ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Education: గురుకులాల్లో పడకేసిన పాలన

ABN, First Publish Date - 2023-08-10T12:23:41+05:30

రాష్ట్రంలో గిరిజన గురుకులాల సొసైటీలో పరిపాలన అవినీతిమయంగా మారిపోయింది. అవినీతి అధికారులతో గిరిజన గురుకుల సొసైటీ నిండిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. గిరిజనుల చదువులను గాలికొదిలేసి కమీషన్లు దండుకుని ప్రిన్సిపాళ్లను

గిరిజన గురుకుల సొసైటీ అవినీతిమయం

హెడ్డాఫీసులో పైసా వసూల్‌ ముఠాలు

ముడుపులిస్తేనే ఈఎంఆర్‌ఎస్‌కు డిప్యుటేషన్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గిరిజన గురుకులాల సొసైటీలో పరిపాలన అవినీతిమయంగా మారిపోయింది. అవినీతి అధికారులతో గిరిజన గురుకుల సొసైటీ నిండిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. గిరిజనుల చదువులను గాలికొదిలేసి కమీషన్లు దండుకుని ప్రిన్సిపాళ్లను డిప్యూటేషన్‌పై బదిలీ చేస్తున్నారని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు(ఈఎంఆర్‌ఎస్‌) ఈ అధికారులకు కల్పతరువుగా మారాయని అంటున్నారు. నిధులు పుష్కలంగా ఉన్న ఈ స్కూళ్లలో పనిచేసేందుకు గురుకుల ప్రిన్సిపాళ్లు ఎగబడుతుండటంతో ఈ అధికారుల పంట పండిందని చెప్తున్నారు. రూ.లక్షలు వసూలు చేసి ప్రిన్సిపాళ్లుగా డిప్యూటేషన్లు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సచివాలయంలో పనిచేసే ఒక సెక్షన్‌ ఆఫీసర్‌ను గురుకుల సొసైటీ ఇన్‌చార్జ్‌ డిప్యూటీ సెక్రటరీగా నియమించారు. ఆయనకే కీలకమైన గురుకుల సొసైటీ జాయింట్‌ సెక్రటరీ బాధ్యతలు అప్పచెప్పి మొత్తం గురుకుల సొసైటీని కమీషన్ల కార్యాలయంగా మార్చారని విమర్శిస్తున్నారు. వైసీపీ వచ్చిన తర్వాత గిరిజన గురుకుల సొసైటీకి పూర్తిస్థాయి సెక్రటరీని నియమించిన పరిస్థితులే లేవు. కొంతకాలం గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఈ బాధ్యతలు నిర్వహించగా, ఎక్కువ కాలం గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఇన్‌చార్జ్‌గా ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెగ్యులర్‌ కార్యదర్శి లేక గురుకుల సొసైటీ ఆలనాపాలనా కరువయ్యిందని, ఎవరికి తోచినంత వారు దండుకోవడం సర్వసాధారణంగా మారిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి.

హెడ్డాఫీసులో కమీషన్ల కౌంటర్‌....

రాష్ట్రంలో 28 ఈఎంఆర్‌ఎస్‌ స్కూళ్లు ఉన్నాయి. వాటికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. ఇటీవల నిర్వహించిన స్పోర్ట్సు మీట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరుచేస్తే రూ.18 కోట్లకు బిల్లులు పెట్టి కమీషన్లు భారీగా వసూలు చేసుకున్నారని అంటున్నారు. ఈఎంఆర్‌ఎస్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు గిరాకీ బాగా పెరిగింది. గిరిజన గురుకులాల ప్రిన్సిపాళ్లు రూ.లక్షలు ముడుపులు చెల్లించి డిప్యూటేషన్‌ మీద వెళ్తుండటంతో గిరిజన గురుకులాల ప్రిన్సిపాల్‌ పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలన్నీ వార్డెన్లు, టీజీటీ, పీజీటీ, జూనియర్‌ లెక్చరర్లతో భర్తీ చేశారు. దానికి కూడా అధికారులకు చేయి తడపాల్సి వచ్చిందని అంటున్నారు. హెడ్డాఫీసులో అధికారుల కక్కుర్తి ఏ స్థాయికి చేరిందంటే గురుకులాల్లో వాడుతున్న స్టేషనరీ కూడా వారే కొనుగోలు చేసి గురుకులాలకు సరఫరా చేస్తున్నారు. గతంలో ప్రిన్సిపాళ్లు స్టేషనరీ కొనుగోలు చేసి వాడుకునే వారు. అందుకు అవసరమైన బిల్లులు పెట్టేవారు. ఈ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కచోటనే కొనుగోలు చేసి ఆయా గురుకులాలకు పంపించి కమీషన్లు వసూలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈఎంఆర్‌ఎ్‌సలకు 400 కంప్యూటర్లు సరఫరా చేశారు. అవన్నీ కమీషన్లు దండుకుని వైసీపీ నేత బంధువుకు సంబంధించిన ఏజెన్సీకు అప్పగించారని అంటున్నారు. కమీషన్లు దండుకుని నాసిరకం కంప్యూటర్లు సరఫరా చేస్తుండటంతో అవి కొన్ని రోజులకే మూలన పడుతున్నాయని ఆరోపిస్తున్నారు.

ప్రతి ఫైల్‌కూ కమీషనే....

గిరిజన గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలో కమీషన్ల వసూళ్లు పరాకాష్టకు చేరాయని విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న ఓ అధికారి ఏడాదికి రూ.6 లక్షలు లంచం రూపంలో వసూలు చేయాలని టార్గెట్‌ పెట్టుకుని ఉన్నారని చెబుతున్నారు. పీఆర్‌సీ ఫైల్‌ పెట్టేందుకు ఒక్కో ఉద్యోగి నుంచి రూ.2 వేల చొప్పున మొత్తం 700 మంది సిబ్బంది నుంచి రూ.14 లక్షలు వసూలు చేశారని సిబ్బంది చెప్తున్నారు. బకాయిలకు సంబంధించిన బిల్లులు అయితే అదనంగా ముట్టచెప్పాల్సిందే. గతంలో ప్రిన్సిపాళ్లు ఎక్కడికక్కడ ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చి హెడ్డాఫీసులకు సమర్పించేవారని, ఇప్పుడు ఆయా ఉద్యోగులు నేరుగా వచ్చి ముడుపులు సమర్పించుకుని బిల్లులు సమర్పించిపోతున్నారని పేర్కొంటున్నారు. ప్రధాన కార్యాలయంలో టెక్నికల్‌ విభాగంలో కొంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి ప్రతి నెలా జీతాల బిల్లులు పెట్టాలన్నా అక్కడ అధికారులకు ముడుపులు ముట్టజెప్పాల్సిందేనని వాపోతున్నారు.

ఇన్‌చార్జ్‌ల పాలనలో కుంటినడక...

గిరిజన గురుకులాల సొసైటీల పాలన ఇన్‌చార్జ్‌లతో కుంటినడకన నడుస్తోంది. ఒక ఏడాదే పూర్తిస్థాయి సెక్రటరీని నియమించారు. ఆతర్వాత చిన్న స్థాయి ఉద్యోగులను ఇన్‌చార్జ్‌లను చేసి పాలన సాగించారు. గురుకులాల్లో అకడమిక్‌తోపాటు వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయో పర్యవేక్షించే నాధుడే లేకుండాపోయారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అక్కడకు వెళ్లి విచారించి కమీషన్లు దండుకోవడం తప్ప పూర్తిస్థాయిలో తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. గిరిజన గురుకులాల్లో 1700 మంది దాకా ఔట్‌సోర్సింగ్‌ టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి కనీస టైంస్కేల్‌ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ఫైల్‌ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి వద్దనే పెండింగ్‌లో ఉంది. కమీషన్లు వచ్చే పనులు తప్ప మిగతా పనులేవీ ఈ సొసైటీ అధికారులు చేయరని పలువురు విమర్శిస్తున్నారు. హాస్టళ్ల నుంచి గిరిజన గురుకులాలుగా మారిన మైదాన ప్రాంత గురుకులాల్లోని 81 స్కూళ్లలో ఫిజిక్స్‌ టీచర్లు లేరు. ఆ పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ విధానంలో కూడా భర్తీ చేయలేదు. రెగ్యులర్‌ పోస్టులు సుమారు 1800 ఖాళీగా ఉన్నా.. ఈ సర్కార్‌ పట్టించుకోలేదు. ఓవైపు ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి దాని ద్వారానే సిబ్బందిని నియమిస్తామని చెప్పి, ఇటీవల ఓ సాప్ట్‌వేర్‌ సంస్థ ద్వారా గురుకులాల్లో 81 మంది ఏఎన్‌ఎంలను నియమించారు. ఇలా తమకు అవసరమైన, కమీషన్లు వచ్చే ఫైళ్లనే నడుపుతూ అవినీతికి ఆలవాలంగా గిరిజన గురుకుల సొసైటీ తయారైందని ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-08-10T12:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising