పాఠాలు చెప్పించారు.. పారితోషికం మరిచారు

ABN, First Publish Date - 2023-05-22T12:31:48+05:30

ఓవైపు పని ఒత్తిడి పెంచడం, మరోవైపు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేసి వాటికి టీచర్లను బాధ్యులను చేయడం లాంటి చర్యలకు దిగుతున్న ప్రభుత్వం...

పాఠాలు చెప్పించారు.. పారితోషికం మరిచారు
reward
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీచర్లకు రూ.4.5 కోట్లూ ఇవ్వలేని దుస్థితి

ఉన్నత పాఠశాలలకు 4,500 మంది ఎస్జీటీలు

ఒక్కో టీచర్‌కు నాలుగు నెలలకు రూ.10వేలు

విద్యా సంవత్సరం ముగిసినా వాటి ఊసేలేదు

దూరాభారం వెళ్లి నష్టపోయామని టీచర్ల ఆవేదన

(అమరావతి–ఆంధ్రజ్యోతి): ఓవైపు పని ఒత్తిడి పెంచడం, మరోవైపు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేసి వాటికి టీచర్లను బాధ్యులను చేయడం లాంటి చర్యలకు దిగుతున్న ప్రభుత్వం... వారితో చేయించుకున్న పనికి పారితోషికం ఇచ్చే విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోంది. విద్యా రంగానికి రూ.50వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొంటున్న వైసీపీ సర్కారు.. చివరికి వారికివ్వాల్సిన రూ.4.5 కోట్లపైనా కక్కుర్తిగా వ్యవహరిస్తోంది. ముగిసిన విద్యా సంవత్సరంలో చేయించుకున్న పనికి మళ్లీ విద్యా సంవత్సరం వస్తున్నా పారితోషికం విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

ఇంక్రిమెంట్‌కు బదులు పారితోషికం

2022–23లో జగన్‌ ప్రభుత్వం 4,200కు పైగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. ఇప్పటివరకూ 1 నుంచి 5 తరగతులకు సెకండరీ గ్రేడ్‌ టీచర్లు బోధిస్తుంటే, ఆ స్థానంలో సబ్జెక్టు టీచర్లతో పాఠాలు చెప్పిస్తామని ప్రకటించింది. అలా చెప్పించాలంటే ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలి. కానీ అలాచేస్తే అదనపు భారం పడుతుందని భావించిన ప్రభుత్వం పదోన్నతుల స్థానంలో పని సర్దుబాటును ప్రవేశపెట్టింది. అంటే ఎస్జీటీలు ఉన్నత పాఠశాలలకు వెళ్లి సబ్జెక్టులు బోధిస్తే వారికి ఇంక్రిమెంట్లకు బదులుగా నెలకు రూ.2,500 పారితోషికం ఇస్తారు. వాస్తవానికి ఈ విధానం గతంలో ఎప్పుడూ లేదు. ఇస్తే ప్రమోషన్‌ ఇవ్వాలి, లేదంటే లేదు. ఇలా పని సర్దుబాటు ఏమిటంటూ టీచర్లు దీన్ని వ్యతిరేకించారు. కానీ, టీచర్లపై ఒత్తిడి చేసిన పాఠశాల విద్యాశాఖ బలవంతంగా వారిని ఉన్నత పాఠశాలలకు పంపింది. జూలైలో బడులు తెరిస్తే సగానికి పైగా విద్యా సంవత్సరం అయిపోయాక తీరికగా జనవరి నుంచి వీరిని సర్దుబాటు చేసింది. జనవరి నుంచి ప్రతినెలా వారికి రూ.2,500 ఇవ్వాలి. కానీ నిర్లక్ష్యం చేసింది. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు నాలుగు నెలలకు ఒక్కో టీచర్‌కు రూ.10 వేలు ఇవ్వాలి. మొత్తం 4,500 మందికి రూ.4.5 కోట్లు చెల్లించాలి. ప్రభుత్వం విద్యారంగంపై చేస్తున్న ఖర్చులతో పోల్చి చూస్తే ఇది చాలా చిన్నదే.. అయినాసరే చూద్దాం చేద్దాం అంటూ అధికారులు కాలం వెళ్లదీశారు. విద్యా సంవత్సరం ముగిసినా ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ప్రభుత్వం మాటలు నమ్మి ఉన్న పాఠశాలను కాదని దూరమైనా ఉన్నత పాఠశాలకు వెళ్లామని, దీనివల్ల అనవసరంగా నష్టపోయామని టీచర్లు గగ్గోలు పెడుతున్నారు. పారితోషికం ఇవ్వలేనప్పుడు ఉత్తుత్తి ఉత్తర్వులు ఎందుకని నిలదీస్తున్నారు. కాగా, పని సర్దుబాటునే పదోన్నతి అన్నట్లుగా అప్పట్లో పాఠశాల విద్యాశాఖ ప్రచారం చేసింది. ఉన్నత పాఠశాలలకు చాలామంది వెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో, పని సర్దుబాటుకు నో చెప్తే భవిష్యత్తులో ప్రమోషన్‌ నష్టపోతారంటూ బెదిరించారు. దీంతో టీచర్లు తప్పని పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్లారు. ఇంక్రిమెంట్లు లేకపోయినా పారితోషికంతో సర్దుకోవచ్చని భావించారు. కానీ చివరికి పారితోషికం కూడా ఇవ్వకపోవడంతో అనవసరంగా బడి మారామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

మరో ఉత్తుత్తి ప్రమోషన్‌

ఉన్నత పాఠశాలల్లో బాలికల కోసం ప్రారంభించిన 292 హైస్కూల్‌ ప్లస్‌లలో 1,746 మంది స్కూల్‌ అసిస్టెంట్లను నియమించే ప్రక్రియ ప్రారంభించింది. ఇంటర్‌ బోధన కావడంతో స్కూల్‌ అసిస్టెంట్లకు పోస్ట్‌ గ్రాడ్యుటేట్‌ టీచర్లు (పీజీటీ)గా ప్రమోషన్‌ ఇస్తామని మొదట్లో అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు పీజీటీలుగా పదోన్నతి ఇవ్వట్లేదని, వారు స్కూల్‌ అసిస్టెంట్లుగానే ఇంటర్‌ పాఠాలు చెప్పాలని మెలిక పెట్టింది. అందుకోసం ఒక ఇంక్రిమెంట్‌ ఇస్తామని పేర్కొంది. రెగ్యులర్‌ పదోన్నతి ఇస్తే రెండు ఇంక్రిమెంట్లు వస్తాయి. కానీ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు పనిభారం పెరిగినా, ఒక ఇంక్రిమెంట్‌తోనే పనిచేయాలనే షరతు విధించింది. దీంతో ఈ ఉత్తుత్తి ప్రమోషన్లు మాకొద్దంటూ టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.

Updated Date - 2023-05-22T12:31:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising