Israeil - Hamas:గాజా శరణార్థుల శిబిరంపై దాడి.. ఇద్దరు హమాస్ కమాండర్లు మృతి
ABN , First Publish Date - 2023-11-02T20:29:55+05:30 IST
ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. గాజా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు హమాస్ కమాండర్లు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. సరిహద్దులోని రఫా క్రాసింగ్‌ని గురువారం తిరిగి తెరిచినట్లు గాజా సరిహద్దు అధికారులు తెలిపారు. దాదాపు 7,500 మంది విదేశీ పాస్‌పోర్ట్ హోల్డర్లు దాదాపు రెండు వారాల పాటు గాజాను విడిచిపెడతారని వెల్లడించారు.
గాజా : ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. గాజా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు హమాస్ కమాండర్లు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. సరిహద్దులోని రఫా క్రాసింగ్‌ని గురువారం తిరిగి తెరిచినట్లు గాజా సరిహద్దు అధికారులు తెలిపారు. దాదాపు 7,500 మంది విదేశీ పాస్‌పోర్ట్ హోల్డర్లు దాదాపు రెండు వారాల పాటు గాజాను విడిచిపెడతారని వెల్లడించారు. జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 195 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు తెలుస్తోంది. 120 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని, 777 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, ఫిన్లాండ్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, జోర్డాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ కి చెందిన పాస్‌పోర్ట్ హోల్డర్ల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో ఇరువైపుల ఇప్పటివరకు 10 వేలకుపైగా మరణించారు. ఇజ్రాయెల్ దాడుల్లో అమాయకపు ప్రజలు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. హమాస్ చాలా మందిని బందీలుగా చేసుకుంది. జనసాంద్రత అధికంగా ఉండే గాజా నగరంలోని అల్-ఖుడ్స్ ఆసుపత్రి చుట్టూ గురువారం తెల్లవారుజామున భారీ పేలుళ్లు వినిపించాయని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ తెలిపింది.
ఇజ్రాయెల్ అధికారులు ఆసుపత్రిని వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులు ప్రమాదంలో ఉన్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజాలోని అతిపెద్ద శరణార్థుల శిబిరం అయిన జబాలియాలో మంగళ, బుధవారాల్లో జరిపిన దాడుల్లో చాలా మంది హమాస్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. "జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల తరువాత అనేక మంది పౌరులు చనిపోయారు. యుద్ధ తీవ్రత,నేరాల సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే పరిణామం" అని UN మానవ హక్కుల హైకమిషనర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గాజాలోని క్యాన్సర్ హాస్పిటల్‌తో సహా చాలా ఆసుపత్రులు ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఇంధనాన్ని సైనిక అవసరాల కోసం మళ్లిస్తారనే ఆందోళనతో మానవతావాద కాన్వాయ్‌లు ఇంధనాన్ని తీసుకురావడానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. ఇండోనేషియా హాస్పిటల్‌లోని ప్రధాన విద్యుత్ జనరేటర్ ఇంధన కొరత కారణంగా పనిచేయడం లేదని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్-ఖుద్రాతెలిపారు. మరికొద్ది రోజుల్లో ఇంధనం అందకపోతే విపత్తు తప్పదని ఆయన అన్నారు. US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ రెండోసారి ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్నారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సహా ఇజ్రాయెల్ అధికారులను కలవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హమాస్ చేతిలో ఉన్న బందీలందరినీ విడుదల చేయడంపై ఈజిప్ట్, ఖతార్ నేతృత్వంలో చర్చలు జరుపుతామని మిల్లర్ చెప్పారు. US ప్రతినిధుల సభ ఇజ్రాయెల్‌కు14.3 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించే బిల్లును ఇవాళ ఆమోదించింది. అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్ - హమాస్ దాడుల్లో ఇప్పటివరకు 3,648 మంది పిల్లలతో సహా 8,796 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.