TSPSC Paper Leak: అదే సిబ్బందితో పరీక్షలా? అడ్డుకోవాలంటూ భారీ సంఖ్యలో పిటిషన్లు!
ABN, First Publish Date - 2023-06-02T11:31:48+05:30
టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై దర్యాప్తు పూర్తికాకముందే..
టీఎస్‌పీఎస్సీ విశ్వసనీయత కోల్పోయింది
పేపర్ లీకేజీపై దర్యాప్తు కొలిక్కే రాలేదు
హడావుడిగా గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎందుకు?
11న తలపెట్టిన పరీక్షను అడ్డుకోండి
హైకోర్టులో భారీ సంఖ్యలో పిటిషన్లు
సర్కారుకు నోటీసులు.. తదుపరి విచారణ 5న
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ (TSPSC Paper Leak) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై దర్యాప్తు పూర్తికాకముందే.. హడావిడిగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించడంపై హైకోర్టులో భారీగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. గత నెల 25న దాదాపు 36 మంది అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేయగా గురువారం వేర్వేరుగా మరో మూడు పిటిషన్లు వేశారు. ఈ నెల 11న నిర్వహించతలపెట్టిన ప్రిలిమినరీ పరీక్షను అడ్డుకోవాలని కోరుతూ నల్లగొండకు చెందిన పాలకూరి అశోక్‌కుమార్ సహా మరికొంతమంది, నల్లగొండ గుర్రంపోడుకు చెందిన జె.సుధాకర్, జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన టి.రమేశ్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై గురువారం జస్టిస్ కె.శరత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పల్లె నాగేశ్వర్‌రావు, కంఠమనేని కిరణ్, కొవ్వూరి కృష్ణకిశోర్ వాదనలు వినిపించారు. గ్రూప్-1 పరీక్షల విషయంలో టీఎ్‌సపీఎస్సీ వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదం, గర్హనీయమని తెలిపారు. పేపర్ లీకేజీ ఘటనపై సిట్, ఈడీ దర్యాప్తు పూర్తికాకముందే మళ్లీ హడావిడిగా ప్రిలిమినరీ పరీక్ష తేదీ ప్రకటించడం అక్రమమని పేర్కొన్నారు. పరీక్షలకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయకుండా, ఒక్క ఉద్యోగిని కూడా మార్చకుండా పరీక్షలు నిర్వహించడంలో అర్థం లేదని తెలిపారు. ఇంకా లీకేజీ ముప్పు తొలగిపోలేదన్నారు. పలువురు టీఎ్‌సపీఎస్సీ సిబ్బందికి గ్రూప్-1 పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చి కూడా, వారిని విధుల్లో కొనసాగించిన ఉన్నతాధికారుల పాత్రపైనా దర్యాప్తు జరగాల్సి ఉందని చెప్పారు.
12 ఏళ్ల తర్వాత గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చిందని.. లక్షలాది మంది అభ్యర్థులు కష్టపడి రాసిన పరీక్ష లీకేజీ పేరుతో రద్దయిందని వివరించారు. ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ స్థాయి పోస్టులకు జరుగుతున్న పరీక్షల విషయంలో ఇంత నిర్లక్ష్యం, హడావిడి పనికిరాదని చెప్పారు. లీకేజీపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. లీకేజీపై దర్యాప్తు పెండింగ్‌లో ఉండగా మళ్లీ తేదీలు ప్రకటించారని.. ఈ నేపథ్యంలో టీఎ్‌సపీఎస్సీ చైర్మన్, సెక్రటరీల విశ్వసనీయత, పారదర్శకతపై అభ్యర్థుల్లో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటూ కూడా పరీక్షలు నిర్వహిస్తామనడం టీఎ్‌సపీఎస్సీ వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థకు సిగ్గుచేటని పేర్కొన్నారు. లీకేజీ ఘటనపై దాదాపు వెయ్యి మంది అభ్యర్థులు భారత రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించారన్నారు. తీవ్రమైన అభియోగాలు, లోపాలు ఉన్నప్పటికీ ముందుకు వెళ్తున్న టీఎ్‌సపీఎస్సీని అడ్డుకోవాలని.. ఈ నెల 11న నిర్వహించతలపెట్టిన పరీక్షను అడ్డుకోవాలని కోరారు. దర్యాప్తులో అసలు నిందితులు బయటపడే వరకు పరీక్షలను నిలిపివేయాలని అభ్యర్థించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. సాధారణ పరిపాలనశాఖ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, టీఎ్‌సపీఎస్సీ, సిట్‌కు నోటీసులు జారీచేసింది. విచారణను ఈ నెల 5కు వాయిదా వేసింది.
రహస్య సమాచార రక్షణకు చర్యలు..
ఈ నెల 11న నిర్వహించతలపెట్టిన పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని.. రహస్య సమాచారణ రక్షణకు కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ వంటి 10 మంది అధికారులను ప్రభుత్వం నియమించిందని టీఎ్‌సపీఎస్సీ హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే అంతర్గత బదిలీలు చేపట్టామని.. రహస్య విభాగంలోని సిబ్బంది మొత్తాన్ని మార్చేశామని పేర్కొంది. టీఎ్‌సపీఎస్సీకి సంబంధించిన 47 మంది ఉద్యోగులు అరెస్ట్ అయ్యారనడంలో వాస్తవం లేదని.. కేవలం ఇద్దరు శాశ్వత, ఇద్దరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే అరెస్ట్ అయ్యారని.. వారిని విధుల్లోంచి తొలగించామని తెలిపింది. 11న గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష నిర్వహణకు 33 జిల్లాల్లో 994 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. 26 ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించి 33 తేదీలను ప్రకటించామని.. అందులో భాగంగానే గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష తేదీని ఖరారు చేశామని వివరించింది.
మరో ఆరుగురికి 3 రోజుల కస్టడీ
హైదరాబాద్ : టీఎ్‌సపీఎస్పీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఆరుగురు నిందితులను సిట్ కస్టడీలోకి తీసుకుంది. గురువారం కస్టడీలోకి తీసుకున్న వీరిని మూడు రోజుల పాటు విచారించనుంది. మరోవైపు హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డ విద్యుత్తు శాఖ డీఈ రమేశ్‌ను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Updated Date - 2023-06-02T11:34:01+05:30 IST