Tspsc Job Special: ఈ అంశాలపైనే అధిక ప్రశ్నలు
ABN, First Publish Date - 2023-01-24T17:30:15+05:30
పోటీ పరీక్షల ప్రశ్నపత్రం తయారీలో క్రమంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సమాచార సేకరణకు కాకుండా విశ్లేషణ, సంశ్లేషణ సామర్థ్యాలకు ప్రాముఖ్యం
తెలంగాణ ప్రాంతీయ కమిటీ పనితీరు ఒప్పందాల ఉల్లంఘన
తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం
పోటీ పరీక్షల ప్రశ్నపత్రం తయారీలో క్రమంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సమాచార సేకరణకు కాకుండా విశ్లేషణ, సంశ్లేషణ సామర్థ్యాలకు ప్రాముఖ్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు సిలబస్‌లోని ప్రతి అంశానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతీ విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలగాలి. సమగ్రంగా విశ్లేషణ చేయగలగాలి.
టీఎస్‌పీఎస్సీ (tspsc) నిర్వహిస్తున్న ప్రతీ పరీక్షలో తెలంగాణ (Telangana)అంశాలకు అధిక మార్కులు కేటాయిస్తున్నారు. ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉద్యమ ప్రక్రియ, ఫలితాలను విస్తృత పరిధిలో అర్థం చేసుకుని విశ్లేషణ చేయగలగాలి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)రాష్ట్ర ఆవిర్భావం ఒప్పందాల ఫలితంగా జరిగిందనే వాస్తవాన్ని అభ్యర్థులు గ్రహించగలగాలి. తెలంగాణ రక్షణల కోసం ప్రాంతీయ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలనేది ముఖ్య ఒప్పందం. అయితే కౌన్సిల్ స్థానంలో, ప్రాంతీయ కమిటీకి మాత్రమే పార్లమెంట్ (Parliament) అవకాశాన్ని ఇచ్చింది. వాస్తవానికి ఇది తెలంగాణ ప్రజల ఆసక్తులకు, అభివృద్ధికి ఉపయోగపడే ఏర్పాటు కాదు. కౌన్సిల్ ఏర్పడి ఉంటే, తెలంగాణ ప్రజలకు స్వీయ నిర్ణయాధికారం లభించేది. కమిటీ ఏర్పాటుతో పరిపాలనలో సలహాలు, సూచనలకు మాత్రమే పరిమితి ఏర్పడింది.
ప్రాంతీయ కమిటీ అధికారాలు, పరిమితులు, ఏర్పడిన ప్రక్రియ, దాని పనితీరుపై అభ్యర్థులకు సమగ్రమైన సమాచారం అవసరం. ఈ సమాచారం ఆధారంగా విశ్లేషణ సామర్థ్యాలను అభ్యర్థులు పెంపొందించుకోగలుగుతారు. ప్రాంతీయ కమిటీ అధ్యక్షులు, ఉపాఽధ్యక్షులు, సభ్యులు తెలంగాణ ప్రాంతానికి తమ అధికార పరిధిలో సేవ చేసే ప్రయత్నం చేశారు.
తెలంగాణ ప్రాంతీయ కమిటీ
పెద్ద మనుషుల ఒప్పందాన్ని అనుసరించి ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి. కాని భారత పార్లమెంట్ ప్రాంతీయ కమిటీని మాత్రమే ఏర్పాటు చేసింది.(కౌన్సిల్ లేదా మండలికి స్వయం నిర్ణయాధికారం ఉంటుంది. కమిటీకి సలహాలు ఇచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది)
ప్రాంతీయ మండలి విధులు
వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలు ప్రాంతీయ కమిటీ అనుమతితోనే జరగాలి.
స్థానిక వనరులన్నీ స్థానికులకే చెందేట్లుగా ప్రాంతీయ కమిటీ పర్యవేక్షిస్తుంది.
తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పథకాలను ప్రాంతీయ కమిటీ అనుమతితో రూపొందించాలి. దీనికి అవసరమైన బిల్లు ప్రాంతీయ కమిటీ ఆమోదం పొందాలి.
ద్రవ్య బిల్లుపై ప్రాంతీయ కమిటీకి అధికారం ఉండదు.
విద్యారంగ రక్షణల కోసం చర్యలు చేపట్టే స్వేచ్ఛ ఈ కమిటీకి ఉంటుంది.
మద్యపానం నిషేధంపై నిర్ణయం తీసుకునే అధికారం ఈ కమిటీకి ఉంటుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిపై ప్రతి ఆరు నెలలకోసారి ప్రాంతీయ కమిటీకి నివేదికను అందజేయాలి.
తెలంగాణ ప్రాంతంలో సహకార సంఘాలను, పరిశ్రమలను నిర్వహించే అవకాశం ప్రాంతీయ కమిటీకి ఉంది.
చట్టబద్ద సంస్థగా ప్రాంతీయ కమిటీ గుర్తింపు పొందుతుంది.
ఇది తీసుకునే నిర్ణయాలకు చట్టబద్దత ఉంటుంది.
ప్రాంతీయ కమిటీ ఏర్పాటు
పార్లమెంట్ ఆమోదించిన ప్రాంతీయ కమిటీ రెండు సంవత్సరాలు ఆలస్యంగా 1958 ఫిబ్రవరిలో ఏర్పాటైంది. ఈ కమిటీకి చైర్మన్‌లుగా వ్యవహరించిన వారు...
1. అచ్యుతరెడ్డి: 1958 - 1962
2. హయగ్రీవాచారి - 1962 - 1967
3. జె.చొక్కారావు: 1967 - 1972
4. కోదాటి రాజమల్లు: 1972(కొన్ని నెలలు) వ్యవహించారు.
ప్రాంతీయ కమిటీ కృషి
తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాంతీయ కమిటీ కృషి చేసింది. అదేసమయంలో ఆంధ్ర పాలకులపై తిరుగుబాటు కూడా ప్రకటించింది. 1960లో అచ్యుతరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగ లేఖ రాశాడు. ఈ లేఖకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 1961లో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దామోదరం సంజీవయ్య అనంతరం ముఖ్యమంత్రి అయిన కాసుబ్రహ్మానంద రెడ్డి ప్రాంతీయ కమిటీని అత్యంత నిర్లక్ష్యం చేశాడు. 1972లో ‘జై ఆంధ్ర’ ఉద్యమ ఫలితంగా ఆరు సూత్రాల పథకం ప్రారంభించారు. దీని ద్వారా ప్రాంతీయ కమిటీ రద్దు అయ్యింది.
రాజకీయ ప్రాతినిధ్యం తెలంగాణకు దక్కలేదు. 58 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వారు ఐదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 1962 వరకు కొనసాగాల్సిన హైదరాబాద్ కమిటీ 1956లోనే రద్దు అయ్యింది.
రాష్ట్రం పేరు నిర్ణయించడంలోనే తొలి ఉల్లంఘన జరిగింది. వాస్తవానికి హైదరాబాద్ రాష్ట్రం అనే పేరుతో లేదా తెలంగాణ - ఆంధ్ర అనే పేరుతో ఉండాలి. కాని జాయింట్ సెలెక్షన్ కమిటీ ఏకపక్షంగా ఈ పేరును ఆంధ్రప్రదేశ్ అని నిర్ణయించింది.
ఒప్పందాల ఉల్లంఘనలు
రాష్ట్రం పేరు నిర్ణయించడంలోనే తొలి ఉల్లంఘన జరిగింది. వాస్తవానికి హైదరాబాద్ రాష్ట్రం అనే పేరుతో లేదా తెలంగాణ - ఆంధ్ర అనే పేరుతో ఉండాలి. కాని జాయింట్ సెలెక్షన్ కమిటీ ఏకపక్షంగా ఈ పేరును ఆంధ్రప్రదేశ్ అని నిర్ణయించింది.
నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆరో వేలుతో పోల్చారు. ఈ పదవిని తెలంగాణ వారికి ఇవ్వలేదు.
1919 ముల్కీ నిబంధనలను అనుసరించి స్థానికతకు 15 సంవత్సరాలు అర్హతగా గుర్తించారు. తరవాత కాలంలో దీనిని 12 ఏళ్లు, ఆ తరవాత ఏడేళ్లకు, చివరకు నాలుగేళ్లకు కుదించారు.
తెలంగాణ నిధులను ఆంధ్రప్రాంతానికి అక్రమంగా తరలించారు. 1961లో విడుదల చేసిన శ్వేతపత్రం, 1968లో గవర్నర్ ప్రసంగం, 1969లో లలిత్, భార్గవ కమిషన్ నివేదికలు ఈ విషయానికి సాక్ష్యాలు.
ప్రాంతీయ కమిటీని ఆలస్యంగా ఏర్పాటు చేసి తొందరగా రద్దు చేయడం వల్ల వ్యవసాయ భూముల అమ్మకం, కొనుగోళ్లు విచ్చల విడిగా కొనసాగాయి.
ప్రాంతీయ మండలి స్థానంలో ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ ప్రజలు స్వీయ నిర్ణయాధికారాన్ని కోల్పోయారు.
విద్యాపరమైన కేటాయింపుల్లో తెలంగాణ ప్రాంతం అపారంగా నష్టపోయింది.
రాజకీయ ప్రాతినిధ్యం తెలంగాణకు దక్కలేదు. 58 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వారు ఐదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 1962 వరకు కొనసాగాల్సిన హైదరాబాద్ కమిటీ 1956లోనే రద్దు అయ్యింది.
1962 చైనా యుద్ధ సమయంలో, 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినప్పుడు తెలంగాణ తాత్కాలిక ఉద్యోగులను మాత్రమే తొలగించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ఉద్యోగులను సీనియర్లుగా, తెలంగాణ వాళ్లను జూనియర్లుగా మార్చారు. దాంతో ప్రమోషన్ అవకాశాలు, జీతాల్లో పెరుగుదలను తెలంగాణ ఉద్యోగులు కోల్పోయారు.
తెలంగాణ ఉద్యోగుల జీతాలను తగ్గించి అన్యాయం చేశారు.
తెలంగాణ ప్రాజెక్టులైన దేవాపూర్(నిజామాబాద్), ఇచ్చంపల్లి(కరీంనగర్), కడెం(ఆదిలాబాద్), ఆర్‌డీఎ్‌స(మహబూబ్‌నగర్) మొదలైన వాటికి నిధులు కేటాయించలేదు. తెలంగాణ నిధులను ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలకు తరలించారు.
గోదావరి, కృష్ణా నీళ్ల కేటాయింపుల్లో తెలంగాణ వాటాపై బచావత్ ట్రిబ్యునల్ ఎదుట డిమాండ్ చేయలేదు.
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను రాజకీయ కేంద్ర బిందువులుగా మార్చారు. దీంతో తెలంగాణ నాయకులు ఆంధ్ర నాయకులకు అనుచరులుగా మిగిలారు.
టంగుటూరి ప్రకాశం అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించగా, బూర్గుల రామకృష్ణారావు అంత్యక్రియలను మాత్రం సాధారణంగా పూర్తిచేశారు.
వ్యవసాయ భూములు, ప్రాజెక్టులు, పరిసర ప్రాంతాలు స్థానికేతరుల హస్తగతమయ్యాయి. తమ సొంత భూములను ఆంధ్రలో రొయ్యల చెరువులకు కేటాయించి, తెలంగాణ భూములను ఆక్రమించుకున్నారు/తక్కువ ధరలకు కొన్నారు.
తెలంగాణ సంస్కృతిని చులకన భావంతో వ్యవహరించారు. స్థానికులతో మమేకం కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక వలస ప్రాంతంగా మార్చారు.
ఈ వైఖరి స్థానికుల్లో ఆవేశానికి కారణమైంది. 1968-69 నాటికి అది ఉద్యమ రూపాన్ని తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతరం ఆంధ్ర ప్రాంతం నుంచి వలసలు విపరీతంగా పెరిగాయి. ఈ వలసలు తెలంగాణలోని వివిధ రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
రాజధానిపై ప్రభావం: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై వలసల ప్రభావం తీవ్రంగా పడింది. ఈ వలసలు ట్రాఫిక్, పర్యావరణ, నీరు, గృహ, నిరుద్యోగ సమస్యలను ముందుకు తెచ్చాయి. అభివృద్ధి అంతా ఈ ప్రాంతంలోనే కేంద్రీకృతం కావడం వల్ల మిగతా తెలంగాణ జిల్లాలు నష్టపోయాయి.
రాజకీయ రంగం: ఈ రంగంలో ఆధిపత్యం అంతా ఆంధ్ర నాయకులదే అయ్యింది. దీంతో విధాన నిర్ణయాలు వారి చేతుల్లోకి వెళ్లాయి.
సంస్కృతిపై ప్రభావం: ఉమ్మడి రాష్ట్రంలో వ్యాపార దృక్పథం పెరిగింది. తరతరాల నుంచి వస్తున్న హైదరాబాద్ సంస్కృతిపై ఆంధ్ర ఆధిపత్యం తీవ్ర ప్రభావాన్ని చూపింది.
-డాక్టర్ రియాజ్
సీనియర్ ఫ్యాకల్టీ, అకడమిక్ డైరెక్టర్,
5 మంత్ర కెరీర్ పాయింట్, హైదరాబాద్
Updated Date - 2023-01-24T17:33:03+05:30 IST