ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Exam Special: తెలంగాణలో ప్రత్యేక రిజర్వేషన్‌ వ్యవస్థ జోనల్‌ సిస్టమ్‌

ABN, First Publish Date - 2023-02-21T16:06:02+05:30

పోటీ పరీక్షల కోసం ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు, ప్రధానంగా గ్రూప్‌-1 (Group-1) స్థాయి పరీక్ష కోసం అధ్యయనం చేస్తున్న వారు తెలంగాణ రాష్ట్రం (Telangana State) లో జోనల్‌ వ్యవస్థపై సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగి

గ్రూప్‌-1 మెయిన్స్‌ ప్రత్యేకం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రూప్‌-1 మెయిన్స్‌ ప్రత్యేకం

పోటీ పరీక్షల కోసం ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు, ప్రధానంగా గ్రూప్‌-1 (Group-1) స్థాయి పరీక్ష కోసం అధ్యయనం చేస్తున్న వారు తెలంగాణ రాష్ట్రం (Telangana State) లో జోనల్‌ వ్యవస్థపై సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటేనే ‘ఉద్యోగాల కోసం ఉద్యమం’గా గుర్తించాలి. ఉద్యోగుల ప్రక్రియకు సంబంధించిన వ్యవస్థ జోనల్‌ విధి విధానాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు జోనల్‌ వ్యవస్థ ఏర్పడిన విధానం, పనిచేసిన తీరు, పరిణామ క్రమంలో విశ్లేషించగలగాలి. అదేవిధంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో రూపొందిన జోనల్‌ విధానాన్ని అర్థం చేసుకుని, అప్పటి, ఇప్పటి వ్యవస్థలను తులనాత్మక కోణంలో పరిశీలన చేసుకోగలగాలి.

చారిత్రక నేపథ్యం

నిజాం పరిపాలన కాలంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో 1868లో విడుదలైన ఫర్మానా లేదా ప్రభుత్వ ఉత్తర్వు ‘ముల్కీ’ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది. ఈ ముల్కీల రక్షణ కోసమే అనేక ఉద్యమాలు, వాటి డిమాండ్లకు అనుగుణమైన ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1919లో ముల్కీ నిబంధనలను అలీ ఇమామ్‌ రూపొందించారు. అయితే తరవాతి కాలంలో ముల్కీ నిబంధనలు, ముల్కీల రక్షణకు అనేక సూత్రాలను ప్రతిపాదించారు. 1930లో నూతన ఉద్యోగ కల్పన విధానం స్థానికులకే ఉద్యోగాలు అనే నినాదాన్ని రక్షించే ప్రయత్నం చేసింది.

స్వాతంత్య్రం అనంతరం, ప్రధానంగా హైదరాబాద్‌ రాజ్యం భారత యూనియన్‌లో విలీనం అయిన తరవాత మిలిటరీ ప్రభుత్వ పాలనలో, పౌర ప్రభుత్వ పాలనలో అవసరమైన గుర్తింపును పొందలేకపోయింది. ఒప్పందాల ఫలితంగా 1956 నవంబరు 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ వాసుల ఉద్యోగ రక్షణలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఉద్భవించింది 1969 రక్షణల ఉద్యమం. అష్ట సూత్రాలు, పంచ సూత్రాలు ద్వారా ముల్కీల రక్షణ కోసం కొంతమేర హామీలను ప్రకటించారు.

1971, 1972 మధ్య వచ్చిన జై ఆంధ్ర ఉద్యమం ఆరు సూత్రాల పథకాన్ని ప్రకటించేలా చేసింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ తన పుస్తకం ‘తెలంగాణ రాష్ట్రం - ఒక డిమాండ్‌’లో ఈ ఆరు సూత్రాల పథకమే తెలంగాణ రక్షణలను శాశ్వత సమాధి చేసింది’ అని పేర్కొన్నారు.

ఆరు సూత్రాల పథకం అమలు తీరుపై తెలంగాణ ప్రజలు తమ నిరసనను, అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఉద్యోగులను ప్రాంతాల వారీగా, శాఖల క్రమానుగత శ్రేణుల వారీగా భర్తీ చేయడం కోసం జోనల్‌ వ్యవస్థను రూపొందించారు.

కాబట్టి అభ్యర్థులు... తెలంగాణ ప్రాంత ఉద్యోగ అవకాశాలను, నియామక అర్హతలను, ప్రక్రియలను అర్థం చేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర విధి విధానాలపై జ్ఞానాన్ని సముపార్జించుకోలేరు. జోనల్‌ వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాలను, అమలు విధానాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. అదేవిధంగా ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నూతన జోనల్‌ వ్యవస్థతో పాత వ్యవస్థను సరిపోల్చగలగాలి. ఈ అధ్యయనం 1975 రాష్ట్రపతి ఉత్తర్వులను అర్థం చేసుకుంటూ కొనసాగాలి.

రాష్ట్రపతి ఉత్తర్వులు-1975

భారత పార్లమెంట్‌ ముల్కీ రూల్స్‌ని రద్దు చేసింది. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్‌ ఆమోదం పొంది 371(1)కి డి, ఇ అనే సబ్‌ క్లాజ్‌ అంశాలను 7వ షెడ్యూల్‌ని మొదటి జాబితాలోగల 63వ అంశానికి సవరణ ద్వారా కేంద్రం జోడించింది. ఈ సవరణను రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా చట్టంగా మార్చారు. 1974 మే 3న ప్రెసిడెంట్‌ ఆమోదం పొందింది. 1975 అక్టోబరు 18న రాష్ట్రపతి ఉత్తర్వులు(ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌) జీవో పేరుతో సంపూర్ణంగా అమల్లోకి వచ్చింది.

371(డి) ముఖ్యాంశాలు

1. రాష్ట్ర అవసరాల దృష్ట్యా విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక నిబంధనలు, వెసులుబాటులు కల్పించే అవకాశం రాష్ట్రపతికి కల్పించారు.

2. లోకల్‌ క్యాడర్‌ను, స్థానికతను నిర్ధారించే అవకాశం రాష్ట్రపతికి ఇచ్చారు.

3. గతంలో జరిగిన నియామకాలకు చట్టబద్ధత కల్పించారు.

4. అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడింది.

5. ఈ క్లాజ్‌ను అనుసరించి విద్యావకాశాల విస్తరణ కోసం సెంట్రల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు అవకాశం లభించింది.

6. రాష్ట్రంలో ప్రాంతాలన్నీ ఉద్యోగ నియామకాల కోసం జోన్లుగా, ఉద్యోగాలన్నిటినీ లోకల్‌ - జోనల్‌- స్టేట్‌ క్యాడర్‌గా విభజించారు.(1975 అక్టోబరు 20న జీవో 674ను రూపొందించి ఆరు జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు.)

జోనల్‌ సిస్టమ్‌

1. కోస్టల్‌ ఆంధ్ర 2. కోస్టల్‌ ఆంధ్ర

3. కోస్టల్‌ ఆంధ్ర 4. రాయలసీమ

5. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం

6. నిజామాబాద్‌, మెదక్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ. (తరవాత రంగారెడ్డి జిల్లాని చేర్చారు)

371(డి) ఆర్టికల్‌ 14వ పేరాలో హైదరాబాద్‌లోని కొన్ని ప్రభుత్వ శాఖలను లోకల్‌ రిజర్వేషన్‌ నుంచి మినహాయించారు.

  • 14ఎ - సెక్రటేరియట్‌(సచివాలయం)

  • 14బి- శాఖాధిపతులు(51)

  • 14సి- రాష్ట్రస్థాయి కార్యాలయాలు(51)

  • 14డి- ప్రత్యేక కార్యాలయాలు స్పెషల్‌ ఆఫీసర్‌(28)

  • 14ఇ- భారీ అభివృద్ధి ప్రాజెక్టులు(33)

  • 14ఎఫ్‌- హైదరాబాద్‌ నగర పోలీసు చట్టం పేర్కొన్న కొన్ని పోలీస్‌ అధికారుల ఉద్యోగాలు(అయితే 1975 జనవరి 11 జీవో నెం.728 ప్రకారం పైవాటిలో సమాన వాటా ఉండాలి). ఈ ఆర్డర్‌లో కార్పొరేషన్‌లు, యూనివర్సిటీలు, ప్రభుత్వ గ్రాంట్‌ పొందే విద్యాలయాల అంశాలు ప్రస్తావించలేదు.

ఉద్యోగ క్యాడర్లు - రాష్ట్రం మొత్తం ఆరు జోన్లు

1. జిల్లా క్యాడర్‌/స్థానిక క్యాడర్‌

జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లా స్థాయి ఉద్యోగాలను మాత్రమే నియమించే విధానం. జిల్లా క్యాడర్‌లో 80 శాతం స్థానిక రిజర్వేషన్లు, మిగతా 20 శాతం ఓపెన్‌ కాంపిటీషన్‌. దీని ప్రకారం నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడి స్థానికత ఏర్పడుతుంది.(2000 సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం జీవో నెం. 106(ఇ)ద్వారా టీచర్‌ ఉద్యోగాలను ఈ కేటగిరీలో చేర్చింది. ఎమ్మార్వో, జేఈ, అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌, కొన్ని ఎన్జీవో ఉద్యోగాలు కూడా లోకల్‌ క్యాడర్‌లోనే గుర్తించారు.)

2. ఎన్జీవో- జోనల్‌ లెవల్‌

ఈ ఉద్యోగాలు ఎల్‌డీసీ పైస్థాయికి సంబంధించినవి. అంటే ప్రమోషన్‌కి అవకాశం ఉన్న ఎన్జీవో ఉద్యోగాలు, కొన్ని గెజిటెడ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు. వీటిలో స్థానికులకు 70 శాతం, ఓపెన్‌ కాంపిటీషన్‌ 30 శాతం రిజర్వేషన్లు ఉంటాయి.

3. జోనల్‌ లెవల్‌ గెజిటెడ్‌

దీనిలో లోకల్‌ 60 శాతం, ఓసీలకు 40 శాతంగా రిజర్వేషన్లు గుర్తించారు. అయితే చివరిది రాష్ట్ర క్యాడర్‌. దీనికి ఎటువంటి స్థానిక రిజర్వేషన్లు వర్తించవు. ఆరు సూత్రాలు ప్రకటించిన కాలంలో ఏపీలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదలైన కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ఉన్నారు. తెలంగాణ ప్రజలు 1969 ఉద్యమ వైఫల్యంతో స్తబ్ధతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో అనేక ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి.

రాష్ట్రపతి ఉత్తర్వుల వక్రీకరణ

ఓపెన్‌ కేటగిరీ నియామకాల్లో అక్రమాలు: ఓపెన్‌ కేటగిరీ విభాగాన్ని నాన్‌ లోకల్‌గా మార్చి సీమాంధ్రులతో వాటిని భర్తీ చేశారు.

అశాస్త్రీయ నియామక ప్రక్రియ: రిజర్వేషన్‌ విధానంలో ముందు ఓసీని భర్తీ చేయాలి. తరవాత రిజర్వేషన్‌ను భర్తీ చేయాలి. కాని దీన్ని తారుమారు చేశారు.

ఉద్యోగాల పెంపుదల(ఓపెన్‌ కాంపిటీషన్‌): ఓసీ ఉద్యోగాలను వివిధ మార్గాల్లో పెంచి, వాటిని నాన్‌ లోకల్‌గా మార్చారు. తెలంగాణ వారికి ఉద్యోగాలను దక్కకుండా చేశారు.

ఈక్వటబుల్‌ షేర్‌లకు తిలోదకాలు: జనాభా ప్రకారం మినహాయించిన విభాగాల్లో ప్రాతినిధ్యం ఉండాలి. ఈ అంశాన్ని 728 జీవో 1975 ధ్రువీకరిస్తుంది. కాని ఆచరణ దీనికి భిన్నంగా ఉంది. తెలంగాణ జనాభా 40 శాతంగా ఉన్నప్పటికీ ప్రాతినిధ్యం మాత్రం 15 శాతం మించలేదు. బోర్డులు, కార్పొరేషన్‌లలో పక్షపాతం: పాడి పరిశ్రమ బోర్డులో, ఇంటర్‌, ఎస్సెస్సీ బోర్డులలో, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ లాంటి కార్పొరేషన్లలో తెలంగాణ వారికి ప్రాతినిధ్యం దక్కలేదు.

డిప్యూటేషన్ల పేరుతో అక్రమాలు: హైదరాబాద్‌లోని అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో స్థానికేతరులు డిప్యూటేషన్ల పేరుతో అక్రమంగా ప్రవేశించారు. వీరి వల్ల తెలంగాణలో ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి.

బోగస్‌ సర్టిఫికెట్స్‌: ముల్కీ నిబంధనలోని స్థానికతను 15 నుంచి నాలుగేళ్ల వరకు తగ్గించడం వల్ల సులభంగా సర్టిఫికెట్లను పొందే అవకాశం కలిగింది. ఆదిలాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఈ అక్రమ నియామకాలు ఎక్కువగా జరిగాయి. పై వక్రీకరణ వల్ల తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు 1975 రాష్ట్రపతి ఉత్తర్వులు సంతోషాన్ని కలిగించలేకపోయాయి.

ఆరు సూత్రాల పథకం అమలు-రాజకీయ పరిణామాలు

1973 జనవరి 18 నుంచి డిసెంబరు 10 వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రపతి పాలనలో ఉంది. రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన అనంతరం జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు. 1975 జూన్‌ 25 నుంచి 1977 మార్చి వరకు జాతీయ ఎమర్జెన్సీని విధించారు. అలహాబాద్‌ కోర్టు ఇందిరాగాంధీ ఎన్నికకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం దీనికి కారణం. ఎమర్జెన్సీ అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఓడి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్‌ మెజార్టీ సీట్లను సాధించింది.

1978 అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన పాలనలోనే 1978లో రంగారెడ్డి జిల్లా, 1979లో విజయనగరం జిల్లా ఏర్పడ్డాయి. వారంలో ఐదు రోజుల పని విధానం అమలు చేశారు. 1980 మధ్యంతర లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ మెదక్‌ నుంచి ఎంపీగా గెలిచారు. 1980లో చెన్నారెడ్డి సీఎం పదవికి రాజీనామా చేశారు.

తెలంగాణ జోన్స్‌ 2021

గతంలో తెలంగాణలో 10 జిల్లాలు ఉండగా, రాష్ట్రం ఏర్పడి న తరవాత వీటి సంఖ్యను 31 చేశారు. ఆపై మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేశారు. తద్వారా మొత్తం 33 జిల్లాలో 7 జోన్లను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు జోగులాంబ జోన్‌లో నారాయణపేట జిల్లాను చేర్చారు. వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలిపారు. ప్రభుత్వ శాఖలకు, పోలీసు శాఖకు వేర్వేరు జోన్లు ఉన్నాయి. జిల్లా స్థాయి నుంచి మల్టీజోన్‌ వరకు 95ు ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తారు. ఓపెన్‌కోటా కింద ఐదుశాతం ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తారు.

ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ కాలం ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాలో వారు స్థానికులుగా లెక్కలోకి వస్తారు. కొత్త జోనల్‌ విఽధానానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో తెలంగాణ ప్రభుత్వం 33 జిల్లాలతో 7 జోన్లను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్‌-1 కింద కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి ఉండగా, మల్టీ జోన్‌-2 కింద యాదాద్రి, చార్మినార్‌, జోగులాంబ జోన్లు ఉన్నాయి.

జోన్‌-1(కాళేశ్వరం): ఆసిఫాబాద్‌- కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌- భూపాలపల్లి, ములుగు

జోన్‌-2(బాసర): ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల

జోన్‌-3(రాజన్న సిరిసిల్ల): కరీంనగర్‌, సిరిసిల్ల- రాజన్న, సిద్ధిపేట, మెదక్‌, కామారెడ్డి

జోన్‌-4(భద్రాద్రి)కొత్తగూడెం: భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌

జోన్‌-5(యాదాద్రి): సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి-యాదాద్రి, జనగాం

జోన్‌-6(చార్మినార్‌): మేడ్చల్‌-మల్కాజిగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌

జోన్‌-7(జోగులాంబ): మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగులాంబ-గద్వాల్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌

జిల్లా కేడర్‌ పోస్టులు: ఆఫీస్‌ సబార్డినేట్‌, శానిటరీ వర్కర్‌, స్వీపర్‌, వాచ్‌మెన్‌, ఫోర్‌మెన్‌, కార్పెంటర్‌, మేస్త్రీ, గార్డెనర్‌, మిలిమాలన్‌, చౌకీదార్‌, ప్రింటింగ్‌ టెక్నీషియన్‌, కానిస్టేబుల్‌, టైపిస్ట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ స్టెనో, డ్రైవర్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, రెనో ఆపరేటర్‌, జుమేదార్‌, చైన్‌మన్‌, డఫేదార్‌, కుక్‌, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి, గ్రేడ్‌-4 తదితర పోస్టులు

జోనల్‌ కేడర్‌ పోస్టులు: హెడ్‌ కానిస్టేబుల్‌, ఏఎ్‌్‌సఐ, ఎస్‌ఐ, అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌, సీనియర్‌ డ్రైవర్‌, నాయబ్‌ తహశీల్దార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ఎంఆర్‌ఐ, ఏఆర్‌ఐ, సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే, నాన్‌టెక్నికల్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-1, 2, 3, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2, తదితర పోస్టులు

మల్టీ జోనల్‌ కేడర్‌ పోస్టులు: డిప్యూటీ కలెక్టర్‌, ఆర్డీవో, అసిస్టెంట్‌ సెక్రటరీ, సూపరింటెండెంట్‌, తహసీల్దార్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే, డిప్యూటీ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, సీఐ, డీఎస్పీ, కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1, 2, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్‌ పంచాయతీ ఆఫీసర్‌, ఎంపీడీవో, మండల పంచాయతీ అధికారి, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-1, డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2, 3 తదితర పోస్టులు. అన్ని శాఖల పరిధిలో జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ కింద పరిగణించకుండా మిగిలిపోయిన పోస్టులన్నీ రాష్ట్రస్థాయి పోస్టులుగా పరిగణించాల్సి ఉంటుంది.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తన పుస్తకం ‘తెలంగాణ రాష్ట్రం - ఒక డిమాండ్‌’లో ఆరు సూత్రాల పథకం తెలంగాణ రక్షణలను శాశ్వత సమాధి చేసింది’ అని పేర్కొన్నారు.

జిల్లాలతో 7 యూనిట్లు...

పలు ప్రభుత్వ శాఖల్లో కొన్ని జిల్లాలను 7 యూనిట్లుగా విభజించారు.

1. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు; 2.ఆదిలాబాద్‌

2. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల

3. కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్‌, కామారెడ్డి

4. కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌

5. సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగామ

6. మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌

7. మహబూబ్‌నగర్‌, గద్వాల, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట

-డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ డైరెక్టర్‌,

5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌

Updated Date - 2023-02-21T16:10:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising