Education: యూనివర్సిటీల్లో ‘రోస్టర్’ రచ్చ! అభ్యర్థుల ఆందోళన
ABN, First Publish Date - 2023-11-20T12:05:19+05:30
విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ పోస్టుల భర్తీ వ్యవహారం గందరగోళంగా మారింది. ఉన్నత విద్యాశాఖ ఖరారు చేసిన రోస్టర్ విధానం వివాదానికి కారణమైంది.
ఉన్నత విద్యాశాఖ నిర్ణయంపై వివాదం
పోస్టుల భర్తీపై హైకోర్టులో పిటిషన్లు
దరఖాస్తులు స్వీకరించవచ్చన్న కోర్టు
అనంతర ప్రక్రియ చేపట్టొద్దని ఆదేశం
ఈలోపే స్ర్కీనింగ్ పరీక్షకు షెడ్యూలు
ఏపీపీఎస్సీ తీరుపై అభ్యర్థుల ఆందోళన
(అమరావతి-ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ పోస్టుల భర్తీ వ్యవహారం గందరగోళంగా మారింది. ఉన్నత విద్యాశాఖ ఖరారు చేసిన రోస్టర్ విధానం వివాదానికి కారణమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల ప్రకారం మంజూరైన పోస్టులకు రోస్టర్ ఖరారు చేయాల్సి ఉండగా, ఉన్నత విద్యాశాఖ మాత్రం ప్రస్తుత ఖాళీలకు విడిగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో 18 వర్సిటీల్లో మొత్తం భర్తీ విధానమే గందరగోళం అవుతుందంటూ అనేకమంది హైకోర్టును ఆశ్రయించారు.
చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నత విద్యాశాఖ రోస్టర్ అమలుచేయడాన్ని సవాల్ చేస్తూ... ఇటీవల ఇచ్చిన పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు రద్దు చేయాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం దరఖాస్తులను స్వీకరించి, అనంతర ప్రక్రియను కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు నిలుపుదల చేయాలని ఆదేశించింది. హైకోర్టు శుక్రవారం ఈ ఆదేశాలను జారీ చేయగా, అదేరోజు సాయంత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే స్ర్కీనింగ్ పరీక్షకు ఏపీపీఎస్సీ తాత్కాలిక షెడ్యూలు విడుదల చేసింది. దీంతో ఓవైపు న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నా పోస్టుల భర్తీలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టమవుతోంది. అది కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే షెడ్యూలు విడుదల చేయడం విమర్శలకు తావిస్తోంది. ఏపీపీఎస్సీ చర్యలతో తమకు తీవ్ర నష్టం కలుగుతుందని కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు, అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాత్కాలికం పేరుతో షెడ్యూలు
రాష్ట్ర విద్యాసంస్థల చట్టం ప్రకారం మొత్తం మంజూరైన పోస్టులకు ఒకే రోస్టర్‌ను అమలుచేయాలి. కానీ ఉన్నత విద్యామండలి ప్రస్తుతం పనిచేస్తున్న వారిని వదిలేసి, ఖాళీల వరకూ కొత్తగా రోస్టర్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. పనిచేస్తున్నవారి తర్వాత పోస్టులకు పాత రోస్టర్ కొనసాగాల్సిన స్థానంలో మళ్లీ కొత్త రోస్టర్ పాయింట్లు వచ్చాయి. దీనివల్ల ఒక్కో వర్సిటీలో ఒక్కో విధంగా అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. కొన్ని కేటగిరీలకు పోస్టులు పెరిగితే, కొంతమందికి నష్టం జరిగింది. వీటిని సవాలు చేస్తూ శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ నుంచి కొందరు, జీవో 90ని సవాల్ చేస్తూ కొందరు, ఇతరత్రా అంశాలపై పలువురు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు.
వీటిపై తదుపరి విచారణ డిసెంబరు 4న చేపడతామని న్యాయస్థానం పేర్కొంది. ఈలోపే తాత్కాలికం పేరుతో ఎపీపీఎస్సీ షెడ్యూలు ఇచ్చేసింది. కాగా, వర్సిటీల్లో పోస్టుల విషయంలో వైసీపీ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల సమయంలో హడావిడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగా ఆగస్టులో ఇవ్వాల్సిన నోటిఫికేషన్లను నవంబరు వరకు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసింది. రోస్టర్‌లో నిబంధనలకు విరుద్ధమైన విధానం చేపట్టడం వివాదంగా మారింది. నాలుగున్నరేళ్లలో ఒక్క గ్రూప్-2 పోస్టు భర్తీచేయని ప్రభుత్వం... కొంతకాలంగా పెద్దఎత్తున నోటిఫికేషన్లు అంటూ ప్రచారం చేస్తోంది. కానీ నోటిఫికేషన్లు మాత్రం విడుదల చేయట్లేదు. ఇదంతా ఎన్నికల కోసమేనని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు.
Updated Date - 2023-11-20T12:05:20+05:30 IST