్గొని అనేక సందర్భాల్లో జైలు జీవితం గడిపారు. ఈమెను తెలంగాణ లక్ష్మీబాయమ్మ పేరుతో పిలుస్తారు.
శాంతాబాయి(ఎమ్మెల్యే): తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీల పాత్ర పోషించారు.
-డాక్టర్ రియాజ్
సీనియర్ ఫ్యాకల్టీ, అకడమిక్ డైరెక్టర్,
5 మంత్ర కెరీర్ పాయింట్, హైదరాబాద్
Updated Date - 2023-02-01T11:28:29+05:30 IST