Bangalore: ఓటర్లు ఆశీర్వదించకుంటే భార్యతో కలసి విషం తీసుకుంటానన్న కాంగ్రెస్ అభ్యర్థి..!
ABN, First Publish Date - 2023-05-04T21:41:50+05:30
యాదగిరి జిల్లా సీనియర్ రాజకీయ నేత, గురు మిట్కల్ కాంగ్రెస్ అభ్యర్థి బాబురావ్ చించన్‌సూర్ భావోద్వేగంలో నోరు జారారు. ఎన్నికల్లో ఓటర్లు ఆశీర్వదించకుంటే భార్యతో..
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): యాదగిరి జిల్లా సీనియర్ రాజకీయ నేత, గురు మిట్కల్ కాంగ్రెస్ అభ్యర్థి బాబురావ్ చించన్‌సూర్ భావోద్వేగంలో నోరు జారారు. ఎన్నికల్లో ఓటర్లు ఆశీర్వదించకుంటే భార్యతో కలసి విషం తీసుకుంటానని కన్నీరు పెట్టారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక బుధవారం తొలిసారి ఆయన ప్రచారం చేశారు. నామినేషన్‌కు ముందే రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఆసుపత్రిలో గడుపుతున్నారు. ఇంకా చికిత్సలు కొనసాగుతున్నా ప్రత్యేకమైన అంబులెన్స్ వంటి కారులో ప్రచారం ప్రారంభించారు. ముఖం, కాళ్లతోపాటు పలుచోట్ల గాయాలతోనే ప్రచారానికి వచ్చారు.
ఈ సందర్భంగా చించన్‌సూర్ మాట్లాడుతూ 50 శాతం కోలుకున్నానని మరో ఆరువారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉందన్నారు. వీల్‌చెయిర్‌లో కూడా బయటకు వెళ్లరాదని డాక్టర్లు సూచించిన మేరకు వాహనంలో వచ్చానన్నారు. ఓటరు దేవుళ్లు ఆశీస్సులు అందించాలని కోరారు. 2008, 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన కొంతకాలం మంత్రిగాను పనిచేశారు. 2018లో జేడీఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత బీజేపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇటీవలే బీజేపీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
Updated Date - 2023-05-05T19:06:43+05:30 IST