TSPSC Paper Leak: గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై బెంగ వద్దు.. ఇలా సన్నద్ధమవ్వండి
ABN, First Publish Date - 2023-03-18T20:20:39+05:30
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్, గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు నిర్ణయం కొందరికి ఖేదంగా.. మరికొందరికి మోదంగా ఉంది. 25,050 మంది గ్రూప్-1 మెయిన్స్ అర్హత సాధించి, సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఇది బాధాకరమైన వార్తే. అయితే...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) గత ఏడాది అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ (TSPSC Paper Leak) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కొందరికి ఖేదంగా.. మరికొందరికి మోదంగా ఉంది. 25,050 మంది గ్రూప్-1 మెయిన్స్ అర్హత సాధించి, సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఇది బాధాకరమైన వార్తే. అయితే.. 2012లో మాదిరిగా మెయిన్స్ జరిగాక పరీక్ష రద్దయి ఉంటే?? అప్పుడు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అందుకే.. TSPSC నిర్ణయాన్ని జీర్ణించుకుని, జూన్ 11న జరగబోయే ప్రిలిమ్స్‌కు సిద్ధమవ్వడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఏమేం చదవాలి? ఎలా చదవాలి?
గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 13 సబ్జెక్టులపై పేపర్ పాటర్న్ఉంటుంది. అవి..
1. రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలు (Current Affairs – Regional, National and International).
2. అంతర్జాతీయ సంబంధాలు – ముఖ్యఘట్టాలు (International Relations – Events).
3. జనరల్ సైన్స్ – శాస్త్రసాంకేతిక రంగంలో భారతదేశ పురోగతి (General Science – India’s Achievements in Science and Technology).
4. పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ, నివారణ వ్యూహాలు (Environmental Issues – Disaster Management, Prevention and Mitigation Strategies).
5. ఆర్థికశాస్త్రం – భారతదేశంలో సామాజిక పురోగతి (Economy and Social Development of India).
6. ప్రపంచ, భారత, తెలంగాణ భౌగోళికశాస్త్రం (Geography – World, India and Telangana).
7. భారతదేశ చరిత్ర, సంస్కృతిక వారసత్వం (Indian History and Cultural Heritage).
8. భారతదేశ రాజ్యాంగం-రాజనీతి శాస్త్రం (Indian Constitution and Polity).
9. పరిపాలన, భారతదేశంలో ప్రభుత్వ పాలసీలు (Governance and Public Policy in India).
10. తెలంగాణ రాష్ట్రంలో పాలసీలు (Policies of Telangana State)
11. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం (Society, Culture, Heritage, Arts and Literature of Telangana).
12. సామాజిక వెలి – లింగ, కుల, జాతి, దివ్యాంగులు.. ఇలా వివిధ వర్గాల హక్కులు, వారిని సమాజంలో చేరదీసే పాలసీలు. (Social Exclusion: Rights issues such as Gender, Caste, Tribe, disability etc,. and Inclusive Policies).
13. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ సామర్థ్యం, డేటా ఇంటర్‌ప్రిటేషన్(Logical Reasoning, Analytical Abilities, and Data Interpretation).
చదవడానికి ముందు ఈ 13 సబ్జెక్టులు వేర్వేరుగా అనిపించినా.. అన్నీ, ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం ఉన్నవేనని నిపుణులు చెబుతున్నారు. అంటే.. పాలిటీని చక్కగా చదివిన విద్యార్థులకు చరిత్రలో 1657లో జరిగిన ప్లాసీ యుద్ధం మొదలు.. పరిపాలనపరమైన సంస్కరణలపై పట్టు ఉంటుంది. గవర్నెన్స్ చక్కగా చదివిన వారికి విపత్తునిర్వహణ, సామాజిక శాస్త్రం, ప్రభుత్వ విధానాలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి తీసుకువచ్చిన పథకాలు, చట్టాలపై పట్టు వస్తుందని వివరిస్తున్నారు. ఆర్థికశాస్త్రంలో భాగంగా పంచవర్ష ప్రణాళికలు, ప్రభుత్వ విధానాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుందని, దీనికి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలను జోడించి చదువుకోవడం మంచిదని విశ్లేషిస్తున్నారు. ఆర్థికశాస్త్రానికి-జాగ్రఫీకి సంబంధాలుంటాయని, ఈ రెండు అంశాలను కలిపి చదువుకోవాలని సూచిస్తున్నారు. భారతదేశ చరిత్ర చదివేప్పుడే.. తెలంగాణ చరిత్రను కలిపి చదువుకోవడం మంచిదంటున్నారు. తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణలో భూ సంస్కరణలు, రైతాంగ పోరాటం.. ఇలా విభిన్న అంశాలకు సంబంధించి వేర్వేరు నోట్సులు రాసుకోవడం ఉపయుక్తంగా ఉంటుందని వివరిస్తున్నారు.
క్రమశిక్షణతో టైమ్ టేబుల్
ప్రతిరోజూ క్రమం తప్పకుండా ప్రిలిమ్స్ పై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒక టైమ్ టేబుల్‌ను ఏర్పాటు చేసుకుని, దాని ప్రకారం సంసిద్ధమవ్వాలంటున్నారు. పగటిపూట ఎక్కువ సమయం నోట్స్ రాయడానికి కేటాయించాలని, రాసిన నోట్స్ ను సాయంత్రం సమయాల్లో చదవాలని, అదే నోట్స్ ను తెల్లవారుజామున ఒకసారి చూసుకుంటే.. గుర్తుండిపోతుందని చెబుతున్నారు. చాలా మంది ఇందుకు భిన్నంగా చేస్తుంటారని.. ఒకేసారి అంతా చదవాలనే ప్రయత్నం చేస్తారని, దానివల్ల చదివింది గుర్తుండకుండా పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మెయిన్స్‌తో కలిపే చదవాలి..
పలు ఇన్‌స్టిట్యూట్‌లలో పోటీపరీక్షల ఫ్యాకల్టీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ విషయ నిపుణుడు మెన్నేని సంతోష్ రావు పలు సూచనలు ఇస్తున్నారు. అవి..
1. జూన్ 11న జరగబోయే ప్రిలిమ్స్ తోపాటు.. మెయిన్స్ కు కూడా సమాంతరంగా సన్నద్ధమవ్వాలి.
2. రోజువారీ టైమ్ టేబుల్‌లో భాగంగా.. మెయిన్స్ కు 1/3వ వంతు, ప్రిలిమ్స్ కు 2/3వ వంతు సమయాన్ని కేటాయించాలి.
3. ప్రిలిమ్స్ కోసం రీజనింగ్, మెయిన్స్ కోసం డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ను కలిపి చదువుకోవాలి.
4. జూన్ 11న ప్రిలిమ్స్ జరిగాక.. ఫలితాలు త్వరగా విడుదల చేసే అవకాశాలున్నాయి. గతంలో కోర్టుకేసుల కారణంగా పరీక్షలు జరిగిన నాలుగు నెలలకు కానీ ఫలితాలు రాలేదు. ఈ సారి ప్రిలిమ్స్ పూర్తయిన వారంలో ప్రాథమిక, తుది కీల విడుదల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి. అక్టోబరులో మెయిన్స్ నిర్వహించే చాన్స్ ఉంటుంది. అందుకే.. ఒకేసారి ప్రిలిమ్స్, మెయిన్స్ పై దృష్టి సారించడం మంచిది.
5. ఇలా చేయడం వల్ల.. రెండు నెలల్లో సబ్జెక్టును పూర్తిచేసుకుని, ప్రిలిమ్స్ వరకు రివిజన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కేవలం రివిజన్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టిస్ చేస్తే సరిపోతుంది.
6. యూపీఎస్సీ(UPSC) మెయిన్స్ పరీక్షలు కూడా రాసేవారు టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రిలిమ్స్ తోపాటు.. మెయిన్స్ ను కలిపి చదవాలి.
టెస్ట్ సిరీస్‌లు ఉపయోగపడతాయా?
చాలా మంది విద్యార్థుల్లో పలు ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే టెస్ట్ సిరీస్‌లు ఉపయుక్తమేనా? అనే అనుమానం ఉంటుంది. టెస్ట్ సిరీస్‌ల వల్ల ఆయా సబ్జెక్టులపై ఎంతమేర పరిపక్వత వచ్చిందనే అంశాన్ని బేరీజు వేసుకోవడానికి వీలుంటుంది. అంతేకాకుండా.. వాటి వల్ల విశ్వాసం పెరుగుతుంది. ఒకప్పుడు టెస్ట్ సిరీస్‌లు రాయాలంటే.. మారుమూల ప్రాంతాల విద్యార్థులు కూడా హైదరాబాద్ రావాల్సి ఉండేది. చాలా విద్యాసంస్థలు తమ యాప్‌ల ద్వారా ఆ సేవలను అందుబాటు ధరల్లో అందజేస్తున్నాయి. షార్ట్, మీడియం, గ్రాండ్ టెస్ట్ సిరీస్‌ల పేరుతో పరీక్షలు పెడుతున్నాయి. ఈ పరీక్షల వల్ల టైమ్ మేనేజ్‌మెంట్ వస్తుంది. ఒకవేళ టెస్ట్ సిరీస్‌లకు స్తోమత లేదనుకునేవారు.. గతంలో జరిగిన అన్నిరకాల జనరల్ స్టడీస్ పరీక్షల పేపర్ల ను(మార్కెట్‌లో బుక్స్ అందుబాటులో ఉన్నాయి) ప్రాక్టిస్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది జరిగిన ప్రిలిమ్స్ లో చాలా మంది అభ్యర్థులు తమకు అసలు పేపర్ పూర్తిచేయడానికి సమయం సరిపోలేదని చెప్పారు. బిట్స్ ప్రాక్టిస్ వల్ల సమయపాలన(Time Management) వస్తుందని, నిర్ణీత సమయం కంటే 5-15 నిమిషాల ముందే పేపర్‌ను పూర్తిచేసేలా సామర్థ్యాన్ని పెంచుకుంటారని సబ్జెక్ట్ నిపుణులు వివరిస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన ప్రిలిమ్స్ తో.. టీఎస్‌పీఎస్సీ ప్యాటర్న్ మారిందనే తత్వం అందరికీ బోధపడింది. అంటే.. ఫ్యాక్చువల్ ప్రశ్నలు 75%, అనలిటికల్ 25% ఉండే ప్రశ్నపత్రం కాస్తా.. యూపీఎస్సీ మాదిరిగానే ఫ్యాక్చువల్‌కు 25%, అనలిటికల్‌కు 75% ప్రశ్నలను కేటాయించారు. ఈ తరహా పేపర్‌ను క్రాక్ చేయాలంటే.. ప్రాక్టీస్ చాలా అవసరం.
సమయం లేదు మిత్రమా?
నిజానికి గత ప్రిలిమ్స్ పరీక్షల కోసం ఏడాదిగా సన్నద్ధమైన వారిలో చాలా మంది మెయిన్స్ అర్హత సాధించలేదు. అలాంటివారు ఇప్పటికే గ్రూప్-2 ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యారు. ఇప్పుడు గ్రూప్-1 ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహిస్తుండడం వారికి కలిసి వచ్చే అంశమే. అయితే.. గత ప్రిలిమ్స్ లో అర్హత సాధించినవారు ఇప్పటికే మెయిన్స్ కోసం సబ్జెక్టులను ఒక రౌండ్ చుట్టేసి, రివిజన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో గత ప్రిలిమ్స్ లో అర్హత సాధించలేకపోయినవారు రాబోయే ప్రిలిమ్స్ ను సులభంగానే క్రాక్ చేయగలిగినా.. మెయిన్స్ ప్రిపరేషన్‌కు చాలా శ్రమించాల్సి ఉంటుంది. అందుకే.. ఇప్పటి నుంచే మెయిన్స్ కు కూడా ప్రిపేర్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
యోగా, ధ్యానంతో ఏకాగ్రత..
వయోపరిమితి పెంపువల్ల 44 ఏళ్ల వయసున్నవారు కూడా ప్రస్తుత టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాస్తున్నారు. ఇలాంటి వారిలో ఏకాగ్రత కొంచెం కష్టమే. కుటుంబం, బాధ్యతలు, ఉద్యోగం.. ఇలా నిత్యం కాలంతోపాటు పరుగులు తీసే పోటీ ప్రపంచానికి అలవాటు పడ్డ వారు.. చదివిన విషయాన్ని గుర్తుంచుకోవడం కూడా పెద్దపనే..! ఈ సమస్యను అధిగమించేందుకు ప్రతి రోజూ కొంత సమయం యోగా లేదా ధ్యానానికి కేటాయించాలని నిపుణులు వివరిస్తున్నారు.
చదివే వాతావరణం ఎలా ఉండాలి?
రణగొణ ధ్వనులకు దూరంగా.. ప్రశాంత వాతావరణంలో ప్రిపరేషన్ ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఉండేవారికి ఆ అవకాశం తక్కువే అయినా.. ఉస్మానియా విశ్వవిద్యాలయం, సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా వర్సిటీ లైబ్రరీ.. ఇలా పలు వెసులుబాట్లున్నాయి. గ్రామీణ ప్రాంతాల వారికి ఆ ఇబ్బంది లేదు. హైదరాబాద్‌లో ఇప్పుడు చాలా చోట్ల ‘స్టడీహాల్’ సంస్కృతి ప్రారంభమైంది. ఏసీ సదుపాయాలతోపాటు.. అందుబాటులో తాగునీరు.. ప్రశాంతతకు భంగం కలగనివిధంగా ఏర్పాట్లు, వైఫై సదుపాయం వంటి అవకాశాలను అందజేస్తున్నారు. ఈ హాళ్లలో ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు చదువుకోవచ్చు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుంచి నెలకు రూ.1,000 నుంచి రూ. 2,000 వరకు వసూలు చేస్తున్నారు.
గ్రూప్-2, 3, 4, డీఏవో పరీక్షలకు
గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పోలిస్తే.. గ్రూప్-2, 3, 4, డీఏవో పరీక్షలకు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. గ్రూప్-1 ప్రిలిమ్స్ లో.. జనరల్ స్టడీస్‌తోపాటు.. అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే పేపర్ ఉంటుంది. మిగతావాటికి అలా కాదు. ఇంకా చెప్పాలంటే.. మిగతా పేపర్లలో జనరల్ స్టడీస్‌లోనే 25 మార్కుల దాకా ఇంగ్లిష్ భాషకు సంబంధించిన బిట్స్ వస్తాయి. రీజనింగ్ మరో 25 మార్కుల దాకా ఉంటాయి. ఈ రెండింటిపై పట్టు సాధిస్తే.. కనిష్ఠంగా 40 మార్కులు మీ జేబులో ఉన్నట్లే. గ్రూప్-2కు మొదటిపేపర్ జనరల్ స్టడీస్ కాగా.. మిగతా మూడు పేపర్లలో ఇతర సబ్జెక్టులుంటాయి. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం సన్నద్ధమవ్వొచ్చు. ఇక గ్రూప్-3లో మొదటి పేపర్ జనరల్ స్టడీస్, మిగతా రెండు పేపర్లు ఇతర సబ్జెక్టులు.. గ్రూప్-4లో మొదటి పేపర్ జనరల్ స్టడీస్, రెండో పేపర్ సెక్రటేరియల్ ఎబిలిటీస్‌పై ఉంటుంది. డీఏవోలో కూడా మొదటి పేపర్ జనరల్ స్టడీస్, రెండో పేపర్ గణితంపై ఉంటాయి. పైన గ్రూప్-1 ప్రిలిమ్స్ అభ్యర్థులకు అందజేసిన సూచనల మాదిరిగానే ఒక టైమ్ టేబుల్ పెట్టుకుని, గ్రూప్-2, 3, 4, డీఏవో పరీక్షలకు సన్నద్ధమవ్వడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - 2023-03-18T20:36:16+05:30 IST