TSPSC Paper leak: ఇంత ఈజీగా ఎలా సాధ్యమైంది?
ABN, First Publish Date - 2023-03-24T13:53:27+05:30
గ్రూపు-1 పరీక్ష ప్రశ్న (TSPSC Paper leak) పత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఎంతో కష్టపడి చదివితే కానీ ప్రిలిమినరీ పరీక్షను దాటలేరు. అలాంటి
ప్రిలిమినరీలో టీఎస్‌పీఎస్సీ సిబ్బంది ‘ప్రతిభ’
ఓ ఉద్యోగి భర్తకు 127.. మరొకరికి 122 మార్కులు!
8 మంది మెయిన్స్‌కు
వంద మార్కులు దాటిన వారు ముగ్గురు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): గ్రూపు-1 పరీక్ష ప్రశ్న (TSPSC Paper leak) పత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఎంతో కష్టపడి చదివితే కానీ ప్రిలిమినరీ పరీక్షను దాటలేరు. అలాంటి ప్రిలిమినరీ పరీక్ష రాసిన 26 మంది అభ్యర్థుల్లో 8 మంది మెయిన్‌కు ఎంపిక కావడమంటే.. ప్రతిభతో పాటు రేయింబవళ్లు శ్రమించి చదివి ఉండాలి. కానీ, ఒక్క రోజు కూడా ఉద్యోగానికి సెలవు పెట్టకుండా, ఎక్కడా శిక్షణ తీసుకోకుండా, సరిగ్గా చదవకుండానే ఈ ఫలితాలను సాధిస్తే..? అదో అద్భుతమే! పేరు మోసిన శిక్షణా సంస్థల్లోని అభ్యర్థులకు కూడా సాధ్యం కాని ఫలితాలను ‘తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)’లో పనిచేస్తున్న సిబ్బంది సాధించేశారు! గ్రూపు-1 ప్రిలిమనరీ పరీక్షలను 2.80 లక్షల మంది అభ్యర్థులు రాశారు. ఇందులో 25 వేల మంది మెయిన్ పరీక్షకు ఎంపికయ్యారు. టీఎస్‌పీఎస్సీ (TSPSC) లో పనిచేస్తున్న 26 మంది సిబ్బంది (ఈ సంఖ్యపైనా పూర్తిస్థాయిలో స్పష్టత లేదు) ఈ పరీక్షను రాశారు. ఇందులో 17 మంది రెగ్యులర్ ఉద్యోగులు కాగా, 9 మంది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నట్లు తెలిసింది.
అయితే పరీక్ష రాసిన 26 మందిలో 8 మంది (ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం) మెయిన్‌కు ఎంపికయ్యారు. అంటే సక్సెస్ రేట్ 30 శాతానికి పైగా ఉంది! తాజా సమాచారం ప్రకారం టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి భర్తకు 127 మార్కులు, మరో ఉద్యోగికి 122 మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే డిస్‌క్వాలిఫై అయిన ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి. ఈ స్థాయి ఫలితాలు రేయింబవళ్లు కష్టపడి చదివిన వారికి కూడా సాధ్యం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
25 వేల మంది అభ్యర్థులు మెయిన్‌కు అర్హత సాధించగా.. 120 మందికి 100కు పైగా మార్కులు వచ్చాయని సమాచారం. అంటే ఎంతో శ్రమిస్తే గానీ, 100 మార్కులు దాటడం అసాధ్యం. అలాంటిది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి అత్యధిక మార్కులు వచ్చేశాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ఇదిలా ఉంటే టీఎస్‌పీఎస్సీ అధికారులు.. ప్రిలిమినరీ పరీక్షలకు తమ సిబ్బంది ఎంత మంది హాజరయ్యారు? వారికి ఎన్ని మార్కులు వచ్చాయి? 100 దాటిన వారు ఎందరు? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. కొన్ని లీకులు, వివిధ మార్గాల్లో తెలుసుకుంటున్న సమాచారమే తప్ప.. కమిషన్ ఇప్పటి వరకు అధికారికంగా వివరాలను వెల్లడించలేదు. మెయిన్‌కు అర్హత సాధించిన వారి మార్కులను కూడా కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు గ్రూపు-1 పరీక్ష రాసేందుకు సిబ్బందిలో ఎంత మందికి అనుమతి ఇచ్చారు? ఎందరికి ఎన్‌వోసీ ఇచ్చారనే వివరాలను తెలియజేయాలని గవర్నర్ కూడా టీఎస్‌పీఎస్సీని ప్రశ్నించారు.
పెద్దపెద్ద శిక్షణ సంస్థలకే సాధ్యం కాలేదు..!
గతంతో పోలిస్తే ఈ సారి ప్రిలిమనరీ పరీక్ష పేపర్‌ను లాజికల్‌గా రూపొందించారని అంటున్నారు. సబ్జెక్టుల వారీగా నిపుణులున్న కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ తీసుకుని, నిరంతరం శ్రమించే వారికి 90 నుంచి 100 మార్కులు వస్తాయని, అది కూడా ఒక్క శాతం మాత్రమే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బాగా చదివి, మంచి ప్రతిభ ఉన్న వారికి 80-90 మార్కుల మధ్య వచ్చే వీలుందని పేర్కొంటున్నారు. 100 మార్కులు దాటడం అంటే.. అసాధారణ పరిస్థితిగా భావించాల్సి ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్‌లో 30 ఏళ్లుగా అనేక ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్న ఓ ప్రముఖ సంస్థలో చదువుకున్న అభ్యర్థుల్లో 8 శాతం మందే గ్రూపు-1 మెయిన్‌కు అర్హత సాధించారు.
ఇలాంటి ఏ సంస్థల్లో శిక్షణ తీసుకున్న అభ్యర్థుల ఫలితాలను విశ్లేషించినా సక్సెస్ రేటు సాధారణంగా 10 శాతాన్ని దాటిన దాఖలాల్లేవు. కొన్ని కోచింగ్ కేంద్రాల్లో అయితే 5 శాతం కంటే తక్కువ మంది అర్హత సాధించారు. హైదరాబాద్‌లోని ఓ కోచింగ్ కేంద్రంలో సుమారు 500 మంది అభ్యర్థులు శిక్షణ తీసుకుంటే 25 మంది కూడా అర్హత సాధించలేని పరిస్థితి ఉంది. కానీ, టీఎస్‌పీఎస్సీ (TSPSC) లో పనిచేస్తున్న సిబ్బంది ఏకంగా 30 శాతం సక్సెస్ రేట్‌తో పాటు అత్యధిక మార్కులను కూడా సాధించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ సిబ్బంది.. మొత్తం వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Updated Date - 2023-03-24T13:53:27+05:30 IST