TSPSC Paper Leak: తాజాగా ఆ పేపర్ కూడా లీక్! భార్య జాబ్ కోసం ఖమ్మం వాసి ఏం చేశాడంటే..!
ABN, First Publish Date - 2023-04-08T11:55:30+05:30
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసు (TSPSC Paper Leak) లో తవ్విన కొద్దీ లీకేజీలు బయటికి వస్తున్నాయి. తాజాగా.. డీఏవో (డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్) ప్రశ్నపత్రం కూడా లీకయి.. ఇతరుల చేతికి అందినట్లు
డీఏవో పేపరూ లీక్
ధ్రువీకరించుకున్న సిట్ అధికారులు..
ఇప్పటికే ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో గుర్తింపు
పరీక్షను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ..
ఖమ్మంకు చెందిన భార్యాభర్తల అరెస్టు..
భార్య ఉద్యోగం కోసం రూ.10 లక్షలకు ప్రవీణ్ నుంచి కొనుగోలు చేసిన భర్త
సాంకేతిక సమస్య పరిష్కారం కోసం వస్తే టీఎస్‌పీఎస్సీలో పరిచయమైన ప్రవీణ్
లీకేజీ కేసులో 17కు చేరిన నిందితుల సంఖ్య..
సిట్‌కు అందిన ఫోరెన్సిక్ రిపోర్టు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసు (TSPSC Paper Leak) లో తవ్విన కొద్దీ లీకేజీలు బయటికి వస్తున్నాయి. తాజాగా.. డీఏవో (డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్) ప్రశ్నపత్రం కూడా లీకయి.. ఇతరుల చేతికి అందినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు ఏఈ, గ్రూప్-1, డీఏవో, టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ, ఎంవీఐ, గ్రౌండ్ వాటర్.. ఇలా మొత్తం 7 పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన 15 ప్రశ్నపత్రాలను ప్రవీణ్ (Praveen), రాజశేఖర్‌రెడ్డిల పెన్‌డ్రైవ్, మొబైల్స్‌లో సిట్ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. దాంతో ఆ పరీక్షలన్నింటినీ టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. అయితే వీటిలో గ్రూప్-1, ఏఈ పరీక్షల ప్రశ్నపత్రాలను ప్రవీణ్, రాజశేఖర్ ఇతరులకు విక్రయించినట్లు ఇప్పటిదాకా గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తులో భాగంగా 15 మంది నిందితులను అరెస్టు చేసి లోతుగా విచారణ జరిపారు. ఈ క్రమంలోనే డీఏవో ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్.. ఖమ్మంకు చెందిన లౌకిక్, సుష్మిత అనే దంపతులకు విక్రయించినట్లు తేలింది. భార్య సుష్మిత కోసం భర్త లౌకిక్ ఈ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇందుకోసం రూ.10 లక్షలకు ఒప్పందంద చేసుకొని.. ముందుగా రూ.6 లక్షలు ప్రవీణ్‌కు చెల్లించినట్లు నిర్ధారించారు. ప్రవీణ్ బ్యాంకు ఖాతా లావాదేవీల ఆధారంగా ఈ విషయాన్ని సిట్ అధికారులు తెలుసుకున్నారు. సుష్మిత గతేడాది అక్టోబరులో టీఎ్‌సపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రాసి, మెయిన్స్‌కు క్వాలిఫై కాలేకపోయింది. ఆ తర్వాత డీఏవో పరీక్షకు సన్నద్ధమైంది. అయితే అప్లికేషన్ సబ్‌మిట్ చేసిన క్రమంలో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయి. వాటిని పరిష్కరించుకోవడానికి సుష్మిత తన భర్తతో కలిసి టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వచ్చింది. దీనిని పరిష్కరించుకునే క్రమంలో వారికి కమిషన్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌తో పరిచయం అయింది.
ప్రవీణ్ ముందస్తు ప్లాన్‌లో భాగంగానే..
అప్పటికే గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని లీక్ చేసిన ప్రవీణ్.. మిగిలిన పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీక్‌చేసే అవకాశం ఉండటంతో ముందస్తు ప్లాన్‌లో భాగంగానే కమిషన్‌కు వచ్చే వారిని పరిచయం చేసుకున్నట్లు తెలిసింది. ఫిబ్రవరిలో డీఏవో పరీక్ష ఉండటంతో తన వద్ద ప్రశ్నపత్రం లభ్యమవుతుందని, పరీక్ష దగ్డర పడగానే వస్తే సెట్ ఇస్తానని చెప్పినట్లు సమాచారం. లౌకిక్, సుష్మిత దంపతులు ప్రవీణ్‌ను సంప్రదించి రూ.10 లక్షలకు డీఏవో పేపర్‌కు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా రూ. 6 లక్షలు చెల్లించి పేపర్ కొనుగోలు చేసిన లౌకిక్.. మిగిలిన డబ్బులు పరీక్ష రాసిన తర్వాత ఇస్తామని ఒప్పందం చేసుకున్నాడు. ఫిబ్రవరిలో సుష్మిత డీఏవో పరీక్ష రాసింది. ఆ తర్వాతి క్రమంలో రేణుక, డాక్యానాయక్‌లతో ఉన్న పరిచయంతో ప్రవీణ్ వారికి ఏఈ ప్రశ్నపత్రాన్ని రూ.10లక్షలకు విక్రయించాడు. ప్రవీణ్ బ్యాంకు ఖాతాలోని లావాదేవీలను విశ్లేషించిన పోలీసులు లౌకిక్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. విషయం నిర్థారణ అయింది. దీంతో సుష్మితను, లౌకిక్‌ను అరెస్టు చేశారు. ఇద్దరి అరెస్టుతో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితుల సంఖ్య 17కు చేరింది. ఇదిలా ఉండగా.. ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్, మొబైల్స్‌లోని డేటాను ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించి, రిపోర్టును సీల్డ్‌కవర్‌లో సిట్‌కు అందించినట్లు తెలిసింది. 11న సిట్ అధికారులు విచారణ రిపోర్టును హైకోర్టుకు సమర్పించాల్సి ఉండటంతో, ఫోరెన్సిక్ నివేదికను సైతం కోర్టుకు అందజేసే అవకాశం ఉంది.
Updated Date - 2023-04-08T11:55:30+05:30 IST