ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TSPSC: 2 సార్లు గ్రూప్‌-1 రద్దుతో టీఎస్‌పీఎస్సీ అభాసుపాలు! మండిపడుతున్న నిరుద్యోగ యువత

ABN, First Publish Date - 2023-09-25T09:36:27+05:30

మా కొలువులు మాకే’ అంటూ ఉద్యమించారు! ప్రత్యేక రాష్ట్రం వస్తే పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయని ఆశ పెట్టారు! ప్రత్యేక రాష్ట్రం వచ్చింది! ఉద్యమ పార్టీయే అధికారం చేపట్టింది! అయినా.. ఒకే ఒక్కసారి దాదాపు వెయ్యి పోస్టులతో గ్రూప్‌-2 మినహా తొమ్మిదేళ్లపాటు ఇతర

9 ఏళ్లలో ఒకే ఒక్క గ్రూప్‌ నోటిఫికేషన్‌..

ఎన్నికల ఏడాదిలో భారీగా ప్రకటనలు

ఏడాదిలో 80 వేల పోస్టుల భర్తీకి నిర్దేశాలు

వీటిలో టీఎస్‌పీఎస్సీ భర్తీ చేసే కొలువులు 25 వేలు

ఒక్క నోటిఫికేషన్‌ భర్తీ చేయడానికే ఏళ్లూ పూళ్లూ

ఏడాది కాలంలో భారీగా భర్తీ చేయడం సాధ్యమేనా!?

అయినా, టీఎస్‌పీఎస్సీలో రెగ్యులర్‌ సిబ్బంది 83 మందే

మరో 23 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు

25 వేల పోస్టుల భర్తీ ఈ సిబ్బందితో సాధ్యమా!?

2 సార్లు గ్రూప్‌-1 రద్దుతో టీఎస్‌పీఎస్సీ అభాసుపాలు

ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న నిరుద్యోగ యువత

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘మా కొలువులు మాకే’ అంటూ ఉద్యమించారు! ప్రత్యేక రాష్ట్రం వస్తే పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయని ఆశ పెట్టారు! ప్రత్యేక రాష్ట్రం వచ్చింది! ఉద్యమ పార్టీయే అధికారం చేపట్టింది! అయినా.. ఒకే ఒక్కసారి దాదాపు వెయ్యి పోస్టులతో గ్రూప్‌-2 మినహా తొమ్మిదేళ్లపాటు ఇతర ‘గ్రూపు’ కొలువుల్లేవు! ఉద్యోగాలు రావట్లేదని నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వారిలో నిరాశా నిస్పృహలు పెరిగిపోతుంటే.. ఎన్నికలకు ఏడాది ముందు భారీ నోటిఫికేషన్లు ప్రకటించారు. దాదాపు 80 వేల పోస్టులను భర్తీ చేసేస్తామని ఘనంగా చెప్పారు. వీటిలో దాదాపు 25 వేల పోస్టుల భర్తీ బాధ్యతను టీఎ్‌సపీఎస్సీకే (TSPSC) అప్పగించారు. వాటిని ఒక్క ఏడాదిలో భర్తీ చేసేయాలని నిర్దేశించారు. ఇప్పుడు పోస్టుల భర్తీ ప్రక్రియలో టీఎ్‌సపీఎస్సీ కాస్తా చతికిలపడింది. గ్రూప్‌-1 పరీక్షలు ఏకంగా రెండుసార్లు రద్దయ్యాయి. ఉద్యోగాలు మానుకుని.. లక్షల రూపాయలు కోచింగ్‌ సెంటర్లకు పోసి.. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాదిమంది నిరుద్యోగులు ఏకంగా రెండుసార్లు నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ గ్రూప్‌-1 పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని అగమ్యగోచర పరిస్థితి. దీంతో, వారిలో అత్యధికులు అయితే గ్రూప్‌ పోస్టులపై ఆశలు కూడా వదులుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే, ప్రభుత్వ తీరుపై (BRS Government) నిరుద్యోగులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదేళ్లుగా మిన్నకుండి ఎన్నికల ఏడాదిలో పోస్టుల భర్తీ ప్రహసనం చేసిందని మండిపడుతున్నారు. సాధారణంగా ఎక్కడైనా ఏటా లేదా రెండేళ్లకోసారి పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహిస్తారని, లేదా వరుస క్రమంలో ఒకదాని తర్వాత మరొకటిగా గ్రూపు పోస్టులను భర్తీ చేస్తారని కానీ ఒకేసారి లక్ష పోస్టుల భర్తీ అంటూ ప్రహసనం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క పేపర్ల లీకేజీ వ్యవహారం, మరో పక్క కోర్టు కేసులతో వరుసగా రద్దవుతున్న పరీక్షలతో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సవ్యంగా పరీక్షలను నిర్వహించి, సకాలంలో ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలమవుతున్న టీఎ్‌సపీఎస్సీ తీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో సరైన నిర్ణయాలను తీసుకోవాల్సిన ప్రభుత్వ వైఖరి పట్ల కూడా అభ్యర్థులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టి ఇప్పటికే ఏడాదిన్నర కాలం దాటిపోయింది. అయినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఈ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. రాసిన పరీక్షలు వరుసగా రద్దు అవుతుండడం, రాయాల్సిన పరీక్షలు వాయిదా పడుతుండడంతో నిరుద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తాజాగా గ్రూపు-1 పరీక్షలను హైకోర్టు రద్దు చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

భారీ క్రతువుకు తగిన సహకారం ఏదీ!?

సాధారణంగా ఒక నోటిఫికేషన్‌ను ప్రకటించి.. పోస్టులను భర్తీ చేయడానికే ఏళ్లూ పూళ్లూ పడుతుంది. అలాంటిది ఒక్క ఏడాదిలోనే 25 వేల పోస్టులను భర్తీ చేయాలంటే మహా యజ్ఞమే చేయాల్సి ఉంటుంది. మరి, ఇంత భారీ క్రతువును నిర్వహించడానికి అనువుగా టీఎ్‌సపీఎస్సీని బలోపేతం చేశారా!? అంటే అదీ లేదు. కొలువులు భర్తీ చేసే టీఎ్‌సపీఎస్సీలోనే కొలువులు ఖాళీ. కమిషన్‌ ఏర్పాటైన సమయంలో మొత్తం 260 మంది రెగ్యులర్‌ సిబ్బందిని కేటాయించాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ, ఇందులో 120 పోస్టులను మాత్రమే మంజూరు చేశారు. ప్రస్తుతం అక్కడ పని చేస్తున్న రెగ్యులర్‌ సిబ్బంది ఎంతో తెలుసా!? కేవలం 83 మంది మాత్రమే. మరో 23 మంది ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్నారు. వీరంతా కలిసి గ్రూప్‌ 1 నుంచి 4 వరకూ పోస్టులతోపాటు ఇతర కొలువుల భర్తీ ప్రక్రియను నిర్వహించాలి. అది కూడా ఏడాదిలోనే వాటిని భర్తీ చేయడం సాధ్యమేనా!? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిజానికి, గ్రూప్‌ 1 పేపర్‌ లీకేజీ వ్యవహారం బయటపడినప్పుడే సిబ్బంది కొరత సమస్య ప్రధానంగా బయటకు వచ్చింది. టీఎ్‌సపీఎస్సీలోనే ఖాళీలను భర్తీ చేయాలనే వాదన వచ్చింది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అవసరం అయినప్పుడు ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై తీసుకోవాలనే నిర్దేశాలు తప్ప టీఎ్‌సపీఎస్సీని బలోపేతం చేయడానికి ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.

అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి

మరోవైపు, ఏళ్ల తరబడి ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. పైగా చాలా కాలం తర్వాత పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో పెద్ద ఎత్తన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇలా లక్షలాది మందికి ఒకే సారి పరీక్షలను నిర్వహించాలన్నా.. నియామకాలకు ఇతర ఏర్పాట్లను చేయాలన్న ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతోంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే అక్రమాలకు తక్కువ అవకాశం ఉంటుందని నిపుణులు సూచించారు. ఉదాహరణకు కేరళలో అనుసరిస్తున్న విధానాన్ని ఉదాహరించారు. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా కేరళలో ఉద్యోగాల భర్తీని చేస్తున్నారు. సర్వీసులో ఉన్న ఒక ఉద్యోగి రిటైర్‌ అయ్యే రోజు నాటికే ఆ పోస్టులో మరొకరిని నియమిస్తున్నారు. దాంతో, ఖాళీ పోస్టులు అన్న సమస్యనే ఉత్పన్నం కాదు. ఇలా పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండడంతో పోటీ పడే అభ్యర్థులు కూడా తక్కువగా ఉంటారు. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో నియామకాలను సకాలంలో చేయకపోవడంతో భారీ సంఖ్యలో ఖాళీ పోస్టులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే, ఏటా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ను ప్రకటించాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. కానీ, సర్కారు ఈ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.

Updated Date - 2023-09-25T09:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising