TSPSC effect: జేఎన్‌టీయూ సిబ్బందిని వెంటాడుతున్న ఎగ్జామ్స్ టెన్షన్! ఆ విధులు వద్దంటూ వేడుకోలు!
ABN, First Publish Date - 2023-03-27T12:36:19+05:30
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC paper leak) వ్యవహారం ప్రభావం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU)
ఔట్‌సోర్సింగ్ సిబ్బందిపై టీఎస్‌పీఎస్సీ ఎఫెక్ట్..
కీలక సెక్షన్లలో విధులు వద్దంటున్న వైనం
హైదరాబాద్ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC paper leak) వ్యవహారం ప్రభావం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU) ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలపై పడింది. కీలకమైన పలు ప్రవేశ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను జేఎన్‌టీయూ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎక్కువ మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే సిట్ విచారణను ఎదుర్కొంటుండడంతో.. జేఎన్‌టీయూలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సంకటంలో పడ్డారు. కొన్ని కీలకమైన సెక్షన్లలో తమను విధుల నుంచి తప్పించాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. అయితే యూనివర్సిటీలో తగినంత మంది రెగ్యులర్ సిబ్బంది లేకపోవడంతో కొన్ని విభాగాల్లో తప్పనిసరిగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలనే వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా సెట్‌లు, సెక్షన్లలో పనిచేస్తున్న సిబ్బంది భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే తెలంగాణ ఎంసెట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్షల బాధ్యతలను ప్రభుత్వం జేఎన్‌టీయూకు అప్పగించింది. అయితే, టీఎ్‌సపీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ ఎఫెక్ట్‌తో ఆయా పరీక్షల నిర్వహణలో పనిచేసేందుకు జేఎన్‌టీయూ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది విముఖత వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై కొందరు అధికారులు నిఘా పెంచడం, సేఫ్టీ కారణాలు చెప్పి పదే పదే సతాయిస్తుండడంతో సిబ్బంది అసహనానికి గురవుతున్నారు. కాన్ఫిడెన్షియల్ కాదని అధికారులు చెబుతున్నప్పటికీ.. ఎంసెట్, పీజీఈ సెట్, పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సంబంధించి సబ్జెక్టు నిపుణులు ఇచ్చిన ప్రశ్నలను ఔట్ సోర్సింగ్ సిబ్బందే టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ఆయా ప్రశ్నలను ఇంగ్లీష్, ఉర్దూ తదితర భాషల్లోకి అనువాదం చేయాలి. కొన్ని ప్రశ్నలకు సంబంధించిన బొమ్మలు, గ్రాఫ్‌లను కూడా గీసి కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. ప్రశ్నకు, ప్రశ్నకు మధ్య అలైన్‌మెంట్ సరిచూసుకోవడం కూడా ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేయాల్సిందే. అలాగే, నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి దరఖాస్తుల సంఖ్యకు తగినట్లు ఫీజులు వచ్చాయో లేదో చూడడం, లోకల్-నాన్‌లోకల్, రిజర్వేషన్ కేటగిరీల వారీగా అభ్యర్థుల వివరాలను పరిశీలించడం ఔట్ సోర్సింగ్ ఉద్యోగలు చేయాల్సిన పనులే. అలాగే, హాల్‌టికెట్ల జారీలో తప్పులను సరిచేయడం, పరీక్షా కేంద్రాలకు సరిపడా అభ్యర్థుల కేటాయింపు.. తదితర బేసిక్ పనులను నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహణలో 20-30 మంది, ఆఫ్‌లైన్(పేపర్) పరీక్షలైతే 50-100 మంది వరకు ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది చేసిన పనులన్నింటినీ ఆయా సెట్‌ల కన్వీనర్, కో కన్వీనర్లు పర్యవేక్షిస్తారు. ఫైనల్‌గా అవసరమైన ప్రశ్నపత్రాల సెట్లను రూపొందించుకునే కాన్ఫిడెన్షియల్ సెక్షన్లలోకి కన్వీనర్ మినహా ఎవరినీ అనుమతించరు.
రెమ్యునరేషన్ కన్నా రెస్పెక్టే మిన్న..!
ప్రవేశ పరీక్షలు, పోలీసు ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణలో పాల్గొనే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి నెలవారీ వేతనంతోపాటు మంచి రెమ్యునరేషన్ కూడా లభిస్తుంది. ఒక్కో ఉద్యోగికి వారి స్థాయిని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అదనంగా లభిస్తుంది. అయితే.. గతంలో (2016) ఎంసెట్ పేపర్ లీకైన సందర్భంలోనూ, తాజాగా టీఎ్‌సపీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలోనూ ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని బాధ్యులను చేయడంతో.. రెమ్యునరేషన్ కంటే సమాజంలో గౌరవమే ముఖ్యమని జేఎన్‌టీయూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది భావిస్తున్నారు.
టీఎస్‌పీఎస్సీ పరీక్షలతో పోలిక లేదు
నాన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో పనిచేసే సిబ్బంది అంతగా భయడాల్సిన అవసరం లేదని జేఎన్‌టీయూ అధికారులు అంటున్నారు. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంతో.. ఆన్‌లైన్‌లో నిర్వహించే టీఎస్ ఎంసెట్, పీజీఈ సెట్‌లకు పోలిక లేదంటున్నారు. ఒక్కో ప్రవేశ పరీక్షకు సంబంధించి ప్రశ్నల బ్యాంకులో 800 దాకా ప్రశ్నలు ఉంటాయని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వాటిని గుర్తుంచుకునే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఫైనల్‌గా బయటకు విడుదల చేసే సెట్లను పదుల సంఖ్యలో కన్వీనర్ మాత్రమే సెట్ చేసుకుంటారని పేర్కొంటున్నారు. ఏ రోజు పరీక్షకు ఏ సెట్‌ను ఇస్తారనేది పరీక్ష జరిగే రోజు దాకా బయటకు తెలిసే అవకాశం లేదంటున్నారు.
Updated Date - 2023-03-27T12:36:19+05:30 IST